ETV Bharat / state

LOSS TO FARMERS: రూ.వేలల్లో పెట్టుబడి.. అప్పులే దిగుబడి!

author img

By

Published : Oct 28, 2021, 9:58 AM IST

Updated : Oct 28, 2021, 2:55 PM IST

అనంత రైతులకు ఈ ఏడాదీ నష్టాలే మిగిలాయి. వేరుసెనగ సాగుచేసిన 90 శాతం మందికి కనీస దిగుబడి దక్కలేదు. ఎకరాకు 40 కిలోలు (బస్తా) కూడా దక్కే పరిస్థితి లేదని పంట కోత ప్రయోగాల్లో వెల్లడైంది(loss in peanut crop cultivation). దీంతో రైతన్న లబోదిబోమంటున్నారు. ఖరీఫ్‌ ప్రారంభం జూన్‌, జులైలో మంచి వర్షాలు కురవడంతో జిల్లాలో వేరుసెనగ 11 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. ఎకరాకు రూ.20,000 వరకు ఖర్చు చేశారు. పూత, పిందె దశలో ఉండగా వర్షం దెబ్బతీసింది. సుమారు 50 రోజులు వర్షం జాడ లేక పంట ఎండిపోయింది. దీంతో రైతులు అప్పులు మూటగట్టుకున్నారు.

నష్టాల్లో వేరుసెనగ సాగు రైతులు
నష్టాల్లో వేరుసెనగ సాగు రైతులు

అనంతపురం గ్రామీణం తాటిచెర్ల గ్రామంలో రైతు వి.హనుమంతు ఏడెకరాల్లో వర్షాధార పంటగా వేరుసెనగ సాగుచేశారు. సర్వే నంబరు 51-1లో 55 మీటర్ల ప్లాట్లలో అధికారులు పంటకోత ప్రయోగాలు(Harvest experiment in peanut cultivation ) చేయగా 0.240 గ్రాముల దిగుబడి వచ్చింది. ఈ లెక్కన ఎకరాకు 38.88 కిలోలే దక్కింది. కొడిమి గ్రామానికి చెందిన రైతు జి.రామకృష్ణారెడ్డి ఐదెకరాల్లో వేరుసెనగ పంట సాగు చేశారు. సర్వే నంబరు 124లో 55 మీటర్ల కొలతల్లో మొక్కల్లో కాయలు తీసి తూకం వేయగా 0.224 గ్రాముల దిగుబడి వచ్చింది. ఈ లెక్కన ఎకరాకు 36.28 కిలోల దిగుబడి వచ్చింది. ఎకరాకు కనీసం బస్తా కూడా రాలేదని, అప్పులే మిగిలాయని రైతు ఆవేదన(famers warring for loss in peanut crop cultivation) వ్యక్తం చేశారు.

నష్టాల్లో వేరుసెనగ సాగు రైతులు

పశుగ్రాసమూ దక్కలేదు
పంట ఊడలు దిగే సమయంలో వర్షం రాకపోవడంతో బెట్ట పరిస్థితికిలోనై చాలాచోట్ల వేరుసెనగ ఎండింది. వర్షం కురిసినా మళ్లీ పంట కోలుకునే అవకాశం లేదని గుంతకల్లు, రాప్తాడు నియోజకవర్గాల్లో అనేక మంది రైతులు పంటను తొలగించారు. పశుగ్రాసమైనా దక్కుతుందన్న ఆశతో కొందరు అలాగే ఉంచారు. అయితే తీరా పంట తొలగించిన తర్వాత భారీ వర్షాలు కురడంతో కట్టె కూడా కుళ్లిపోయింది. పశుగ్రాసం కూడా దక్కకుండా పోయింది.

