ETV Bharat / state

Timbaktu Organic Brand : కరవు నేలలో.. సిరుల దారి చూపించి

author img

By

Published : Feb 24, 2022, 9:41 AM IST

Timbaktu Collective : కరవు నేలలో... సిరులు కురిపించాలనే పట్టుదలతో.. వందల గ్రామాలకు కాలినడకనే వెళ్లారామె. నాడు ఆమె వేసిన పొదుపు విత్తనం ఇంతింతై... నేడు 183 గ్రామాల్లో విస్తరించింది. వేల మంది మహిళలని సేంద్రియ సాగు వైపు నడిపించి, టింబక్టు ఆర్గానిక్‌ బ్రాండ్‌కి శ్రీకారం చుట్టారామె. అనంతపురానికి చెందిన మేరీ వట్టమట్టమ్‌. 25 వేల మంది మహిళా పొదుపు సైనికులను ముందుండి నడిపిస్తున్నారు మేరీ.

Timbaktu Organic Brand
కరువు నేలలో..సిరుల దారి చూపింది...

Timbaktu Organic Products : కరవు నేలలో... సిరులు కురిపించాలనే పట్టుదలతో.. వందల గ్రామాలకు కాలినడకనే వెళ్లారామె. నాడు ఆమె వేసిన పొదుపు విత్తనం ఇంతింతై... నేడు 183 గ్రామాల్లో విస్తరించింది. వేల మంది మహిళలని సేంద్రియ సాగు వైపు నడిపించి, టింబక్టు ఆర్గానిక్‌ బ్రాండ్‌కి శ్రీకారం చుట్టారామె. ఆమే.. అనంతపురానికి చెందిన మేరీ వట్టమట్టమ్‌. 25 వేల మంది మహిళా పొదుపు సైనికులను ముందుండి నడిపిస్తున్నారు మేరీ.

కేరళ రాష్ట్రం పాలక్కడ్‌ జిల్లాలో వ్యవసాయ కుటుంబంలో పుట్టిన మేరీ..ముప్ఫై ఏళ్లుగా వేల మంది గ్రామీణ స్త్రీలని ఆర్థిక సాధికారతవైపు నడిపిస్తున్నారు. ఆమె సోషల్‌ వర్క్‌లో పీజీ చేశారు. తన ఇంట్లోనే కాదు తనకు తెలిసిన అన్ని కుటుంబాల్లోనూ డబ్బు విషయంలో ఆడవాళ్ల వెనుకబాటుని స్పష్టంగా చూశారామె. ఆర్‌డీటీ సంస్థ ఆధ్వర్యంలో ‘యంగ్‌ ఇండియా’ అనే ప్రాజెక్టు కోసం అనంతపురంలో పనిచేస్తున్నప్పుడు.. అక్కడి స్త్రీలు అవసరానికి అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి, జీవితమంతా ఆ అప్పు తీర్చడం కోసమే కష్టపడటాన్ని గమనించారు. ఆ పరిస్థితుల్లో మార్పు తీసుకురావాలనుకున్నారు. ఇందుకోసం తన సహచర ఉద్యోగి, పశ్చిమ బంగకు చెందిన బబ్లూ గంగూలీతో కలిసి చెన్నేకొత్తపల్లి సమీపంలో 33 ఎకరాల్లో ‘టింబక్టు కలెక్టివ్‌’ అనే స్వచ్ఛంద సంస్థను ప్రారంభించారు.

