ETV Bharat / state

అనంతలో కరోనా కలకలం... ఎవరిది నిర్లక్ష్యం?

author img

By

Published : Apr 15, 2020, 12:23 PM IST

ఏకంగా ఓ తహసీల్దారే కరోనా బారినపడటం అనంతపురం జిల్లాలో గుబులు రేపుతోంది. ఇప్పటికే జిల్లాలో పలువురు వైద్యులు, వైద్య సిబ్బందికి కూడా వ్యాధి సోకింది. వ్యాధి లక్షణాలున్నా రోగుల విషయంలో జరిగిన వరుస తప్పిదాలే ఈ పరిస్థితికి కారణమనే వాదనలు వినిపిస్తున్నాయి.

virus-spreading-in-anantapur
అనంతలో కరోనా కలకలం... నిర్లక్ష్యం ఎవరిది?

అనంతలో కరోనా కలకలం... నిర్లక్ష్యం ఎవరిది?

అనంతపురం జిల్లాలో కరోనా మహమ్మారి ఎటు దారి తీస్తోందో అర్థంకాని పరిస్థితి నెలకొంది. మార్చి 30వ తేదీన లేపాక్షికి చెందిన ఓ బాలుడికి, అదేరోజు ఓ మహిళకు కరోనా సోకడంతో మొదలైన పాజిటివ్‌ కేసుల సంఖ్య ప్రస్తుతం 20కు చేరింది. మార్చి 31న హిందూపురం నుంచి అనంతపురం ఆసుపత్రికి వైరస్‌ లక్షణాలతో వచ్చిన ఓ వృద్ధుడికి చెస్ట్‌వార్డులో ఉంచి చికిత్స చేశారు. 4 రోజులకు చనిపోగా ఆ తర్వాత నమూనాలు తీసి పంపారు. అతనికి పాజిటివ్‌ అని తేలింది. ఫలితం వచ్చే సమయానికి బంధువులు వృద్ధుడి అంత్యక్రియలు పూర్తిచేశారు. ఆ తర్వాత ఆ వృద్ధుడి భార్య, కుమారుడు, మృతదేహాన్ని తరలించిన అంబులెన్సు డ్రైవర్‌కు వ్యాధి నిర్ధరణ అయ్యింది.

వృద్ధుడికి వైద్యం చేసిన 24 మందిని అధికారులు క్యారంటైన్‌కు పంపారు. వారిలో ఇద్దరు వైద్యులు, నర్సులకు కరోనా వచ్చింది. అనంతపురం ఛాతీ వార్డులో హిందూపురం వృద్ధుడి పక్క మంచంలో చికిత్స పొందిన కళ్యాణదుర్గానికి చెందిన మరో వృద్ధుడికి వైరస్‌ సోకింది. అతని అంత్యక్రియల విషయంలోనూ అధికారులు అప్రమత్తంగా వ్యవహరించలేకపోయారు. వంద మందికిపైగా పాల్గొని అంత్యక్రియలు పూర్తిచేశాక ఆ వృద్ధుడికి వైరస్ సోకినట్లు పరీక్షల్లో నిర్ధరించారు. ఈ వృద్ధుడి మృతితో దాదాపు వంద మందిని క్వారంటైన్‌కు తరలించారు.

తహసీల్దార్​కు కరోనా

జిల్లాకు చెందిన ఓ తహసీల్దారుకి కూడా కరోనా ఉందని మంగళవారం తేలింది. ఆ తహసీల్దార్ హిందూపురం వృద్ధుడి ద్వారా వ్యాధి బారిన పడిన అంబులెన్సు డ్రైవర్‌ ఇంటి సమీపంలో నివాసం ఉంటారు. ఈ తహసీల్దార్ గత పదిరోజులుగా... అనేక మంది అధికారులతో పాటు , ఇతరులను కలిశారు. ఆ తహసీల్దార్‌తో నిత్యం కలిసి పనిచేసే 33 మందిని జిల్లా అధికారులు గుర్తించారు. విధులు నిర్వహిస్తున్న ప్రాంతం...కర్ణాటక సరిహద్దులో ఉన్నందున నిత్యావసర సరకుల రవాణా అనుమతుల కోసం అనేక మంది తహసీల్దార్ వద్దకు వచ్చారని సిబ్బంది చెబుతున్నారు. వైరస్ వ్యాప్తి నిరోధక చర్యల విధులు కూడా నిర్వహించినందున వందలాది మందితో మాట్లాడారని తెలుస్తోంది. వీరిలో ప్రజాప్రతినిధులు సైతం ఉన్నట్లు సమాచారం.

కిరాణా వ్యాపారికి కొవిడ్ పాజిటివ్

హిందూపురంలోనే సోమవారం ఓ కిరాణాదుకాణదారుకు వైరస్ నిర్ధరణైంది. మెరుగైన వైద్యం చేయించుకుంటామని బంధువులు కోరినందున.... అంబులెన్సులో అతనిని బెంగళూరు ఆసుపత్రికి పంపించారు. కిరాణ వ్యాపారికి ఎవరి ద్వారా వ్యాధి వచ్చిందనే విషయాన్ని అధికారులు శోధిస్తున్నారు.

అసిస్టెంట్ ప్రొఫెసర్​కి కరోనా పాజిటివ్

జిల్లాలో ఓ వైద్యురాలికీ కరోనా పాజిటివ్ వచ్చింది. అనంతపురం ఆసుపత్రి ఛాతీ విభాగంలో మృతి చెందిన కళ్యాణదుర్గం వృద్ధుడికి ఈ మహిళా డాక్టర్ వైద్యం చేసినట్లుగా గుర్తించారు. మెడికల్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేసే ఈ వైద్యురాలికి పాజిటివ్ వచ్చిన వెంటనే ఆమె ఎంత మంది వైద్యులతో కలిసి పనిచేశారనే విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారు. అధికారులు అప్రమత్తంగా ఉండి ఉంటే ఈ వ్యాప్తికి ఆదిలోనే అడ్డుకట్ట పడేదనే వాదన జిల్లాలో గట్టిగా వినిపిస్తోంది.

ఇదీ చదవండి:

గ్రామ సహాయకుల ద్వారా ధాన్యం కొనుగోలు: మంత్రి కన్నబాబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.