ETV Bharat / state

జర్మన్ టెక్నాలజీతో 2 ఆసుపత్రుల నిర్మాణం.. సౌకర్యాలు సకలం!

author img

By

Published : May 23, 2021, 10:44 AM IST

జర్మన్ టెక్నాలజీతో రెండు తాత్కాలిక ఆసుపత్రులు
జర్మన్ టెక్నాలజీతో రెండు తాత్కాలిక ఆసుపత్రులు

కరోనా రోగుల చికిత్స కోసం అనంతపురం జిల్లాలో జర్మన్ టెక్నాలజీతో మరో రెండు తాత్కాలిక ఆసుపత్రులు సిద్ధమవుతున్నాయి. తాడిపత్రిలో 500 పడకల ఆస్పత్రిని ఆర్జా ఉక్కు కర్మాగారం సహకారంతో ఏర్పాటు చేస్తున్నారు. అనంతపురంలోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వద్ద ఆక్సీజన్ సౌకర్యం ఉన్న 300 పడకల ఆసుపత్రిని నిర్మిస్తున్నారు. జర్మన్ సాంకేతిక పరిజ్ఞానంతో రూపుదిద్దుకుంటున్న ఈ తాత్కాలిక ఆసుపత్రుల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు.

జర్మన్ టెక్నాలజీతో రెండు తాత్కాలిక ఆసుపత్రులు

అనంతపురం జిల్లాలో కరోనా రోగులకు ప్రాణవాయువు అందించి రక్షించటానికి కొత్తగా రెండు ఆసుపత్రులు అందుబాటులోకి వస్తున్నాయి. జర్మన్ సాంకేతిక పరిజ్ఞానంతో 800 పడకలతో తాత్కాలిక షెడ్లు నిర్మిస్తున్నారు. తాడిపత్రి శివారులోని ఆర్జా ఉక్కు కర్మాగారం సమీపంలో నిర్మిస్తున్న 500 పడకల ఆసుపత్రికి ఆ పరిశ్రమ నుంచి రోగుల పడకల వద్దకే ఆక్సిజన్ అందించనున్నారు. సర్జ్ ట్యాంకు నిర్మించి పరిశ్రమ నుంచి 700 మీటర్ల పైపులైను ఏర్పాటు చేశారు.

ఇక్కడ 150 మంది వైద్యులు, నర్సింగ్ సిబ్బంది అవసరం ఉంటుందని అంచనా వేసిన జిల్లా యంత్రాంగం, నియామక ప్రక్రియను మరో 2 రోజుల్లో పూర్తి చేయనుంది. 2 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న ఈ జర్మన్ హ్యాంగర్ లో వైద్యులు, సిబ్బంది, రోగులు, సహాయకులు అంతా కలిపి 1500 మంది ఉంటారని అంచనా వేసి ఏర్పాట్లు చేస్తున్నారు.

అనంతపురం నగరంలోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఆవరణలో కూడా జర్మనీ సాంకేతిక పరిజ్ఞానంతో 300 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఆసుపత్రిలోనూ రోగులకు సిలెండర్లు ఏర్పాటు చేసి ప్రాణవాయువు అందించనున్నారు. మాజీ మంత్రి పరిటాల సునీత సూచనల మేరకు ఎంటర్ ప్రెన్యూర్ ఆర్గనైజేషన్ ప్రతినిధులు 50 ఆక్సిజన్ కాన్సన్ ట్రేటర్లు వితరణ చేశారు. వైరస్ తీవ్రత తక్కువగా ఉన్న రోగులను ఈ ఆసుపత్రిలో ఉంచనున్నారు.

ప్రాణాపాయంతో వచ్చే కరోనా రోగులను తాడిపత్రికి పంపించి నిరంతర ఆక్సిజన్ అందించే పడకలపై వైద్యం చేయనున్నారు. తాడిపత్రి ఆసుపత్రి సేవలు మరో రెండు రోజుల్లో మొదలవుతాయని అధికారులు చెబుతున్నందున అనంతపురం జిల్లాలో రోగులకు ఆక్సిజన్ కొరత కష్టాలు తీరనున్నాయి.

ఇదీ చదవండి:

ఇంత కొరత ఉన్నప్పుడు ప్రైవేటు ఆసుపత్రులకు అనుమతులా?: సీఎం జగన్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.