ETV Bharat / state

అప్పు చెల్లించమన్నందుకు మహిళను హతమార్చాడు

author img

By

Published : Aug 21, 2020, 6:25 PM IST

ఉన్నత చదువులు చదివిన అతను వక్ర బుద్దిని ప్రదర్శించాడు. చెడు వ్యసనాలకు బానిసై హంతకుడిగా మారాడు. మహిళను అత్యంత కిరాతకంగా హతమార్చాడు. చివరికి పోలీసులకు చిక్కాడు.

murder in madakasira
murder in madakasira

అనంతపురం జిల్లా మడకశిర మండలం తురకవాండ్లపల్లి గ్రామంలో 5 నెలల క్రితం జరిగిన మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు. నిందితుడిని అరెస్టు చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు.

మండలంలోని తురకవాండ్లపల్లి గ్రామ సమీపంలో మారెమ్మ దేవాలయం వద్ద 5 నెలల క్రితం కాలిన స్థితిలో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. ఈ ఘటనపై మడకశిర పోలీసులు కేసు నమోదు చేసుకుని అప్పటినుంచి దర్యాప్తు ప్రారంభించారు. ఇవాళ కర్ణాటక రాష్ట్రం తుంకూర్ జిల్లా పావగడ నియోజకవర్గంలోని నేరళ్లకుంట గ్రామంలో ముద్దాయి రామప్పను మడకశిర సీఐ రాజేంద్రప్రసాద్, సిబ్బంది అరెస్టు చేశారు. అతని వద్ద ఉన్న ద్విచక్ర వాహనాలు, బంగారు, వెండి ఆభరణాలు, సెల్ ఫోన్లు, మృతురాలి బ్యాంక్ అకౌంట్ పాస్​బుక్ స్వాధీనం చేసుకుని కోర్టులో హాజరుపరిచారు.

అప్పు తిరిగి చెల్లించమన్నందుకు...

ఈ కేసు వివరాలను మడకశిర సర్కిల్ ఇన్​స్పెక్టర్​ రాజేంద్రప్రసాద్ వెల్లడించారు. కర్ణాటకకు చెందిన రామప్ప ఎం.ఏ. హిస్టరీ, ఎంఫిల్ చదివాడు. గతంలో బెంగళూరు నగరంలోని ఓ కళాశాలలో పని చేశాడు. అక్కడ ఉద్యోగం పోవటంతో అనంతరం శ్రీ రవిశంకర్ విద్యా మందిర్ ఆయుర్వేదిక్ కళాశాల & ఆసుపత్రిలో ఉద్యోగం చేశాడు. అదే ఆస్పత్రిలో పని చేస్తున్న తుంకూరు జిల్లాకు చెందిన వసంతమ్మ అనే మహిళతో అతనికి అక్రమ సంబంధం ఏర్పడింది. చెడు వ్యసనాలకు బానిసైన నిందితుడు... తనకు డబ్బు అవసరం ఉందని వసంతమ్మ దగ్గర 5 లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నాడు. రోజులు గడిచినా వాటిని తిరిగి ఇవ్వకపోవటంతో పోలీసులకు ఫిర్యాదు చేస్తానని వసంతమ్మ హెచ్చరించింది.

డబ్బులు ఇస్తానని పిలిచి

వసంతమ్మ అడ్డు తొలగించాలనుకున్న రామప్ప... డబ్బు ఇస్తానని వసంతమ్మను మడకశిర రప్పించాడు. అక్కడినుంచి తురకవాండ్లపల్లి గ్రామ సమీపం వద్ద ఉన్న మారమ్మ దేవస్థానంలో రాత్రి బస చేశారు. అర్ధరాత్రి వసంతమ్మ గాఢనిద్రలో ఉండగా గొంతు పిసికి చంపాడు. ఆమె ఒంటిపై ఉన్న బంగారు, వెండి ఆభరణాలు, మొబైల్ ఫోన్, బ్యాంక్ అకౌంట్ పాస్ బుక్ తీసుకున్నాడు. ఆమె మృతదేహంపై పెట్రోల్​ పోసి నిప్పంటించి అక్కడినుంచి పరారయ్యాడు. కర్ణాటకలో మహిళ అదృశ్యం కేసు నమోదైందని తెలుసుకున్న మడకశిర పోలీసులు... ఆ దిశగా దర్యాప్తు చేసి నిందితుడిని పట్టుకున్నారు. హత్య చేశానని నిందితుడు ఒప్పుకున్నాడని... అతన్ని కోర్టులో హాజరుపరుస్తామని సీఐ రాజేంద్రప్రసాద్ పేర్కొన్నారు.

ఇదీ చదవండి

మద్యం కోసం డబ్బులివ్వలేదని భార్యను హత్య చేసిన భర్త

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.