ETV Bharat / sports

లో స్కోర్ మ్యాచ్.. అయినా ఉత్కంఠే.. చివరి ఓవర్లో భారత్ విజయం.. సిరీస్ సమం

author img

By

Published : Jan 29, 2023, 10:30 PM IST

Updated : Jan 29, 2023, 10:59 PM IST

న్యూజిలాండ్​తో జరిగిన రెండో టీ20ని భారత్ గెలుచుకుంది. ఉత్కంఠగా సాగిన లో స్కోరింగ్ మ్యాచ్​లో చివరి వరకు పోరాడి విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్​ల సిరీస్ 1-1తో సమమైంది.

india-vs-new-zealand-2nd-t20
ఇండియా న్యూజిలాండ్ టీ20 మ్యాచ్

లఖ్​నవూ వేదికగా న్యూజిలాండ్​తో జరిగిన రెండో టీ20లో భారత్ విజయం సాధించింది. లో స్కోరింగ్ మ్యాచ్​లో భారత్ పట్టుదలతో ఆడి గెలుపొందింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్.. భారత బౌలర్ల ధాటికి 8 వికెట్ల నష్టానికి 99 పరుగులకే పరిమితమైంది. ఛేదనలో భారత్ కాస్త ఒడుదొడుకులు ఎదుర్కొన్నప్పటికీ.. చివరి ఓవర్లో విజయం సాధించింది. 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. మూడు మ్యాచ్​ల సిరీస్​లో తొలి టీ20ని కివీస్ కైవసం చేసుకోగా.. తాజా మ్యాచ్​ను గెలిచి భారత్ సిరీస్ 1-1తో సమం చేసింది.

బ్యాటింగ్​లో కివీస్ సాంతం తడబడింది. ఏ బ్యాటర్ క్రీజులో సౌకర్యవంతంగా కదలలేకపోయారు. ఉమ్రాన్ స్థానంలో టీమ్​లోకి వచ్చిన చాహల్.. తన తొలి ఓవర్లోనే ఓపెనర్ ఫిన్ అలెన్​ను వెనక్కి పంపాడు. ఆ ఓవర్​ను మెయిడెన్ విసిరి తన పునరాగమనాన్ని ఘనంగా చాటుకున్నాడు. వికెట్​ స్పిన్​కు అనుకూలిస్తున్న నేపథ్యంలో పాండ్య చాకచక్యంగా వ్యవహరించాడు. స్పిన్నర్లను చక్కగా ఉపయోగించుకుంటూ వికెట్లు రాబట్టాడు. శాంట్నర్ 19 పరుగులతో ఆ జట్టుకు టాప్ స్కోరర్​గా నిలిచాడు. భారత బౌలర్లలో అర్ష్​దీప్ 2 వికెట్లు తీయగా.. పాండ్య, సుందర్, చాహల్, హుడా, కుల్దీప్ ఒక్కో వికెట్ పడగొట్టారు.

ఇక ఛేదనలో భారత బ్యాటర్లు సైతం తడబడ్డారు. వరుసగా రెండో మ్యాచ్​లోనూ టాప్ ఆర్డర్ బ్యాటర్లు విఫలమయ్యారు. శుభ్​మన్ గిల్ 11 పరుగులు చేయగా.. ఇషాన్ కిషన్ 32 బంతుల్లో 19, రాహుల్ త్రిపాఠి 18 బంతుల్లో 13 పరుగులు చేసి వెనుదిరిగారు. సూర్య కుమార్ యాదవ్ (31 బంతుల్లో 26), హార్దిక్ పాండ్య (20 బంతుల్లో 15) చివరి వరకు నిలిచి భారత్​ను గెలిపించారు.

Last Updated :Jan 29, 2023, 10:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.