ETV Bharat / state

పెన్నానదిలో ఇసుక తవ్వకాలపై విచారణ.. రాత్రికిరాత్రే నీళ్లు వదిలిన వైసీపీ నాయకులు

author img

By

Published : Feb 17, 2023, 4:52 PM IST

Illegal sand mining in Penna river : పెన్నా నదిలో అక్రమ ఇసుక తవ్వకాలను అడ్డుకునేందుకు జేసీ ప్రభాకర్ రెడ్డి చేస్తున్న కృషికి.. ఎట్టకేలకు అధికారులు విచారణకు వచ్చారు. కానీ విచారణను అడ్డుకునేందుకు వైసీపీ నాయకులు ఎత్తుగడలు వేశారు. చాగల్లు జలాశయం గేట్లను తెరిచి పెన్నా నదిలోకి నీటిని విడుదల చేశారు. దీంతో రిజర్వాయర్ వద్ద నుంచి నీటి ప్రవాహంతో పాటు గోతుల్లో నీరు, ఇసుక చేరింది. పరిశీలనకు వచ్చిన అధికారులు నీటి ప్రవాహం ఉందని విచారణ చేయడం కష్టమని వెనుతిరిగి వెళ్లిపోయారు.

Illegal sand mining
Illegal sand mining

ఇసుక తవ్వకాలపై విచారణ.. రాత్రికి రాత్రే నీళ్లు వదిలిన వైసీపీ నాయకులు

Illegal sand mining in Penna River : అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం పెద్దపప్పూరులో అక్రమ ఇసుక తవ్వకాలపై విచారణను ఏదో ఒక రకంగా అడ్డుకునేందుకు వైసీపీ నాయకులు యత్నిస్తున్నారు. పెద్దపప్పూరు పరిధిలోని పెన్నా నదిలో పెద్ద ఎత్తున ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి నిరసన వ్యక్తం చేసి అధికారులకు ఫిర్యాదు చేశారు. అధికారులు ఏమాత్రం పట్టించుకోకపోవడంతో తొలుత ఇసుక అక్రమ తవ్వకాలపై కొంతమంది వ్యక్తులు నియోజకవర్గ వ్యాప్తంగా జనం గుమిగూడే ప్రాంతాల్లో కరపత్రాలను వేశారు. వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, డీఎస్పీ చైతన్యలు అక్రమ ఇసుక తవ్వకాలకు పాల్పడుతున్నారంటూ.. కరపత్రంలో ఆరోపణలు చేశారు.

ఇసుక అక్రమ తవ్వకాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ మరోసారి జేసీ ప్రభాకర్ రెడ్డి జిల్లా అధికారులను కలిసి ఫిర్యాదు చేశారు. దీనిపై అధికారులు విచారణ నిమిత్తం శుక్రవారం ఉదయం పెద్దపప్పూరు పెన్నా నది పరిసర ప్రాంతాల్లో పర్యటనకు వచ్చారు. ఈ విషయం తెలుసుకుని వైసీపీ నాయకులు ముందుగానే చాగల్లు జలాశయం గేట్లను తెరిచి పెన్నా నదిలోకి నీటిని విడుదల చేశారు. దీంతో రిజర్వాయర్ వద్ద నుంచి నీటి ప్రవాహంతో పాటు గోతుల్లోనూ నీరు, ఇసుక చేరింది.

పరిశీలనకు వచ్చిన అధికారులు నీటి ప్రవాహం ఉందని విచారణ చేయడం కష్టమని వెనుతిరిగి వెళ్లిపోయారు. ఇదంతా ముందస్తు ప్రణాళిక ప్రకారమే చేశారంటూ స్థానికులు తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. పెద్దపప్పూరులో అక్రమ ఇసుక తవ్వకాలపై రెవెన్యూ, మైనింగ్ అధికారులు సంయుక్తంగా ఇవాళ విచారణ చేస్తున్నారని తెలిసి ఈ విచారణను ఎలాగైనా అడ్డుకోవాలని ప్రయత్నం జరిగినట్లు జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు.

ఒక సీఐ ముందుగానే రాత్రి పెన్నా నదిలోకి వెళ్లి అక్కడ ఇసుక లోడింగ్ జరుగుతున్న లారీలను, భారీ వాహనాలను నది ఒడ్డుకు రావాలని చెప్పి, వాటన్నిటినీ బయటకు పెట్టిన తర్వాత, గేట్లను తీసి నీటిని విడుదల చేశారని జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపిస్తున్నారు. అయితే ఈ వాస్తవాలను నిగ్గు తేల్చాలని మరోసారి ప్రభాకర్ రెడ్డి మీడియా ముందుకు రానున్నారు.

అధికారులు పోలీసులు కుమ్మక్కై ఈ ఇసుక అక్రమ తవ్వకాల చేస్తున్న వైసీపీ నాయకులకు కొమ్ము కాస్తున్నారని జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. స్థానికుల సైతం ఇన్ని రోజులు లేని నీటి ప్రవాహం.. ఈరోజు ఎందుకు వచ్చిందని, అధికారులు విచారణ చేయడానికి వస్తున్న నేపథ్యంలోనే నీటి ప్రవాహం వచ్చిందని చెబుతున్నారు. అక్రమ ఇసుక తవ్వకాలపై గతంలో మీడియాలో కథనాలు ఇచ్చినప్పటికీ అధికారులు స్పందించని పరిస్థితి ఉంది. అయితే జేసీ ప్రభాకర్ రెడ్డి దీనిమీద పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళనలు చేస్తున్నప్పటికీ కూడా అధికారుల నుంచి ఆశించినంత మేర స్పందన లేకపోవడం సర్వత్రా విమర్శలకు దారితీస్తోంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.