ETV Bharat / state

నా ఇల్లు బాగుంటే చాలనుకున్నా.. 2000 మందికి తోడుగా నిలిచా..

author img

By

Published : Dec 2, 2022, 9:41 PM IST

యుద్ధం.. ఘర్షణ.. ఉండే వాతావరణంలో పేదరికం తిష్ట వేయడం కొత్తేమీ కాదుగా! ఇక స్త్రీల పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది. అలాంటి నేలలో తాను వ్యాపారవేత్తగా ఎదగడమే కాకుండా మరో రెండువేలమందిని ఉపాధివైపు నడిపించింది 20 ఏళ్ల షబ్నమ్‌. హైదరాబాద్‌లో జరిగిన ‘సరస్‌ 2022’ ప్రదర్శనకు హాజరైన షబ్నమ్‌ తన అనుభవాలను వసుంధరతో పంచుకుంది..

Shabnam Saras
Shabnam Saras

జమ్ములోని బడ్‌గామ్‌ జిల్లా హంజారా గ్రామం మాది. పర్వతశ్రేణుల మధ్య ఉంటుంది మా ఊరు. నాన్న నజిర్‌ అహ్మద్‌ రైతుకూలీ. అమ్మ మసాబాబానో. నాకు ముగ్గురు చెల్లెళ్లు, ఓ తమ్ముడు. పెద్దదాన్ని కదా, అమ్మకు ఇంట్లో సాయంగా చెల్లెళ్లని, తమ్ముణ్ని చూసుకొనేదాన్ని. దాంతో హైస్కూల్‌కి వెళ్లలేకపోయా. ఇంటి వెనుక అమ్మ పండించే కూయగూరలు, నాన్న తెచ్చిన కూలి.. వీటితో మా కడుపులు నిండటమే కష్టమయ్యేది. ఏదైనా చేసి ఇంటికి అండగా ఉండాలనుకొనేదాన్ని. నాకు 15 ఏళ్లప్పుడు.. ప్రభుత్వం వాళ్లు టైలరింగ్‌, ఎంబ్రాయిడరీలో ఉచిత శిక్షణనిస్తున్నారని తెలిసి వెళ్దామనుకున్నా. అమ్మ ఒప్పుకోలేదు. నలుగురికీ తెలిస్తే బాగోదంది. నైపుణ్యాలు నేర్చుకోకపోతే ఎప్పటికీ మన స్థితి మారదని, బతిమాలి ఒప్పించా.

రుణం తీసుకుని: కుట్టుపని నేర్చుకునేటప్పుడే స్వయం సహాయక బృందాల గురించి తెలిసింది. మా చుట్టుపక్కల గ్రామాల మహిళలు ఈ బృందాల్లో చేరి.. ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారని తెలిసి నేనూ సభ్యురాలిగా మారా. మా బృందంలో దాదాపుగా అందరికీ టైలరింగ్‌, ఎంబ్రాయిడరీ తెలుసు. ఆ ధైర్యంతోనే చేతిలో పైసా లేకపోయినా బ్యాంకు రుణం తీసుకొని.. దుస్తులపై చక్కని ఎంబ్రాయిడరీ చేసి వారాంతాల్లో జరిగే సంతల్లో అమ్మేవాళ్లం. చిన్నచిన్న దుకాణాలకూ సరఫరా చేసేవాళ్లం. అలా మా అందరికీ ఎంతోకొంత ఆదాయం రావడం మొదలైంది.

ఏడాదిలో మార్కెటింగ్‌ నైపుణ్యాలు ఒంటబట్టాయి. నాలా కాకూడదని చెల్లెళ్లని చదివించడం మొదలుపెట్టా. తీరిక చేసుకుని నేనూ ఇంటర్‌ పూర్తి చేశా. పెద్దచెల్లి ఇక్రా డిగ్రీ చదువుతోంది. తనకు సోషల్‌మీడియాపై మంచి పట్టుంది. దాని గురించి చెబుతుంటే.. తన సాయంతో మరొక అడుగు ముందుకు వేద్దామనిపించింది. చుట్టుపక్కల గ్రామాల మహిళలను కలిసి వాళ్ల సాయంతో ప్రత్యేకంగా నాణ్యమైన షాల్స్‌ తయారీ మొదలుపెట్టా. వాటిని ఇక్రా ఫేస్‌బుక్‌లో ఉంచేది. జమ్ము నుంచే మొదటి ఆర్డరు వచ్చింది. నా సంతోషానికి అవధుల్లేవు. నెమ్మదిగా ఆర్డర్లు పెరిగాయి.

వాటితోపాటు ఎగ్జిబిషన్లకూ వెళ్లేదాన్ని. అలా ఈ నాలుగేళ్లలో సిక్కిం, గుడ్‌గావ్‌, దిల్లీ, లఖ్‌నవూ, గోవా, కెనడా, లండన్‌, జర్మనీ దేశాల నుంచి ఆర్డర్లు పెరిగాయి. ఒక్క కశ్మీర్‌ షాల్స్‌తో ఆపేయకుండా... కుర్తీలు, కఫ్తాన్లు, దుప్పట్లు, బ్యాగులు, బొంతలు ఇలా 15 రకాల ఉత్పత్తులు తయారు చేస్తున్నా. నెలకు వెయ్యి ఆర్డర్లు వస్తున్నాయి. ఏటా రూ.30 నుంచి 50లక్షలు వార్షికాదాయం వస్తోంది. పెద్దగా చదువుకోని నేను వ్యాపారాన్ని అభివృద్ధి చేయడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. ఒక్కో అనుభవం నుంచీ పాఠాలు నేర్చుకుంటూ సాగుతున్నా. అమ్మ నన్ను చూసి గర్వపడుతోంది. నా కుటుంబం బాగుపడితే చాలు అనుకొన్న నేను ఇప్పుడు రెండువేలమందికి ఉపాధినివ్వగలుగుతున్నా. పేదరికం నుంచి బయటపడటానికి ఈ దిశగా నడక మొదలుపెట్టినా, తర్వాత ఇంత మందికి తోడ్పడగలుగుతున్నానన్నదే నన్ను నడిపిస్తోంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.