Indw vs Ausw: మహిళల టీ20 ప్రపంచకప్ సన్నాహాల్లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన తొలి టీ20లో ఆసీస్ అదరగొట్టింది. టీమ్‌ఇండియాపై 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 1-0 తేడాతో ఆధిక్యం సాధించింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన టీమ్‌ఇండియా నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని ఆస్ట్రేలియా 18.1 ఓవర్లలో ఒక వికెట్ మాత్రమే నష్టపోయి ఛేదించింది. ఆసీస్ ఓపెనర్ బెత్ మూనీ (89; 57 బంతుల్లో 16 ఫోర్లు) విజయంలో కీలకపాత్ర పోషించింది. అలిస్సా హీలీ (37; 23 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించగా.. తహ్లియా మెక్‌గ్రాత్ (40) ఫర్వాలేదనిపించింది. భారత్ బౌలర్లలో దేవిక వైద్య ఒక వికెట్ పడగొట్టగా మిగతా బౌలర్లు ఒక్క వికెట్టూ కూడా పడగొట్టలేకపోయారు.
ఓపెనర్లు తొలి మూడు ఓవర్లపాటు నెమ్మదిగా ఆడినా తర్వాత నుంచి జోరు పెంచారు. దీంతో 8 ఓవర్లకు ఆస్ట్రేలియా స్కోరు 68/0గా నమోదైంది. ఈ జోడీ దూకుడుకు తొమ్మిదో ఓవర్‌లో దేవిక వైద్య బ్రేక్‌లు వేసింది. అలిస్సాని ఔట్ చేసి భారత్‌కు ఉపశమనాన్ని అందించింది. తర్వాత క్రీజులోకి వచ్చిన మెక్‌గ్రాత్‌తో కలిసి బెత్ మూనీ ఇన్నింగ్స్‌ని ముందుకు తీసుకెళ్లి ఆసీస్‌కు విజయాన్ని అందించింది.