Rains in Rayalaseema: రాయలసీమ జిల్లాలను వణికిస్తున్న వానలు

author img

By

Published : Aug 3, 2022, 8:13 PM IST

Updated : Aug 3, 2022, 10:02 PM IST

Rains in Rayalaseema

Rains in Rayalaseema: గోదావరి జిల్లాలను ఇటీవల వరదలు ముంచేస్తే.. ఇప్పుడు రాయలసీమ జిల్లాలను వాన వణికిస్తోంది. చాలాచోట్ల కాలనీలు వాగుల్లా మారాయి. రహదారులపై గుంతలు నిండడం వల్ల రాకపోకలు నిలిచాయి. ఇళ్లలోకి నీటి చేరికతో జనం అల్లాడిపోతున్నారు. ఇక వర్షాల ధాటికి ఈసారీ నష్టాల పాలవుతామని రైతులు వాపోతున్నారు.

రాయలసీమ జిల్లాల్లో వర్షాలు

Rains update: రాయలసీమ జిల్లాలను వానలు వదలడం లేదు. ఉమ్మడి కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కర్నూలు జిల్లాలోని అనేక ప్రాంతాల్లో జోరు వానతో వాగులు పొంగిపొర్లుతున్నాయి. దేవనకొండ మండలం తెర్నేకల్, కుంకునూరులో.. వర్షపు నీరు ఇళ్లలోకి చేరింది. తెర్నేకల్‌లో రహదారులు కాలువల్లా మారడంతో.. బడికి వెళ్లే విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వారిని కొందరు ట్రాక్టర్‌లో ఎక్కించుకుని పాఠశాలకు తీసుకెళ్లారు. అల్లారిదిన్నె సమీపంలో వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.

ఆదోనిలో లోతట్టు కాలనీల్లోకి వర్షపు నీరు చేరింది. దీనివల్ల ప్రజలు తీవ్రంగా అవస్థలు పడ్డారు. ఇస్వి గ్రామంలో కుంటచెరువు నిండి పెద్ద చెరువులోకి భారీగా వరద ప్రవహిస్తోంది. ఇస్వి, కడితోటలో పొలాలు నీట మునిగాయి.

ఆస్పరి మండలం పుప్పాలదొడ్డి సమీపంలో వాగు పొంగింది. పత్తికొండ నుంచి ఆస్పరి మీదుగా ఎమ్మిగనూరుకు వెళ్లే రహదారిలో వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పత్తికొండ పరిధిలో వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. పత్తి సహా పంటలన్నీ నీట మునిగాయి.

అనంతపురం జిల్లా వ్యాప్తంగా రెండు రోజులుగా జోరు వానలతో... లోతట్టు ప్రాంతాలు, రోడ్లు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల ఇళ్లలోకి నీరు చేరింది. ఎడతెరిపిలేని వర్షాలతో వాగులు, వంకలు పొంగుతున్నాయి. చెరువులు జలకళ సంతరించుకున్నాయి. పగటిపూట సాధారణ వర్షపాతం నమోదవుతుండగా... రాత్రివేళ భారీ వర్షం కురుస్తోంది.

కల్యాణదుర్గం ప్రాంతంలోనూ వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. కుందుర్పి మండలంలో 26 ఏళ్ల తర్వాత బెస్తరపల్లి చెరువు నిండింది. తిమ్మాపురం పెద్దవంక పొంగి ప్రవహిస్తోంది. ఎస్సీ కాలనీలోకి నీరు చేరి ప్రజలు అవస్థలు పడుతున్నారు. ముద్దినాయినిపల్లిలో పంట పొలాలు వర్షపునీటి పాలయ్యాయి.

శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర పరిధిలో 5 రోజులుగా కురుస్తున్న వర్షాలతో.. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులన్నీ నిండిపోయాయి. గంగులవాయిపాలెం వెళ్లే మార్గం మధ్యలో వాగు ఉద్ధృతితో రాకపోకలు నిలిచాయి. చాలాచోట్ల కల్వర్టులు, రోడ్లు తెగిపోవడం వల్ల రవాణా స్తంభించింది. కొన్నిచోట్ల పాఠశాలల ఆవరణలోకి నీరు చేరడంతో సెలవు ప్రకటించారు. వరద ప్రాంతాలను మాజీ మంత్రి రఘువీరారెడ్డి పరిశీలించారు.

సత్యసాయి జిల్లాలో నదిలో చిక్కుకున్న ఇద్దరు మహిళలు

పరిగి మండలంలో జైమంగళి నది ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో ఇద్దరు మహిళలు చిక్కుకున్నారు. కూలీకి వెళ్లి తిరిగివస్తుండగా ఈ ఘటన జరిగింది. నది మధ్యలో నిలబడి మహిళలు సాయం కోసం ఎదురుచూస్తున్నారు. మహిళలను రక్షించేందుకు పోలీసులు, రెవెన్యూ అధికారుల యత్నిస్తున్నారు.

పెనుగొండ ప్రాంతంలో వర్షపు నీరంతా ధర్మవరం మండలం మోటమర్రి దగ్గరి నుంచి చెరువులోకి చేరుతోంది. రహదారిపైనా నీటి చేరికతో రాకపోకలు నిలిచాయి. ఎగువనున్న కర్ణాటకలో భారీ వర్షాలతో చిత్రావతి నది పరవళ్లు తొక్కుతోంది. నదిపై మట్టి రోడ్డు కొట్టుకుపోవడం వల్ల.. కనంపల్లికి ప్రయాణం కష్టంగా మారింది. బుక్కపట్నం చెరువులోకి భారీగా వరద నీరు చేరుతోంది.

ఉమ్మడి కడప జిల్లాలో వేంపల్లి, చక్రాయపేట మండలాల్లో వర్షాలు హోరెత్తాయి. పాపాగ్ని నది జలకళ సంతరించుకుంది. నది ఉద్ధృతి కారణంగా అలిరెడ్డిపల్లి, తువ్వపల్లికి రాకపోకలు ఆగాయి. ఆయా గ్రామాల ప్రజలు, విద్యార్థులు నది దాటేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

ఇవీ చదవండి:

Last Updated :Aug 3, 2022, 10:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.