ETV Bharat / state

అందని పోషకం.. భూమి నిస్సారం

author img

By

Published : Oct 8, 2020, 12:08 PM IST

రైతులు సాగులో రసాయన ఎరువులు అధికంగా వాడుతున్నారు. దీని వల్ల భూమి సారం తగ్గి పంట దిగుబడి పై అధిక ప్రభావాన్ని చూపుతోంది. మునుపు ప్రభుత్వం రాయితీ ద్వారా సూక్ష్మపోషకాలను అందించేది. ప్రస్తుతం వాటిని నిలిపి వేయటంతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోంటున్నారు. దీనిపై అధికారిక ప్రకటన ఇవ్వక పోవటంతో రైతులు ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు.

fertilizers in agricultural cultivation
రసాయన ఎరువుల వాడకం

అనంతపురం జిల్లాలో వ్యవసాయ సాగులో రసాయన ఎరువుల వాడకం పెరిగింది. సేంద్రియ ఎరువుల వినియోగం తగ్గుతోంది. దీంతో భూముల్లో సూక్ష్మపోషకాలు తగ్గిపోతున్నాయి. మరోవైపు ఆశించిన స్థాయిలో పంట ఉత్పత్తులు పొందలేక రైతులు నష్టపోతున్నారు. ఈ సమస్యలను అధిగమించేందుకు కొన్నేళ్లుగా సూక్ష్మపోషక ఎరువులను రాయితీతోనూ, ఉచితంగా పంపిణీ చేశారు. ప్రస్తుతం సూక్ష్మపోషకాల పంపిణీ నిలిపేశారు. ప్రభుత్వం రాయితీని తొలగించింది. ఈ విషయం తెలియక రైతులు ఎరువుల కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. అధికారికంగా ఎలాంటి ఉత్తర్వులు రాకపోవడంతో వ్యవసాయశాఖ అయోమయంలో ఉంది.
ఫలితం ఇలా..
జిప్సం (కాల్షియం సల్ఫేట్‌): జిప్సంలో గంధకం, సున్నం ఉంటుంది. ముఖ్యంగా చౌడు భూములకు వేసుకోవాలి. వరి, వేరుసెనగ సాగుకు వినియోగిస్తే పంట ఉత్పత్తి పెరుగుతుంది.
జింకు సల్ఫేటు: జింకు మొక్క పెరుగుదలకు, జీవన రసాయనిక చర్యలకు దోహదపడుతుంది. తెగుళ్లు దుపులోకి వస్తాయి. పంట దిగుబడి పెరుగుతుంది.
రాయితీ లేనట్టే..
భూమిలో లోపాలు ఉన్నాయి. పంటల ఉత్పత్తి, దిగుబడి తగ్గుతోందని గుర్తించిన గత ప్రభుత్వాలు కొన్నేళ్లు సూక్ష్మపోషకాలను రాయితీతోనూ, ఉచితంగా పంపిణీ చేశారు. ఏటా లక్షల్లో రైతులకు అందించారు. 2016లో 50 శాతం, 2017, 2018లో 100 శాతం, 2019లో 70 శాతం చొప్పున రాయితీ ప్రకటించారు. ఈ ఏడాది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతు భరోసా పథకానికి లింకు పెట్టాయి. ప్రతి రైతుకు రూ.13,500 చెల్లిస్తుండటంతో సూక్ష్మపోషకాల ఎరువుల రాయితీలను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఆపేసినట్లు సమాచారం.
2020 ఏడాదికి ఎరువుల సరఫరా పూర్తిగా నిలిపేశారు. 2019లో ఎరువుల నిల్వలను పూర్తి ధరకు రైతులకు అందించేందుకు అందుబాటులో ఉంచారు.
వ్యవసాయశాఖ మెలిక
జిల్లాలో సూక్ష్మపోషకాల నిల్వలను గుర్తించారు. గోదాముల్లో సూక్ష్మపోషకాల బస్తాలన్నీ చిరిగిపోయి, పాడైపోయాయి. మొత్తం 2,120 మెట్రిక్‌ టన్నుల నిల్వలు ఉన్నట్లు వ్యవసాయశాఖ లెక్కలు తేల్చింది. ప్రస్తుతం వర్షాలు కురవడంతో యూరియాకు డిమాండు ఉంది. సూక్ష్మపోషకాలు తీసుకుంటేనే ప్రైవేటు డీలర్లకు యూరియాను సరఫరా చేస్తామని వ్యవసాయశాఖ మెలిక పెట్టింది. నిల్వలను డీలర్లకు అంటగట్టారు.
రైతుకు ఉపయోగకరం
సూక్ష్మపోషక ఎరువులు రైతులకు ఎంతో ఉపయోగకరం. పంటకు సత్తువనిస్తాయి. పంటల పెరుగుదలతో పాటు తెగుళ్లు నివారిస్తాయి. కాయ, గింజలు నాణ్యతతో పాటు దిగుబడి పెరుగుతుంది. ప్రస్తుతం వ్యవసాయశాఖ అధికారులను అడిగితే ఎరువులు రాలేదంటున్నారు. రాయితీ లేదన్నారు. - ప్రసాద్, రైతు, మర్తాడు, గార్లదిన్నె

ఉత్తర్వు రాలేదు
సూక్ష్మపోషకాల సరఫరాను ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం ఆపేసింది. గతంలో మిగిలిన నిల్వలను రైతులకు పూర్తి ధరకే అందిస్తున్నాం. నిల్వలను ప్రైవేటు డీలర్లకు సరఫరా చేశాం. డీలర్లతో సూక్ష్మపోషకాలు పొందవచ్చు. రాయితీ ఎత్తేసినట్లు ఎలాంటి ఉత్తర్వు రాలేదు. - రామకృష్ణ, జేడీఏ

ఇదీ చదవండీ...ఆర్టీసీ బస్సు కదలదు... రైలు బండిలో ఖాళీ లేదు..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.