ETV Bharat / state

Sand APMDC: '7 లక్షల టన్నుల ఇసుక ఏమైంది?'

author img

By

Published : Nov 1, 2021, 9:26 AM IST

రాష్ట్రంలో అయిదు నెలల క్రితం వరకూ ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) ఆధ్వర్యంలో ఇసుక తవ్వకాలు, విక్రయాలు జరగగా.. ఆ సమయంలో ఏడు లక్షల టన్నుల ఇసుక ఏమైందనేది ప్రశ్నార్థకంగా మారింది. రికార్డుల ప్రకారం ఉన్న ఇసుకకు, క్షేత్రస్థాయిలో ఉన్నదానికి వ్యత్యాసం ఉండటంతో అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు.

Sand APMDC: '7 లక్షల టన్నుల ఇసుక ఏమైంది?'
Sand APMDC: '7 లక్షల టన్నుల ఇసుక ఏమైంది?'

రాష్ట్రంలో ఇసుక బాధ్యతలు జేపీ సంస్థ ఈ ఏడాది మే 14 నుంచి తీసుకుంది. అప్పటి వరకు నిల్వ కేంద్రాలు, డిపోల్లో ఏపీఎండీసీ ఉంచిన ఇసుకను, జేపీ సంస్థకు అప్పగించాలని ఆదేశించారు. దీనిని విక్రయించగా వచ్చిన డబ్బును ఏపీఎండీసీకి చెల్లించాలని ఒప్పందంలో పేర్కొన్నారు. అయితే ఏపీఎండీసీ రికార్డుల ప్రకారం.. డిపోలు, నిల్వ కేంద్రాల్లో 21 లక్షల టన్నులు జేపీ సంస్థకు అప్పగించినట్లు పేర్కొన్నారు. అయితే గనులశాఖ అధికారులు, జేపీ సంస్థ ప్రతినిధులు సంయుక్తంగా కొలతలు వేయగా.. వాస్తవంగా ఉన్నది 14 లక్షల టన్నులేనని తేల్చారు.

రూ.33.25 కోట్ల విలువగల ఇసుకకు బాధ్యులు ఎవరు?

వ్యత్యాసమున్న ఇసుకతో తమకు సంబంధంలేదని జేపీ సంస్థ తెగేసి చెబుతోంది. ప్రస్తుతం టన్ను ఇసుక ధర రూ.475 చొప్పున లెక్కిస్తే.. ఏడు లక్షల టన్నులకు రూ.33.25 కోట్లు అవుతుంది. ఆయా డిపోలు, నిల్వ కేంద్రాలకు తరలించినందుకు అయిన రవాణా ఖర్చులు కూడా పరిగణిస్తే అది మరింత ఎక్కువే ఉంటుంది. ఇదంతా ఏపీఎండీసీ కోల్పోవలసి వస్తుంది. అయితే ఇదంతా గ్రౌండ్‌లాస్‌ అని అధికారులు తొలుత వివరణ ఇచ్చారు. దీనిపై ఉన్నతాధికారులు సంతృప్తి చెందలేదు. ఏపీఎండీసీ ఆధ్వర్యంలో గతంలో రీచ్‌ల వారీగా జరిగిన తవ్వకాలు.. డిపోలు, నిల్వ కేంద్రాలకు రవాణా.. విక్రయాలు.. అన్నింటిపై ఆడిట్‌ జరపాలని ఆదేశించారు. తవ్వకాలు, రవాణాలో తేడా ఉంటే.. వాటి గుత్తేదారులు నుంచి, డిపోల్లోనే తేడా జరిగితే బాధ్యులైన సిబ్బంది నుంచి డబ్బులు రాబట్టాలని పేర్కొన్నట్లు తెలిసింది.

నాణ్యత లేనిది వద్దు..

జేపీ సంస్థకు అప్పగించిన 14 లక్షల టన్నుల ఇసుకలో కూడా కొన్నిచోట్ల నాణ్యత లేనిది ఉన్నట్లు ఆ సంస్థ గుర్తించింది. గతంలో పట్టా భూముల్లో మట్టితో సహా ఇసుకను తవ్వి నిల్వకేంద్రాలు, డిపోలకు తరలించారనే ఆరోపణలు ఉన్నాయి. ఇటువంటిది రాష్ట్రమంతా కలిపి దాదాపు 2-3 లక్షల టన్నుల వరకు ఉన్నట్లు తెలిసింది. దీనిని తాము విక్రయించబోమని, వీటికి డబ్బులు కూడా చెల్లించమని జేపీ సంస్థ పేర్కొంటోంది. దీంతో ఈ ఇసుక తవ్వి, డిపోలకు రవాణా చేసిన గుత్తేదారులకు చెల్లింపులు జరపొద్దని ఏపీఎండీసీకి, ఉన్నతాధికారులు ఆదేశించారు.

ఇవీచదవండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.