సమస్యల్లో జగనన్న కాలనీలు.. కనీస సౌకర్యాలు కరవు

author img

By

Published : Nov 21, 2022, 12:15 PM IST

జగనన్న కాలనీలు

Jagananna colonies: జగనన్న కాలనీల్లో ఇంటి నిర్మాణం లబ్ధిదారులకు కత్తిమీద సాములా మారింది. కాలనీల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించకుండా ఇళ్లు నిర్మించుకోవాలని.. అధికారులు ఒత్తిడి తెస్తున్నారు. రోడ్డు, నీళ్లు, కరెంట్‌ సౌకర్యాలు లేకపోవడంతో.. లబ్ధిదారులే సొంత ఖర్చులతో సమకూర్చుకుంటున్నారు. దీంతో నిర్మాణ వ్యయం పెరిగిపోతోందని చెబుతున్నారు.

సమస్యల్లో జగనన్న కాలనీలు

Jagananna colonies: అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో నాలుగుచోట్ల జగనన్న కాలనీలను ఏర్పాటు చేశారు. ఇళ్లులేని పేదల జాబితా తయారు చేసి 3500 మందికి పట్టాలు ఇచ్చారు. చెట్నేపల్లి, లచ్చానపల్లి రోడ్, కొత్తపేట, నేమతాబాద్‌లో.. ఈ కాలనీలు ఏర్పాటు చేశారు. అధికారులు కేవలం ఇంటి స్థలాల హద్దులు గుర్తించి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. కనీస మౌలిక సదుపాయాలైన రోడ్డు, నీరు, కరెంట్‌ వసతులు లేకపోవడంతో లబ్దిదారులు ఇళ్ల నిర్మాణానికి వెనుకాడుతున్నారు. కరోనా సమయంలో కొంత సడలింపు ఇచ్చిన అధికారులు గత ఏడాది నుంచి ఇల్లు నిర్మించుకోవాలని తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు.

జగనన్న కాలనీల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని రాష్ట్రస్థాయి నుంచి జిల్లా అధికారుల వరకు ఆదేశాలున్నా అవి అమలు కావడం లేదు. గడువులోపు నిర్మాణం మొదలుపెట్టలేదని దాదాపు 300 మంది లబ్ధిదారుల ఇంటి పట్టాలు రద్దు చేశారు. మిగిలిన 3200 మందిలో కేవలం 1470 మంది మాత్రమే ఇంటి నిర్మాణం మొదలుపెట్టారు. 1500 మందికి పైగా పునాది గుంతలు తీసి...పట్టా రద్దుకాకుండా జాగ్రత్త పడ్డారు. కనీసం రోడ్డు, నీరు, కరెంట్‌ వసతులు లేకపోవడంతో.... ఇళ్లు ఎలా కట్టుకోవాలని లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు.

కనీసం వీధి లైట్లు కూడా లేకపోవడంతో దొంగలు ఇంటి సామగ్రిని చోరీ చేస్తున్నారు. మట్టి తరలింపు ముఠాలు, ట్యాంకర్లతో నీటి సరఫరాదారుల దందా పెచ్చుమీరింది. గతంలో ట్యాంకర్‌ 600 రూపాయలు కాగా, జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణం మొదలైనప్పటి నుంచి ట్రిప్పు నీటికి వెయ్యి వసూలు చేస్తున్నారని లబ్ధిదారులు చెబుతున్నారు. అంతిమంగా తమకు నిర్మాణ వ్యయం పెరిగి భారంగా మారుతోందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.


ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.