ETV Bharat / state

అనంతపురంలో పంటలకు తీవ్ర నష్టం..అన్నదాతల్లో అలజడి

author img

By

Published : Nov 28, 2020, 9:38 AM IST

'నివర్‌’ దెబ్బకు జిల్లా ప్రజలు వణికిపోతున్నారు. చలి గాలులతో కునుకు లేకుండాపోతోంది. రెండోరోజు తుపాను తీవ్ర ప్రభావం చూపింది. అనంతపురం జిల్లాలోని దక్షిణ మండలాల్లో భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. చెరువులు, కుంటలు, చెక్‌డ్యామ్‌లు పొంగిపొర్లాయి. పలుచోట్ల రహదారులు కోతకు గురయ్యాయి. రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

crop damage
వర్షాలకు పాడైన పంట

అనంతపురం జిల్లాలో భారీ వర్షాల కారణంగా కోతకు వచ్చిన వరి పంట నేలవాలింది. ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. తీవ్ర నష్టం రావడంతో అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. నష్టం అంచనాల్లో తేడా..! జిల్లావ్యాప్తంగా 775 హెక్టార్లలో రూ.3.39 కోట్ల పంట నష్టం జరిగిందని వ్యవసాయ, ఉద్యానశాఖల అధికారులు అంచనా వేశారు. 15 మండలాల్లోని 82 గ్రామాల్లో 1,243 మంది రైతులకు సంబంధించిన పంటలు దెబ్బతిన్నట్లు లెక్క చూపారు. 717 హెక్టార్లలో వరి, 58 హెక్టార్లలో టమోటా నష్టపోయినట్లు తెలిపారు. కానీ కదిరి డివిజన్‌ వ్యవసాయాధికారులు మాత్రం తమ పరిధిలోనే పది మండలాల్లోని 61 గ్రామాల్లో 523 హెక్టార్ల వరి, 14 హెక్టార్లలో వేరుసెనగ దెబ్బతిందని, రూ.6.54 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు ప్రకటించారు. ఇంకా కొన్ని గ్రామాల్లో పంటనష్టం అంచనా కొనసాగుతోందని తెలిపారు.

నేలకొరిగిన స్తంభాలు
తుపాను కారణంగా జిల్లాలో రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో కదిరి డివిజన్‌ పరిధిలోని పలు ప్రాంతాల్లో 11కేవీ 19, ఎల్‌టీ స్తంభాలు 25 నేలకూలాయి. అలాగే 25 కేవీ సామర్థ్యం గల నియంత్రికతోపాటు 180 మీటర్ల విద్యుత్తు లైన్‌ కిందకు పడిపోయింది. విద్యుత్తుశాఖకు రూ.5 లక్షల వరకు నష్టం వాటిల్లిందని ఎస్‌ఈ వరకుమార్, ఈఈ సత్యనారాయణ తెలిపారు. దెబ్బతిన్న స్తంభాలు, నియంత్రిక, లైన్లను రెండు రోజుల్లో పునరుద్ధరిస్తామన్నారు. వర్షం, గాలి కారణంగా ఎక్కడైనా తీగలు తెగిపడినా, నియంత్రికలు, స్తంభాలు కిందపడిపోయినా సంబంధిత విద్యుత్తు అధికారులు, ఉద్యోగులకు లేదా టోల్‌ఫ్రీ నంబరు 1912కు సమాచారం ఇవ్వాలని వారు కోరారు.

దక్షిణ మండలాల్లో అధికం
గురువారం రాత్రి నుంచి దక్షిణ మండలాల్లో భారీ వర్షం కురిసింది. శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు తూర్పు, ఉత్తర మండలాల్లో ఓ మోస్తరు వర్షం పడింది. నంబులపూలకుంటలో 244.8 మి.మీ.లు అత్యధికంగా వర్షపాతం నమోదైంది.

చివరికి నష్టాలే

కదిరి వ్యవసాయ సబ్‌ డివిజన్‌లోని రైతులను తుపాను దెబ్బతీసింది. చేతికందిన వరిపంట నోటికందకుండా చేసింది. కోసిన పంట కుప్పలు నీటమునిగాయి. నంబులపూలకుంటలో 120, గాండ్లపెంట 84, కదిరి 75 హెక్టార్ల చొప్పున వరి పంట నేలకొరిగింది. గింజలన్నీ మొలకెత్తే పరిస్థితి.

డివిజన్‌లోని 62 ఎకరాల్లో ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లింది. 167 మంది రైతులకు సంబంధించిన 62 ఎకరాల్లోని టమోటా, బొప్పాయి, చిక్కుడు తదితర పంటలు దెబ్బతిన్నాయి. రెవెన్యూ డివిజన్‌లో 16 పక్కా గృహాలు, మరో 19 పూరిళ్లు పాక్షికంగా, నాలుగు పక్కా గృహాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. రూ.11.84 లక్షల మేర నష్టం ఏర్పడింది.

anantapur
వర్షాల కారణంగా జిల్లాలో పరిస్థితులు

మరో ఐదు రోజులు వర్ష సూచన

జిల్లాలో రాబోయే ఐదు రోజుల్లో ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని ఏఆర్‌ఎస్‌ వాతావరణ శాస్త్రవేత్త అశోక్‌కుమార్‌ తెలిపారు. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 24.7-29.5 డిగ్రీల సెల్సియస్‌ కాగా.. కనిష్ఠ ఉష్ణోగ్రతలు 16.8-19.6 డిగ్రీల సెల్సియస్‌ మధ్య నమోదయ్యాయి. ఈశాన్య దిశగా గాలులు గంటకు 16.3-20.9 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నాయి. గాలిలో తేమ ఉదయం 89-96 శాతం, మధ్యాహ్నం 71-88 శాతం నమోదవుతోందని ఆయన తెలియజేశారు.

అనంతపురం జిల్లాలో వర్షాలకు దెబ్బతిన్న పంటలు

ఇదీ చదవండి: రైతుల రెక్కల కష్టం నీళ్ల పాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.