ETV Bharat / state

పోలవరం నిర్వాసితుల కష్టాలు ప్రధాని మోదీకి వివరించి.. పరిహారం వచ్చేలా చూస్తా: సీఎం

author img

By

Published : Jul 27, 2022, 12:49 PM IST

Updated : Jul 28, 2022, 4:20 AM IST

CM JAGAN : పోలవరం నిర్వాసితుల కష్టాలు ప్రధాని మోదీకి వివరిస్తానని ముఖ్యమంత్రి జగన్‌ చెప్పారు. విలీన మండలాల్లో పర్యటించిన జగన్‌.. ప్రధానితో చెప్పి వీలైనంత త్వరగా పరిహారం వచ్చేలా చూస్తానని స్పష్టం చేశారు. కేంద్రం త్వరగా నిధులిచ్చి ప్రాజెక్టు పూర్తికి సహకరించాలని కోరారు.

CM JAGAN
CM JAGAN

CM JAGAN : పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు 45.72 కాంటూర్‌ స్థాయి వరకు సహాయ, పునరావాస ప్యాకేజీ అమలు చేయాలంటే రూ.20వేల కోట్లు కావాలని, దాని కోసం కేంద్ర ప్రభుత్వాన్ని బతిమాలుతూనే ఉన్నానని, లేఖలు రాస్తూనే ఉన్నానని, కిందా మీదా పడుతున్నానని ముఖ్యమంత్రి జగన్‌ పేర్కొన్నారు. ‘మన చేతుల్లో ఏముంది? కేంద్రం ఇస్తేనే ఇవ్వగలం. వాళ్లు ఇవ్వకపోతే ఎక్కణ్నుంచి తెస్తాం? రూ.ఐదొందల కోట్లో, రూ.వెయ్యి కోట్లో అయితే.. నా చేతుల్లో ఉన్నదైనా ఇస్తాను. రూ.20వేల కోట్లు అంటే కచ్చితంగా వాళ్లు సహాయం చేయాల్సిందే’ అని స్పష్టం చేశారు. ‘డబ్బులు ముద్రించేది కేంద్ర ప్రభుత్వమే. వాళ్ల దగ్గరే డబ్బు లేకపోతే ఇంకెవరి దగ్గర ఉంటుంది. మన ఖర్మేంటంటే పూర్తి నీటి మట్టం (45.72 కాంటూర్‌) వరకు ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ ఇవ్వాలంటే మరో రూ.20 వేల కోట్లు కావాలి. దాని కోసమే కేంద్రంతో రోజూ కుస్తీ పడుతున్నాం. ఇప్పటికే రూ.2,900 కోట్లు ఎదురిచ్చాం. మనం ఇచ్చింది వాళ్ల నుంచి రాబట్టే ప్రయత్నం చేస్తున్నాం. అయ్యా మేమిచ్చాం సామీ.. మా డబ్బులు మాకు వెనక్కివ్వండి. మాకిస్తే మళ్లా మేమిస్తామని చెబుతున్నాం’ అని ఆయన పేర్కొన్నారు.

పోలవరం నిర్వాసితుల కష్టాలు ప్రధాని మోదీకి వివరిస్తా

పోలవరం ముంపు మండలాలైన చింతూరు, వేలేరుపాడుల్లో ముఖ్యమంత్రి బుధవారం పర్యటించారు. వరద బాధితుల్ని పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘41.15 మీటర్ల వరకు పోలవరం ప్రాజెక్టు కట్టినా పూర్తిగా నింపం. డ్యామ్‌ భద్రతకు ప్రమాదం వస్తుంది. సీడబ్ల్యూసీ మార్గదర్శకాల ప్రకారం డ్యామ్‌ను మూడేళ్లలో పూర్తిగా నింపాలి. అప్పటికి ఏ ఒక్కరికీ నష్టం లేకుండా అందరికీ కచ్చితంగా మంచి చేస్తాం. ఆ స్థాయిలో కేంద్రం నుంచి డబ్బులు రాకుంటే ప్రాజెక్టులో నీళ్లయినా నింపకుండా ఆపుతా, లేకుంటే మీకు డబులిచ్చిన తర్వాతే కార్యక్రమం చేస్తాను. కేంద్రం ఇవ్వకపోతే సొంతంగా అయినా ఇచ్చి మీకు తోడుగా ఉంటాను’ అని సీఎం పేర్కొన్నారు. పోలవరం ముంపు ప్రాంతాల్లో వ్యవసాయ భూములకు రూ.1.10 లక్షల చొప్పున పరిహారం పొందిన రైతులకు రూ.5 లక్షలు చెల్లిస్తామని గతంలో ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నామన్నారు. ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీలో 18 ఏళ్లు నిండినవారికి రూ.6.50 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచుతూ గతంలో ప్రవేశపెట్టిన జీవోను అమలు చేస్తామని సీఎం వెల్లడించారు.

