ETV Bharat / state

మళ్లీ సైకో వస్తే.. ప్రజలు పారిపోవాల్సిందే: బాలకృష్ణ

author img

By

Published : Apr 7, 2023, 11:46 AM IST

Nandamuri Balakrishna Fire on YSRCP: ఎమ్మెల్యే బాలకృష్ణ వైఎస్సార్సీపీపై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో మరోసారి సైకో పాలన రాకుండా.. ఓటు అనే ఆయుధాన్ని వినియోగించుకోవాలని సూచించారు. యువగళం పాదయాత్రలో ఈ రోజు పాల్గొననున్న బాలకృష్ణ.. లోకేశ్​పై ప్రశంసల వర్షం కురిపించారు. యువతరానికి లోకేశ్ స్ఫూర్తి అని పేర్కొన్నారు.

బాలకృష్ణ
Nandamuri Balakrishna

రాష్ట్ర ప్రభుత్వంపై బాలకృష్ణ ఫైర్.. లోకేశ్​పై ప్రశంసల జల్లు

Nandamuri Balakrishna Fire on YSRCP: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రలో సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పాల్గొన్నారు. లోకేశ్ యువతరానికి స్ఫూర్తి అని బాలకృష్ణ అన్నారు. లోకేశ్ పాదయాత్రను అనూహ్య స్పందన వస్తుందని చెప్పారు. యువత కోసం తెలుగుదేశం పార్టీ ఏం చేసిందో లోకేశ్ తన పాదయాత్రలో వివరిస్తున్నారని బాలకృష్ణ తెలిపారు.

యువతకు లోకేశ్ స్ఫూర్తి: గార్లదిన్నె మండలం మార్తాడులోని విడిది కేంద్రంలో నారా లోకేశ్​ను బాలకృష్ణ కలిశారు. హిందూపురం నియోజకవర్గం కొడికొండం నుంచి బయలుదేరి లోకేశ్ పాదయాత్ర దగ్గరకి చేరుకున్నారు. యువగళం పాదయాత్రలో పాల్గొని సంఘీభావం తెలిపారు. లోకేశ్​ను కలిసిన మీడియాతో మాట్లాడిన బాలకృష్ణ.. లోకేశ్​పై ప్రశంసల వర్షం కురిపించారు. యువతకు లోకేశ్ స్ఫూర్తి అని కొనియాడారు. రాష్ట్రంలో పరిణామాలపై అంతా కలిసి పోరాడాలి అని బాలకృష్ణ పిలుపునిచ్చారు.

పేదవాళ్లు బతికే పరిస్థితి లేదు: ఎవరినైనా బెదిరించవచ్చని జగన్ చూస్తున్నారని బాలకృష్ణ అన్నారు. ఆంధ్రప్రదేశ్​లో అసమర్థ, చెత్త ప్రభుత్వం ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలంతా ఓటు అనే ఆయుధంతో మీ నాయకుడిని ఎన్నుకోండని కోరారు. ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రంలో అభివృద్ధి లేదని.. పరిశ్రమలు లేవని తెలిపారు. రాష్ట్రంలో పేదవాళ్లు బతికే పరిస్థితి లేకుండా పోతోందని అన్నారు. చెత్తపైన పన్ను వేసే దౌర్భాగ్య పరిస్థితి ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రంలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతి రైతులు ఉద్యమిస్తుంటే వాళ్లపై దాడి చేయిస్తున్నారని అన్నారు. కేంద్రం నుంచి నిధులు కూడా రాబట్టుకోలేని పరిస్థితిలో రాష్ట్రం ఉందని ఎద్దేవా చేశారు.

ఏపీ మరో శ్రీలంక: ఆంధ్రప్రదేశ్ మరో శ్రీలంక అవుతుందని నందమూరి బాలకృష్ణ అన్నారు. ఆర్థిక సంక్షోభం వచ్చి శ్రీలంక అధ్యక్షుడిని తరిమికొట్టారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్​లో మళ్లీ అధికారంలోకి సైకో వస్తే ఏపీ ప్రజలు మరోచోటికి వెళ్లాల్సి వస్తుందని చెప్పారు. కులాల రొచ్చులో పడి ఓటు అనే ఆయుధాన్ని వృథా చేయవద్దని ప్రజలకు సూచించారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల్లో అసంతృప్తి ఉందని.. అందుకే తెలుగుదేశం పార్టీలో చేరి ప్రజాసేవ చేద్దామని అనుకుంటున్నారని అన్నారు.

టచ్​లో ఉన్నారు: వైఎస్సార్సీపీలోని ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీతో టచ్​లో ఉన్నారని బాలకృష్ణ తెలిపారు. అధికార వైఎస్సార్సీపీలో మంత్రులు, ఎమ్మెల్యేలకు కూడా స్వతంత్రంగా ఉండే హక్కు లేదని.. ఫ్రీ హ్యాండ్ లేదని.. ముఖ్యమంత్రికి పబ్జీ ఆడుకోవడం తప్ప ఇంకేమీ తెలియదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఓటమి అంచుల్లో ఉన్నానని జగన్ మోహర్ రెడ్డికి కూడా తెలుసని బాలకృష్ణ పేర్కొన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.