1992లో చిన్నపల్లి గ్రామంలో పది మంది ఆడవాళ్లతో ఒక సంఘం ఏర్పాటు చేసి... ఒక్కొక్కరి నుంచీ రూ.10 పొదుపుగా సేకరించారు. మూడు నెలల తర్వాత పొదుపు చేసిన దానికి మూడురెట్లు ఎక్కువ వేసి రుణం ఇచ్చారు. ఆ డబ్బుతో మగవాళ్లపై ఆధారపడకుండా, ఏదైనా ఉపాధి మార్గాన్ని వెతుక్కునే దిశగా ప్రోత్సహించారు. క్రమంగా ఇప్పుడా పొదుపు రుణం లక్షన్నర రూపాయలకు చేరుకుంది. వేల మంది స్త్రీలు ఆ రుణం తీసుకుని తమకాళ్లపై తాము నిలబడి పిల్లలని చదివించుకుంటున్నారు. ఈ పొదుపు ప్రయాణంలో మేరీ ఎదుర్కొన్న కష్టాలు తక్కువేం కాదు. ఎంత చెప్పినా మొదట్లో ఎవరూ సమావేశాలకు వచ్చేవారు కాదు. ఒకవేళ వచ్చినా చుట్టూ మగవాళ్లు చేరి హేళన చేసేవారు. ప్రజా రవాణా అంతంతమాత్రంగా ఉండే రోజుల్లో మేరీ కాలినడకనే గ్రామాలకు వెళ్లి, మహిళలని ఒక్కటి చేశారు. ఆదిశక్తి, మహిళాశక్తి, అనంతశక్తి, దుర్గాశక్తి అంటూ ఎన్నో సొసైటీలని ఏర్పాటు చేశారు. వాటన్నింటినీ కలిపి మహాశక్తిగా ఒక్కటి చేశారు. పది మందితో మొదలైన ఈ పొదుపు ఉద్యమంలో నేడు 183 గ్రామాలకు చెందిన పాతిక వేలమంది సభ్యులున్నారు. ప్రారంభంలో రూ.2 లక్షల వార్షిక లావాదేవీలు నడిపిన ఈ సంస్థ నేడు రూ.38 కోట్ల పొదుపు చేసింది. ఇక్కడ ఏ వ్యవహారమన్నా మహిళలే స్వయంగా నిర్వహిస్తారు. మగవాళ్ల ప్రమేయం ఎక్కడా ఉండదు. ‘పొదుపు, రుణాల పేరుతో డబ్బు ఆశచూపించి ఎన్నో చిట్ ఫండ్‌ కంపెనీలు, ఇతర సంస్థలు బోర్డు తిప్పేసిన సంఘటనలు ఇక్కడ ఎన్నో జరిగాయి.

అలాంటి సంస్థల దురాశకు బలవ్వకుండా స్త్రీలల్లో ఆర్థిక చైతన్యం తీసుకొచ్చి ఈ పొదుపు ఉద్యమాన్ని నడిపిస్తున్నాం. భవిష్యత్తులో మహిళా బ్యాంకు స్థాపనే లక్ష్యంగా సాగుతున్నాం’ అనే మేరీ సేంద్రియ వ్యవసాయంలోనూ పెద్దఎత్తున మహిళల్ని ప్రోత్సహిస్తున్నారు. రామగిరి, చెన్నేపల్లి, రొద్దం మండలాల్లోని 2,500 మంది మహిళలు మేరీ ఆధ్వర్యంలో సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు. వీళ్లు ఉత్పత్తి చేసిన పప్పుధాన్యాలు, నూనెలు, చిరుధాన్యాలని టింబక్టు ఆర్గానిక్‌ ప్రొడక్ట్స్‌ పేరుతో హైదరాబాద్‌, విజయవాడ, బెంగళూరుల్లో విక్రయిస్తున్నారు. కొత్తగా మాంసం పచ్చళ్ల తయారీపై శిక్షణ తీసుకుని వాటి విక్రయాలకు సిద్ధంగా ఉన్నారు. మేరీ చిన్నకుమార్తె దెహిత గంగూలి అనంత జిల్లాలోని సేంద్రియ సాగు పనులని పర్యవేక్షిస్తున్నారు. పెద్దమ్మాయి మనీషా కైరళీ కన్సల్టెంట్‌గా పనిచేస్తుంటే, అబ్బాయి అశోక్‌ విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నాడు.

వేధింపులపై పోరాటం.. తన పొదుపు సంఘంలో సభ్యురాలిగా ఉన్న ఒకామెను భర్తే హత్యచేసి, దాన్ని ఆత్మహత్యగా చూపించాలనుకున్నాడు. ఆ అమ్మాయి తల్లిదండ్రులు, పిల్లల బాధను చూసిన వారి తరఫున న్యాయపోరాటం మొదలు పెట్టారు మేరి. నిందితుడిపై కేసు నమోదు చేయించారు. ఈ ఘటన తర్వాత నుంచీ మహిళలపై జరుగుతున్న వేధింపులు, అత్యాచారాలు, గృహహింస తదితరాలపై చైతన్యం తెచ్చేందుకు కార్యక్రమాలు మొదలుపెట్టారు. ప్రతి నెలా గ్రామాల్లో... న్యాయమూర్తులతో న్యాయసేవా సదస్సులు నిర్వహిస్తున్నారు. తల్లిదండ్రుల ఆలానాపాలనా కరయిన చిన్నారుల కోసం ‘ప్రకృతి ఒడి’ అనే కేంద్రాన్ని ప్రారంభించి వారిని చదివిస్తున్నారు. గ్రామసిరి పేరుతో వికలాంగులకూ అండగా ఉంటున్నారు. తనకు ఏ సంబంధమూ లేని ప్రాంతం కోసం జీవితాన్నే వెచ్చించి శ్రమిస్తున్న మేరీ లాంటి స్ఫూర్తిప్రదాతలు అరుదు కదూ.

ఇదీ చదవండి :

KIA RECORD: అనంతపురం కియా యూనిట్‌ రికార్డు... రెండున్నరేళ్లలో..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.