ETV Bharat / sports

IPL 2023: దంచికొట్టిన రహానే, గైక్వాడ్​.. చెన్నై ఘన విజయం.. ముంబయికి మళ్లీ నిరాశే

author img

By

Published : Apr 8, 2023, 10:54 PM IST

ఐపీఎల్​ 16వ సీజన్​లో ముంబయి ఇండియన్స్​కు రెండో ఓటమి. చెన్నై సూపర్​ కింగ్స్​తో జరిగిన మ్యాచ్​లో రోహిత్​ సేన.. ఏడు వికెట్ల తేడాతో ఓడిపోయింది.

ipl 2023 chennai super kings mumbai indians match winner
ipl 2023 chennai super kings mumbai indians match winner

ఇండియన్​ ప్రీమియర్​ లీగ్​ 16వ సీజన్​లో చెన్నై సూపర్ కింగ్స్​ జట్టు.. రెండో విజయాన్ని నమోదు చేసింది. ముంబయి ఇండియన్స్​తో జరిగిన మ్యాచ్​లో ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముంబయి నిర్దేశించిన లక్ష్యాన్ని 18.1 ఓవర్లలోనే ఛేదించేసింది. చెన్నై జట్టు బ్యాటర్లు​ అజింక్య రహానే, రుతురాజ్​ గైక్వాడ్ అదిరిపోయే ఇన్నింగ్స్ ఆడారు. కళ్లు చెదిరే షాట్లతో ఆకట్టుకున్నారు. ముంబయి బౌలర్లలో బెన్​డార్ఫ్, పీయూష్​ చావ్లా, కుమార్​ కార్తికేయ​ తలో వికెట్​ పడగొట్టారు.

ముంబయి నిర్దేశించిన 158 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన చెన్నై సూపర్‌ కింగ్స్‌కు తొలి ఓవర్‌లోనే షాక్‌ తగిలింది. బెన్‌డార్ఫ్‌ వేసిన బంతికి డేవాన్‌ కాన్వే (0) క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత ఆరంభం నుంచి విజృంభించిన అజింక్య రహానే(61) పెవిలియన్​ చేరాడు. పీయూష్‌ చావ్లా వేసిన ఎనిమిదో ఓవర్‌ చివరి బంతికి భారీ షాట్‌ ఆడి.. సూర్యకుమార్‌ యాదవ్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ఆరంభం నుంచి దూకుడుగా ఆడుతున్న శివమ్​ దూబె.. కుమార్ కార్తికేయ బౌలింగ్​లో క్లీన్​ బౌల్డ్​ అయ్యాడు. అయితే ఓపెనర్​ రుతురాజ్​ గైక్వాడ్​(40*), అంబటి రాయుడు(20*) అద్భుతంగా ఆడి తమ జట్టును విజయతీరాలకు చేర్చారు.

అంతకుముందు.. టాస్​ ఓడి బ్యాటింగ్​కు దిగిన ముంబయి ఇండియన్స్‌కు ఆదిలోనే షాక్‌ తగిలింది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (21) ఔటయ్యాడు. తుషార్‌ దేశ్‌పాండే వేసిన నాలుగో ఓవర్‌లో మొదటి బంతికి సిక్స్‌ బాదిన అతడు.. ఇదే ఓవర్‌లో చివరి బంతికి క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు. ఆరంభం నుంచి దూకుడుగా ఆడుతున్న ఇషాన్‌ కిషన్‌ (32)కు జడేజా బ్రేక్‌లు వేశాడు. ప్రిటోరియస్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. మొదటి మ్యాచ్‌లో విఫలమైన సూర్యకుమార్‌ యాదవ్‌ రెండో మ్యాచ్‌లోనూ నిరాశపర్చాడు. ధోనీకి క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. వేలంలో భారీ ధర పలికిన కామెరూన్‌ గ్రీన్‌ (12) ఔటయ్యాడు. జడేజా వేసిన 8.2 బంతిని గ్రీన్‌ బలంగా బాదాడు. వేగం వచ్చిన బంతిని జడ్డూ అద్భుతంగా ఒడిసిపట్టాడు. ఆ తర్వాత మరో బ్యాటర్​ అర్షద్‌ఖాన్‌ (2) వికెట్ల ముందు దొరికిపోయాడు. నిలకడగా ఆడుతున్న తిలక్ వర్మ (22).. జడేజా బంతికి ఎల్​బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ట్రిస్టన్‌ స్టబ్స్‌ (5) రుతురాజ్‌ గైక్వాడ్‌కు చిక్కాడు. తొలుత ఈ క్యాచ్‌ను బౌండరీ లైన్‌ వద్ద ప్రిటోరియస్‌ అందుకునే ప్రయత్నం చేశాడు. అనంతరం బౌండరీలోకి పడుతుండగా బంతిని గాల్లోకి విసరడంతో గైక్వాడ్ అందుకున్నాడు. దూకుడుగా ఆడుతున్న టిమ్​ డేవిడ్​ను తుషార్​ పాండే పెవిలియన్​కు పంపాడు. హృతిక్​ షోకిన్​(18*), పీయూశ్​ చావ్లా(5*) నాటౌట్​గా నిలిచారు.

రహానే హాఫ్​ సెంచరీ..
ముంబయితో జరిగిన మ్యాచ్​లో అజింక్య రహానే కేవలం 19 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. ఐపీఎల్​ కెరీర్​లో 29వ అర్ధ శతకాన్నిసాధించాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.