ETV Bharat / state

అనంతపురంలో సీపీఐ కలెక్టరేట్​ ముట్టడి.. అడ్డుకున్న పోలీసులు.. ఉద్రిక్తత

author img

By

Published : Dec 19, 2022, 5:55 PM IST

CPI Dharna: రైతు సమస్యలపై సీపీఐ ఆధ్వర్యంలో చేపట్టిన అనంతపురం కలెక్టరేట్‌ ముట్టడి ఉద్రిక్తతకు దారితీసింది. దిగుబడి రాని పత్తి మొక్కలతో రైతులు, సీపీఐ నేతలు కలెక్టరేట్‌ లోపలికి వెళ్లేందుకు యత్నించారు. పోలీసులు వారిని లోపలికి రాకుండా అడ్డుకున్నారు. కొందరు కార్యకర్తలు బారికేడ్లు తోసేసి.. గేట్లు ఎక్కి లోపలికి వెళ్లారు. పోలీసులు సీపీఐ నాయకులను అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.

CPI LEADERS
గేటు దూకేందుకు ప్రయత్నిస్తున్న సీపీఐ నాయకులు,రైతులు

సీపీఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నా

CPI Dharna: అకాల వర్షాలతో జరిగిన పంట నష్టాన్ని వెంటనే లెక్కించి, పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అనంతపురం కలెక్టరేట్ ఎదుట రైతులు కదం తొక్కారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో అనంతపురం జిల్లావ్యాప్తంగా పంట నష్టపోయిన రైతులు పాల్గొన్నారు. అకాల వర్షాలు, తుపానులతో నష్టం జరిగినా ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారులు కనీసం కన్నెత్తి చూడలేదని రామకృష్ణ ఆరోపించారు. నకిలీ పత్తి విత్తనాలతో తీవ్రంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

జిల్లా కలెక్టర్ బయటకు వచ్చి రైతుల గోడు వినాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. ఎంతసేపటికీ కలెక్టర్, ఇతర అధికారులు రాకపోవటంతో కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడి చేపట్టారు. పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను తోసేసి రైతులు, సీపీఐ నాయకులు ప్రధాన గేట్ ఎక్కి కలెక్టరేట్​లోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు సీపీఐ నాయకులను అదుపులోకి తీసుకున్నారు. రామకృష్ణతో పాటు పలువురిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్​కు తరలించారు. పంట నష్టపోయిన రైతులను పోలీసులు అడ్డుకోవటంతో అన్నదాతలు ఆవేదనకు గురయ్యారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్రంలో అధికార పార్టీ నాయకులు ఆదాయ మార్గాల్లో మునిగి తేలుతున్నారని విమర్శించారు. గడప గడపకు కాకుండా.. పొలం పొలంకి వెళ్లాలని సూచించారు. రైతు సమస్యలను పరిష్కరించే వరకు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని రామకృష్ణ హెచ్చరించారు. పోలీసులు సొంతంగా ఆలోచించడం ఏనాడో మానేశారని, వైకాపా నాయకులు ఏమి చెబితే అది చేస్తున్నారని రామకృష్ణ అన్నారు. కలెక్టరేట్ వద్ద సీపీఐ నాయకులు చేపట్టిన నిరసన ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ నేపథ్యంలో నాయకులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్​కు తరలించారు. అరెస్టు చేయడాన్ని రామకృష్ణ తీవ్రంగా ఖండించారు.

"వేరుశనగ, పత్తి, మిరప, కంది, ఉల్లి, టమాట పంటలు దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారు. నకిలీ విత్తనాల వలన కూడా రైతులు నష్టపోయారు. అధికార పార్టీ పార్లమెంటరీ సభ్యుడి కనుసన్నల్లోనే విత్తన కంపెనీలు విత్తనాలను పంపిణీ చేశాయి. ముఖ్యమంత్రి గడప గడపకు కార్యక్రమం కాకుండా పొలం పొలంకూ పోవాలి." - రామకృష్ణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.