ETV Bharat / state

బాలికే భవిష్యత్: అనంతపురం కలెక్టర్‌గా ఇంటర్‌ విద్యార్థిని!

author img

By

Published : Oct 11, 2020, 1:26 PM IST

Updated : Oct 11, 2020, 6:26 PM IST

వారంతా పాఠశాల విద్యార్థినులు. కానీ.. ఈ రోజు ప్రభుత్వ ఉద్యోగులయ్యారు. ఒకరు కలెక్టర్, మరొకరు తహసీల్దార్.. ఇలా మంచి మంచి కొలువుల్లో ఈ ఒక్క రోజుకు ఆసీనులయ్యారు. పరిపాలన వ్యవహారాలు చూస్తూ.. అర్జీలూ స్వీకరించారు.

బాలికే భవిష్యత్: అనంతపురం కలెక్టర్‌గా ఇంటర్‌ విద్యార్థిని!
బాలికే భవిష్యత్: అనంతపురం కలెక్టర్‌గా ఇంటర్‌ విద్యార్థిని!

బాలికే భవిష్యత్: అనంతపురం కలెక్టర్‌గా ఇంటర్‌ విద్యార్థిని!

అనంతపురం జిల్లాలో అంతర్జాతీయ బాలికల దినోత్సవాన్ని వినూత్నంగా నిర్వహించారు. 'బాలికే భవిష్యత్‌' పేరిట నిర్వహించిన ఈ కార్యక్రమంలో బాలికలను వివిధ ప్రభుత్వ శాఖల్లో ఒక్కరోజు అధికారులుగా నియమించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమం పట్ల విద్యార్థినులు హర్షం వ్యక్తం చేశారు.

అనంతపురం జిల్లాలో నిర్వహించిన అంతర్జాతీయ బాలిక దినోత్సవం విద్యార్థినుల్లో ఉత్సాహం నింపింది. ఉన్నత లక్ష్యాలను ఎంచుకుని... వాటిని సాకారం చేసుకునే దిశగా బాలికలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థినుల పేర్లు లాటరీ ద్వారా ఎంపిక చేసి... వారికి ఒక్కరోజు అధికార బాధ్యతలు అప్పగించారు. అనంతపురం జిల్లా ఒక్కరోజు కలెక్టర్​గా గార్లదిన్నె కస్తూర్బా పాఠశాల ఇంటర్ విద్యార్థిని శ్రావణి.... సంయుక్త కలెక్టర్లుగా మధుశ్రీ, సహస్ర బాధ్యతలు నిర్వహించారు. కలెక్టర్ గంధం చంద్రుడు, సంయుక్త కలెక్టర్ నిశాంత్ కుమార్‌ వారిని స్వయంగా ఆహ్వానించారు. దిశ చట్టం కింద నమోదైన కేసులో బాధిత బాలికకు పరిహారం ఇచ్చే ఫైల్ పై ఒక్కరోజు కలెక్టర్ శ్రావణి సంతకం చేశారు.

అనంతపురం జిల్లాలోని 63 మండలాల్లోనూ తహసీల్దార్లుగా బాలికలు ఒక్కరోజు బాధ్యతలు నిర్వహించారు. ఆర్డీఓ, తహసీల్దార్ తో పాటు సమాచార పౌరసంబంధాల అధికారి, ఇతర శాఖల అధికారుల వరకు బాలికలే అధికారులుగా వ్యవహరించారు. గుంతకల్లు మున్సిపాలిటీ కమిషనర్ గా బాధ్యత చేపట్టిన సానియా మీర్జా మున్సిపాలిటీ డంపింగ్ కేంద్రాలతో పాటు, సమ్మర్ స్టోరేజ్ పంప్ హౌస్ ను పరిశీలించారు. పలువురి నుంచి అర్జీలు స్వీకరించారు. పదవుల్లో మహిళలు ఎక్కువగా ఉండటం వల్ల ప్రజలకు న్యాయం జరుగుతుందని కలెక్టర్ గంధం చంద్రుడు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమం పట్ల మహిళా అధికారులు, ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:

శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల నిర్వహణపై సందిగ్ధత

Last Updated : Oct 11, 2020, 6:26 PM IST

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.