కరవు మండలాల జాబితా సిద్ధం
ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టం జరిగితేనే పరిహారం, బీమా సొమ్ము రైతులకు అందుతుంది. లేదంటే సొమ్ము రాదని ప్రకృతి విపత్తులశాఖ తేల్చి(drought zones in Anantapur district) చెప్పింది. వర్షపాతం, భూగర్భ జలాలు, పంటలసాగు, వర్షాభావ పరిస్థితి (డ్రైస్మెల్‌) తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని వ్యవసాయ, ప్రణాళికశాఖ అధికారులు కలెక్టర్‌కు నివేదికలు అందజేశారు. ప్రకృతి విపత్తులశాఖ ఆదేశాలకు అనుగుణంగా నివేదికలను మరోమారు రెవెన్యూశాఖ క్షుణ్ణంగా పరిశీలించింది. 63 మండలాలను కరవు మండలాల జాబితాలో చేర్చి, నివేదికను కలెక్టర్‌ నాగలక్ష్మి ప్రభుత్వానికి నివేదించినట్లు అధికార వర్గాల సమాచారం. జాబితాను ప్రకృతి విపత్తులశాఖ పరిశీలించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉంది.

ప్రయోగాలే ప్రామాణికం
జిల్లాలో 964 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. వ్యవసాయ, ముఖ్య ప్రణాళికశాఖలు వేర్వేరుగా వేరుసెనగ పంటకోత ప్రయోగాలు రైతుల సమక్షంలో నిర్వహిస్తున్నాయి. ఖరీఫ్‌లో 750 వేరుసెనగ పంటకోత ప్రయోగాలు నిర్వహించాల్సి ఉండగా, ఇప్పటి వరకు 170 ప్రయోగాలు పూర్తయ్యాయి. ప్రకృతి విపత్తులశాఖ నిబంధనలు పరిగణలోకి తీసుకుని ర్యాండమ్‌గా దిగుబడిని అంచనా వేశారు. జిల్లాలో పట్టు, ఉద్యాన పంటల దిగుబడులను పరిగణనలోకి తీసుకున్నట్లు అధికార వర్గాల సమాచారం.

రూ.2,400 కోట్ల నష్టం
వాతావరణం అనుకూలించి చీడ, పీడలను అదుపు చేసుకుంటే ఎకరాకు 4 క్వింటాళ్ల వేరుసెనగ దిగుబడి వస్తుంది. ఈ లెక్కన 44 లక్షల క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అంచనా వేయగా.. 5.50 లక్షల క్వింటాళ్లు మాత్రమే అందనుంది. అంటే 38.50 లక్షల క్వింటాళ్ల దిగుబడి అన్నదాతలు కోల్పోయినట్లే. క్వింటా వేరుసెనగ కనిష్ఠంగా రూ.5,000 అనుకున్నా.. 38.50 లక్షల క్వింటాళ్లకు రూ.1,900 కోట్లు రైతులు రాబడి కోల్పోయారు. వేరుసెనగ పొట్టు ఎకరాకు ఒక ట్రాక్టరు వస్తుంది. ఈసారి ఇది కూడా 50 శాతమే దక్కింది. ట్రాక్టరు పొట్టు రూ.10,000 లెక్కన రూ.500 కోట్లు నష్టం వాటిల్లింది. మొత్తంగా దిగుబడి నష్టం రూ.2400 కోట్లు.

ప్రభుత్వానికి నివేదిస్తాం
ఈసారి రైతులంతా తీవ్రంగా నష్టపోయారు. సీపీఓ నుంచి దిగుబడి అంచనాలు వచ్చిన తరువాత ప్రభుత్వానికి నివేదిక ఇస్తాం. ప్రస్తుతం వాతావరణ బీమా అమలు చేస్తున్నందున, ఆటోమేటిక్‌ వెదర్‌ స్టేషన్ల నుంచి సేకరించిన సమాచారం మేరకు పంట నష్టం అంచనా వేస్తారు - చంద్రనాయక్‌, జేడీఏ

Last Updated : Oct 28, 2021, 2:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.