ETV Bharat / state

Heavy Rains in AP: వానొచ్చె.. గోదారికి వరదొచ్చె.. లోతట్టు ప్రాంతాల్లో వణుకుపుట్టే..

author img

By

Published : Jul 20, 2023, 11:35 AM IST

Updated : Jul 20, 2023, 3:44 PM IST

Etv Bharat
Etv Bharat

Heavy Rains in AP: రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరపిలేని వానలకు జిల్లాల్లో వాగులు, వంకలు పొంగి పొర్లుతూ.. ప్రధాన రహదారులను సైతం ముంచెత్తుతున్నాయి. వర్షాల ధాటికి లోతట్టు ప్రాంతాలు జలమయమవుతుండగా అప్రమత్తమైన అధికారులు తగిన చర్యలు చేపట్టారు. వివరాల్లోకి వెళ్తే..

Heavy Rains in AP: రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరపిలేని వానలకు జిల్లాల్లో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. వర్షాల ధాటికి చాలాచోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా.. ప్రధాన రహదారులను సైతం వరదలు ముంచెత్తుతున్నాయి.

అల్లూరి జిల్లాలో వరద ప్రభావం..
ఈ క్రమంలో అల్లూరి సీతారామరాజు జిల్లాలో పలుచోట్ల రహదారులపై వరద నీరు చేరింది. చింతూరు, కూనవరం, రాంబద్రపురం రహదారుల్లో రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 39 అడుగులకు చేరింది. కాగా.. జిల్లాలో గోదావరి వరదలను ఎదుర్కొనడానికి సిద్దంగా ఉన్నామని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అన్నారు. ఈ నెల 23 వరకూ భారీ వర్షాలు పడే అవకాశమున్నట్లు వాతావరణ శాఖాధికారులు పేర్కొనడంతో.. ఈ నేపథ్యంలో వరదలపై అప్రమత్తం చేస్తూ అత్యవసర సమావేశం నిర్వహించామని, బుధవారం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి అధ్వర్యంలో సమీక్షా సమావేశం నిర్వహించామని ఆయన తెలిపారు. దీంతోపాటు లోతట్టు ప్రాంతాల్లో పీవో ప‌ర్య‌టించార‌ని, గురువారం జిల్లా స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ వెల్లడించారు.

అదేవిధంగా రాబోయే మూడు రోజులు క్లిష్ట పరిస్థితి ఉంటుందని, తదుపరి పరిస్థితులకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ తెలిపారు. గోదావరి నదిపై లాంచీలు, బోటులు రాకపోకలు నిలిపివేసామని, ఆగస్టు నెల సరుకులు ఇప్పటికే పౌరసరఫరాల శాఖ ద్వారా డిపోలకు చేరాయని, పంపిణీ కూడా ప్రారంభించామని ఆయన తెలిపారు. లోతట్టు ప్రాంతాల్లో గర్భిణీలను ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించామని, వైద్యులు కూడా అన్ని పీహెచ్​సీలో అందుబాటులో ఉన్నారని ఆయన పేర్కొన్నారు.

FLOODS: రాష్ట్రంలో వర్షాలు.. జగదిగ్బంధంలో లంక గ్రామాలు

వసతిగృహాలు, సురక్షిత ప్రాంతాలు వద్ద పెట్రోల్, డీజిల్​ను కూడా అందుబాటులో ఉంచుతున్నామని.. వరద ప్రభావం పడే గ్రామాల గురించి ఇప్పటికే వారికి అవసరమైన సలహాలు సూచనలు అందించామని జిల్లా కలెక్టర్ తెలిపారు. వరదలను ఎలా ఎదుర్కొనాలనే అంశంపై గురువారం చింతూరులో సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సుమిత్​కుమార్ తెలిపారు. ఇందులో అధికారుల సలహాలు, సూచనలు మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.

కోనసీమలో వరద ప్రభావం..

మరోవైపు గోదావరి నదికి వరద ప్రవాహం పెరగడంతో కోనసీమలోని నదీపాయలు జలకలను సంతరించుకున్నాయి. పి.గన్నవరం మండలం బూరుగులంక రేవులో తాత్కాలిక రహదారి వరద ప్రవహానికి కొట్టుకుపోయింది.

ఏలూరు జిల్లాలో వరద ఉద్ధృతి..

ఏలూరు జిల్లాలో పోలవరం వద్ద గోదావరి వరద ఉద్ధృతితో గంటగంటకు నీటిమట్టం పెరుగుతోంది. పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి నీటిమట్టం 30.68 మీటర్లకు చేరుకుంది. దీంతో అప్రమత్తమైన అధికారులు 48 గేట్ల ద్వారా దిగువకు 3,15,791 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. వరద మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.

రాజమహేంద్రవరంలో వరద ప్రభావం..
రాజమహేంద్రవరంలో గోదావరి వరద ఉద్ధృతితో ధవళేశ్వరం ఆనకట్ట వద్ద నీటిమట్టం 9.3 అడుగులకు చేరింది. దీంతో అధికారులు డెల్టా పంట కాల్వలకు 13,300 క్యూసెక్కుల నీటిని, సముద్రంలోకి 4.16 లక్షలకు పైగా క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. రాజమహేంద్రవరం వద్ద సాయంత్రానికి వరద మరింతగా పెరగనున్నట్లు అధికారులు తెలిపారు.

Last Updated :Jul 20, 2023, 3:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.