ETV Bharat / state

వంజంగి టూర్.. ప్రకృతి సంతోషం మాటున ప్రమాదం!

author img

By

Published : Oct 13, 2022, 2:22 PM IST

ప్రకృతిని ఆస్వాదించాలని వస్తున్న పర్యాటకులు.. ప్రమాదాల బారిన పడుతున్నారు! మనసు నిండా సంతోషాలు నింపుకెళ్లాలని వస్తున్నవారు.. తనువెల్లా గాయాలతో చేదు జ్ఞాపకాలను మోసుకెళ్తున్నారు! దక్షిణాదిలో అద్భుత పర్యాటక ప్రాంతంగా పేరుగాంచిన వంజంగి కొండల్లోని దుస్థితి ఇది. సుదూర ప్రాంతాల నుంచి వస్తున్న పర్యాటకులు తరచూ రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారు.

vanjangi
vanjangi

అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరుకు 12 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి.. ప్రకృతి రమణీయతకు ఆలవాలమైన వంజంగి కొండలు. 2020 నుంచి వంజంగి మేఘాలకొండను చూసేందుకు పర్యాటకు భారీగా తరలి వస్తున్నారు. కార్లు, టూరిస్ట్ బస్సులు, ద్విచక్ర వాహనాలతో రాకపోకలు సాగిస్తున్నారు.

దీంతో.. ఈ రహదారిలో పర్యాటకుల రద్దీ విపరీతంగా పెరిగింది. రోడ్డు వెడల్పు తక్కువగా ఉండడం.. ఆకస్మిక మలుపులు ఎదురవుతుండడంతో.. ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ ప్రాంతం గురించి అవగాహన లేని టూరిస్టులు.. ఎక్కువగా ప్రమాదాల బారిన పడుతున్నారు.

వంజంగి కొండలకు వెళ్లే రహదారి

మలుపులు.. వెడల్పు సంగతి అటుంచితే.. ఇక రహదారి పొడవునా ఏర్పడిన గుంతలు ప్రయాణికులను తీవ్ర అవస్థలకు గురిచేస్తున్నాయి. పాడేరు నుంచి వంజంగికి వెళ్లే రహదారి 6 కిలోమీటర్లు మేర గుంతలతో నిండిపోయింది. గిరిజన అభివృద్ధి సంస్థ ఐటీడీఏ ఆధ్వర్యలో.. వంజంగిలో గేటు ఏర్పాటు చేసి వాహనాల వద్ద ప్రవేశ రుసుము వసూలు చేస్తున్నప్పటికీ.. టూరిస్టుల రక్షణకు తగిన చర్యలు మాత్రం తీసుకోవట్లేదని వారు వాపోతున్నారు. కనీసం.. ప్రమాద హెచ్చరిక బోర్డులు కూడా ఎక్కడా ఏర్పాటు చేయలేదని విమర్శిస్తున్నారు.

రోడ్డు విస్తరించి.. ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని.. ఐటీడీఏ దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని స్థానిక ప్రజాప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీ నిధులు కూడా లేకపోవడంతో.. తాత్కాలిక మరమ్మతులు కూడా చేపట్టలేని దుస్థితి నెలకొందని వాపోతున్నారు. పర్యాటకుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో.. ఇప్పటికైనా స్పందించి.. రహదారులు బాగు చేయాలని, రక్షణ చర్యలు పకడ్బందీగా చేపట్టాలని కోరుతున్నారు.

ఇవీ చూడండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.