TDP Conference: సీమకు నీటి కోసం దిల్లీలో పోరాడతాం : బాలకృష్ణ

author img

By

Published : Oct 17, 2021, 3:47 PM IST

Updated : Oct 18, 2021, 4:32 AM IST

సీమకు నీటి కోసం అవసరమైతే దిల్లీకి వెళ్లి పోరాటం

సీమకు నీటి కోసం అవసరమైతే దిల్లీకి వెళ్లి పోరాటం చేస్తామని హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు. అనంతపురం జిల్లా హిందూపురంలో రాయలసీమ ప్రాజెక్టుల భవిష్యత్‌పై.. ఆ ప్రాంత తెదేపా నేతలు సదస్సు నిర్వహించారు. సదస్సుల్లో పాల్గొన్న బాలకృష్ణ.. రాయలసీమకు నీరు ఇచ్చే ఆలోచన ప్రభుత్వానికి లేదన్నారు.

రాయలసీమకు నీటి కోసం అవసరమైతే దిల్లీకి వెళ్లి పోరాడతామని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పేర్కొన్నారు. హంద్రీనీవా ద్వారా చెరువులకు నీరిచ్చే ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని విమర్శించారు. సీమ నీటి ప్రాజెక్టుల భవిష్యత్తుపై ఆదివారం అనంతపురం జిల్లా హిందూపురంలో రాయలసీమ తెదేపా నేతల సదస్సులో ఆయన మాట్లాడారు. తెదేపా హిందూపురం పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు బీకే పార్థసారథి అధ్యక్షతన నిర్వహించిన సదస్సులో బాలకృష్ణతో పాటు మాజీ మంత్రులు కాలవ శ్రీనివాసులు, కేఈ ప్రభాకర్‌, అమరనాథరెడ్డి, పల్లె రఘునాథరెడ్డి, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు తదితరులు పాల్గొన్నారు.

అనంతపురం జిల్లాలో అర్ధాంతరంగా ఆగిన జీడిపల్లి-బీటీపీ, జీడిపల్లి-పేరూరు ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం సత్వరం పూర్తి చేయాలని ఎమ్మెల్యే బాలకృష్ణ డిమాండ్‌ చేశారు. కరవు ప్రాంతం, అత్యల్ప వర్షపాతమున్న రాయలసీమకు తాగు, సాగునీటి అవసరాలకు హంద్రీనీవా, గాలేరు నగరికి అధికారికంగా నీటిని కేటాయించాలని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు కోరారు. శ్రీశైలం జలాశయం నీటిని నిబంధనలకు విరుద్ధంగా విద్యుదుత్పత్తికి తెలంగాణ వినియోగిస్తూ రాయలసీమకు అన్యాయం చేస్తోందని సమావేశంలో పాల్గొన్న పలువురు వక్తలు ఆరోపించారు. ‘కృష్ణా జలాల్లో 811 టీఎంసీల్లో ఆంధ్రప్రదేశ్‌ 512, తెలంగాణ 299 టీఎంసీలను వాడుకోవాల్సి ఉంది. దీనికి భిన్నంగా నీటిపై అజమాయిషీకి తెలంగాణ ప్రయత్నిస్తున్నా.. ఏపీ ముఖ్యమంత్రి నోరు మెదపడం లేదు. నీటి హక్కులను సీఎం జగన్‌ తెలంగాణకు తాకట్టు పెట్టారు. రాయలసీమకు సాగు, తాగునీరు అందించేందుకు దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ హంద్రీనీవా చేపడితే.. చంద్రబాబునాయుడు ఈ పథకానికి నిధులు కేటాయించి చెరువులకు నీరందించారు. ప్రస్తుత ముఖ్యమంత్రి దీని అభివృద్ధికి నిధులు కేటాయించకపోవటం బాధాకరం. ఏటా 300 టీఎంసీల నీరు సముద్రం పాలవుతున్నప్పటికీ పట్టించుకోవడం లేదు. గోదావరి, కృష్ణా, పెన్నా అనుసంధాన ప్రాజెక్టులను ప్రాధాన్య క్రమంలో చేపట్టాలి. మెజారిటీ సంఖ్యలో ఉన్న వైకాపా పార్లమెంటు సభ్యులు స్వార్థం కోసం కేంద్రంతో లాబీయింగ్‌ చేస్తున్నారే తప్ప అభివృద్ధి గురించి ఆలోచించటం లేదు. రాయలసీమకు నీరు తెచ్చేందుకు పోరాడతాం. రెండో దశ కింద క్షేత్రస్థాయి సదస్సులు ఏర్పాటుచేసి ప్రజలను చైతన్యపరుస్తాం’ అని సమావేశంలో తీర్మానించారు. తప్పుపట్టారు.

సీమకు నీటి కోసం అవసరమైతే దిల్లీకి వెళ్లి పోరాటం. రాయలసీమ అభివృద్ధికి ఎన్టీఆర్‌ కృషి చేశారు. సీమ కోసం ఎన్టీఆర్ హంద్రీనీవా ప్రాజెక్ట్‌ తెచ్చారు. హంద్రీనీవా ద్వారా చెరువులకు నీరిచ్చే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు. పుష్కలంగా నీరు చెరువులకు అందించడంలేదు. కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారు. రాయలసీమకు నీరు ఇచ్చే ఆలోచన ప్రభుత్వానికి లేదు. బీటీ ప్రాజెక్టుకు, చెరువులకు నీరివ్వాలని డిమాండ్ చేస్తున్నా. అనంత జిల్లాలో అన్ని చెరువులకు నీరు ఇవ్వాలి. -బాలకృష్ణ, హిందూపురం ఎమ్మెల్యే

ఇదీ చదవండి

krmb:కేఆర్‌ఎంబీ పరిధిలోకి.. శ్రీశైలం, సాగర్‌ విద్యుత్‌ ప్రాజెక్టులు

Last Updated :Oct 18, 2021, 4:32 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.