కులాంతర వివాహం.. నిండు ప్రాణం బలి

author img

By

Published : Jun 18, 2022, 6:58 AM IST

murder

Murder: వారిద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు... ప్రేమించుకున్న వాళ్లిద్దరూ.. కులాలు వేరు కావడంతో పెద్దలకు చెప్పకుండా మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు.. అందరికీ దూరంగా వేరే దగ్గర ఉంటూ.. ఉద్యోగాలు చేసుకుంటూ జీవితం గడుపుతున్నారు. కానీ అంతలోనే అనుకోని ఘటన జరిగింది. ఆ యువకుడు హత్యకు గురయ్యాడు. ప్రేమ వివాహం ఇష్టం లేక తన తల్లే భర్తను హత్య చేయించి ఉంటుందని యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Youngman murder: కులాంతర వివాహం ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లికి చెందిన ముత్యాలమ్మ, నాగన్న దంపతులకు చిట్ర మురళి (27) ఒక్కగానొక్క కుమారుడు. ఇతను పీజీ పూర్తి చేసి, పెనుకొండ వద్ద ఉన్న కియా కార్ల కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. అదే గ్రామానికి చెందిన వీణ డిగ్రీ పూర్తి చేసింది. మూడేళ్ల కిందట గ్రామ మహిళా పోలీసుగా ఉద్యోగం పొంది, ఏలుకుంట్ల గ్రామ సచివాలయంలో విధులు నిర్వహిస్తోంది. మురళి, వీణ కొన్నేళ్లుగా ప్రేమించుకుంటూ గత ఏడాది జూన్‌లో వివాహం చేసుకున్నారు. పెద్దలకు దూరంగా జీవించాలనుకుని దంపతులిద్దరూ అనంతపురం జిల్లా రాప్తాడుకు మకాం మార్చారు.

విధుల్లో భాగంగా మురళి కియా పరిశ్రమకు వెళ్లడానికి గురువారం సాయంత్రం రాప్తాడు వై జంక్షన్‌ వద్ద జాతీయ రహదారిపై బస్సు కోసం వేచి చూస్తుండగా, గుర్తుతెలియని వ్యక్తులు ఆటోలో వచ్చి అతన్ని బలవంతంగా తీసుకెళ్లారు. విధుల నుంచి ఇంటికి వచ్చిన వీణ భర్తకు ఫోన్‌ చేసింది. ఫోన్‌ స్విచ్చాఫ్‌ రావడంతో, మిత్రులు, కుటుంబ సభ్యులతో ఆరా తీసింది. ఆచూకీ లభించకపోవడంతో రాప్తాడు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు దర్యాప్తు చేస్తుండగా, శుక్రవారం రాప్తాడు మండలం లింగనపల్లి-రామినేపల్లి గ్రామాల మధ్యలో ఓ యువకుడు హత్యకు గురైనట్లు సమాచారం అందుకున్నారు. ఘటనాస్థలికి వెళ్లి చూడగా గొంతుకోసి హతమార్చినట్లు గుర్తించారు. కిడ్నాప్​నకు గురైన మురళి హత్యకు గురైనట్లు పోలీసులు నిర్ధారణ చేసుకున్నారు. తమ ప్రేమ వివాహం ఇష్టం లేకనే తన తల్లి భర్తను హత్య చేయించి ఉంటుందని వీణ రాప్తాడు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రాఘవరెడ్డి తెలిపారు.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.