ప్రధానినే డీబీటీ బటన్‌ నొక్కమంటా..: ప్రధాని నరేంద్ర మోదీ అపాయింట్‌మెంట్‌ కోరానని జగన్‌ చెప్పారు. ‘ప్రధానిని కలిసినప్పుడు.. నేను పోయి చూసొచ్చాను, ఇంతింత స్థాయిలో నీళ్లు వచ్చాయి, బాధితులంతా మిమ్మల్నే తిట్టుకుంటున్నారని ప్రధానికి చెబుతాను. కేంద్రానికి అర్థమయ్యేలా చెబుతాం. ఏ రోజైనా ఇవ్వక తప్పదు కదా.. అదేదో ఈరోజే ఇచ్చేస్తే వాళ్లంతా సంతోషిస్తారు, మిమ్మల్నే తలచుకుంటారని చెబుతాను. మీరే డీబీటీ బటన్‌ నొక్కి, నిర్వాసితుల ఖాతాల్లో డబ్బు జమ చేయమని చెబుతాను. వీలైనంత వరకు ఆయనను ఒప్పించే ప్రయత్నం చేస్తాను’ అని సీఎం వెల్లడించారు.

పోలవరం ఆర్‌ అండ్ ఆర్‌ ప్యాకేజీ కోసం కేంద్రంతో కుస్తీ పడుతున్నాం

బాధితులకు సకల సౌకర్యాలు కల్పించాం: వరద బాధితులను ఆదుకోవడంలో పారదర్శకంగా వ్యవహరించామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఏ ప్రభుత్వం చేయలేని విధంగా బాధితులను ఆదుకున్నామన్నారు. జిల్లా కలెక్టర్‌ 20 రోజులుగా చింతూరులోనే మకాం పెట్టి విధులు నిర్వర్తించారని కొనియాడారు. ఆయనతోపాటు ఆరుగురు ఐఏఎస్‌ అధికారులు, ఐపీఎస్‌ అధికారులు దగ్గరుండి సహాయక చర్యలను పర్యవేక్షించారని పేర్కొన్నారు. మునుపెన్నడూ లేని విధంగా పునరావాస కేంద్రాల్లోని బాధితులకు సకల సౌకర్యాలు కల్పించామన్నారు. వరద నష్టంపై సర్వే చేయిస్తున్నామని, నివేదికలు రాగానే గ్రామ సచివాలయాల్లో జాబితా ప్రకటిస్తామని చెప్పారు. జాబితాలో పేర్లు లేకపోతే తక్షణమే వాలంటీర్ల దృష్టికి తీసుకెళ్లాలన్నారు. రెండు నెలల్లో ఈ ప్రక్రియ పూర్తికావాలని అధికారులను ఆదేశించారు. గతంలో తాటాకిళ్లకు నష్ట పరిహారం రూ.4 వేలు ఇచ్చేవారని, ఇప్పుడు వారికి కూడా రూ.10 వేల చొప్పున సాయం అందిస్తామని ప్రకటించారు. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రులు రాజన్నదొర, కొట్టు సత్యనారాయణ, మంత్రులు వనిత, అమర్‌నాథ్‌, కారుమూరి, ఎంపీలు మాధవి, శ్రీధర్‌, ఎమ్మెల్యేలు ధనలక్ష్మి, భాగ్యలక్ష్మి పాల్గొన్నారు.

మా గోడు వినండి: చట్టిలో ఏర్పాటు చేసిన సమావేశం వద్దకు వచ్చిన వరరామచంద్రాపురం మండలానికి చెందిన బాధితులు.. తమతో సీఎం మాట్లాడాలని నినాదాలు చేశారు. వరదలతో కూనవరం, వరరామచంద్రాపురం మండలాల్లో ఎక్కువనష్టం జరిగితే చింతూరు మండలంలో ఎలా పర్యటిస్తారని ప్రశ్నించారు. తమగోడు విని న్యాయంచేయాలని కోరారు.

కొత్త రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు: నాలుగు విలీన మండలాల్లో భూ, ఇతర సమస్యల పరిష్కారానికి కొత్త రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. వరద బాధిత ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాల అమలుపై అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష సమావేశంలో సీఎం మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక ఈ మూడేళ్లలో ఎక్కడికి వెళ్లినా ప్రజల నుంచి కాస్త దూరంగానే మెలగుతూ వచ్చిన ముఖ్యమంత్రి.. ఈసారి బాణీ మార్చారు. ఎన్నికలకు ముందు నిర్వహించిన పాదయాత్ర తరహాలో అందర్నీ దగ్గరికి తీసుకుంటూ, తలపై చేయి వేసి ఆశీర్వదిస్తూ, పిల్లలకు ముద్దులు పెడుతూ జనానికి చేరువగా ఉండే ప్రయత్నం చేశారు.

ఇవీ చదవండి:

Last Updated :Jul 28, 2022, 4:20 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.