ETV Bharat / science-and-technology

ఫేస్​బుక్​లో ఫేక్​ ప్రొఫైల్స్​తో విసిగిపోతున్నారా? వాటికి చెక్​ పెట్టండిలా..

author img

By

Published : Apr 5, 2023, 4:53 PM IST

ఇంటర్నెట్ విప్లవం కారణంగా ప్రస్తుతం మొబైల్ ఫోన్ల వినియోగం బాగా పెరిగింది. ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతుల్లోకి ఫోన్ వచ్చేసింది. చిన్నాపెద్దా అనే తేడాల్లేకుండా అందరూ వాటికి అతుక్కుపోతున్నారు. ముఖ్యంగా వాట్సాప్​, ఫేస్​బుక్, ఇన్​స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా యాప్స్​ను ఎక్కువగా బ్రౌజ్ చేస్తుండటాన్ని గమనించొచ్చు. ఎవరు మెసేజ్ పంపారు, ఎవరేం స్టేటస్ పెట్టారు, స్టోరీస్​ అప్​డేట్స్ ఏమైనా ఉన్నాయా అంటూ సమయం దొరికినప్పుడల్లా చూస్తుండటం చాలా మందికి ఓ అలవాటుగా మారిపోయింది. అంతగా సోషల్ మీడియా వినియోగం పెరిగింది. అందులోనూ ఫేస్‌బుక్ లాంటి యాప్​ను వాడేవారు కోట్లలో ఉన్నారు. అయితే ఈ క్రమంలోనే కొన్ని ఫేక్​ అకౌంట్​ల కారణంగా చాలామంది వేధింపులకు గురవుతుంటారు. మరి ఇలా నిత్యం మనల్ని ఇబ్బంది పెట్టే ఫేక్​ ప్రొఫైల్స్​ను గుర్తించడం ఎలా అనుకుంటున్నారా? వీటికి చెక్​ ఎలా పెట్టాలో తెలియటం లేదా? అయితే ఈ కథనం మీ కోసమే..!

how to delete fake friends on facebook
ఫేస్​బుక్​లో ఫేక్​ ఐడీలతో ఎలా జాగ్రత్త పడాలి

ఈమధ్య వాట్సాప్, ఇన్​స్టాగ్రామ్​, ట్విట్టర్ వాడకం పెరిగాయి. ఇకపోతే ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది వాడుతున్న సోషల్ మీడియా సైట్లలో ఫేస్​బుక్ ఒకటి. పదేళ్ల కింద సోషల్ మీడియా అంటే ఫేస్‌బుక్ అనేలా ఉండేది. ఇప్పటికీ సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అనేక మంది ఫేస్‌బుక్​ను ఉపయోగిస్తున్నారు. అందులోనే తమ భావాలను పంచుకుంటున్నారు. స్నేహితులు, బంధువులు, దగ్గరివారితో మెసేజ్​ల రూపంలో మాట్లాడుకుంటూ ఉంటారు. వ్యక్తిగత సంభాషణలకు ఫేస్‌బుక్​ను మించిన ప్లాట్​ఫామ్ లేదని చెప్పొచ్చు. అయితే, కొంతమంది దీనిని తప్పుడు ఉద్దేశంతో వాడుతున్నారు. ఫేస్‌బుక్​కు ప్లస్​ పాయింట్​గా చెప్పుకునే కొన్ని అంశాలే పలు సందర్భాల్లో తీవ్ర అనర్థాలకు దారి తీస్తోంది. అదే ఫేక్​ ప్రొఫైల్స్​ల బెడద. ఈ జాఢ్యం ఎంతలా పెరిగిపోయిందంటే దీన్ని తయారు చేసిన ఫేస్‌బుక్​నే తీవ్రంగా ఇబ్బంది పెట్టేవిధంగా. మరి ఈ ఫేక్​ ప్రొఫైల్​ల మాయాజాలాన్ని గుర్తించి వాటికి అడ్డుకట్ట ఎలా వేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

అప్రమత్తత అవసరం..!
ఫేస్‌బుక్​లో జరిపే పర్సనల్​ చాటింగ్​లు, అందులోనూ దగ్గరివారితో పంచుకున్న సున్నితమైన విషయాలను కేటుగాళ్లు దుర్వినియోగం చేసిన ఘటనలు చాలానే ఉన్నాయి. ఈ ప్లాట్ ఫామ్​లో మీకు కావాల్సిన వ్యక్తితో మీరు చాటింగ్​ చేస్తుండొచ్చు. కానీ ఆ వ్యక్తి మీరు అనుకున్న వ్యక్తి కాకపోవచ్చు! అది ఆన్​లైన్ ఫేక్ ప్రొఫైల్ అయి ఉండొచ్చు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకునే వ్యక్తులు ఫేక్ ప్రొఫైల్స్​ల రూపంలో మీకు దగ్గరై.. మీ సమాచారాన్ని రాబట్టి మిమ్మల్ని లేనిపోని సమస్యలకు గురిచేసే ప్రమాదం ఉంది. కాబట్టి ఫేస్‌బుక్​లో ఫేక్ ప్రొఫైల్స్​ల పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలి.

నిజాయతీగా ఉండాలి..!
ఎక్కడైనా సరే మనకో గుర్తింపు తెచ్చుకోవాలంటే మనం ఎలా ఉంటామో అలాగే ఉండాలి. అది బయట సమాజంలో కానివ్వండి, విద్య, ఉద్యోగ, ఉపాధి లేదా ఇతర రంగం ఏదైనా కానివ్వండి. మనం ఎలా ఉన్నామో అలా ఉంటేనే ఇతరులకు నచ్చే అవకాశం ఉంటుంది. సోషల్ మీడియాలోనూ మనదైన వ్యక్తిత్వంతో, హుందాగా ప్రవర్తిస్తేనే బాగుంటుంది. ఫొటోలు, విద్య, ఉద్యోగం వంటి మన వ్యక్తిగత సమాచారం కూడా సోషల్ మీడియాలో ఉన్నది ఉన్నట్లు అప్​లోడ్ చేయాలి. అప్పుడే మన మిత్రులు మనల్ని సులువుగా గుర్తించగలరు.

కొందరు మాత్రం తమ సొంత గుర్తింపును కాక ఇతరుల ఐడెంటిటీని వాడి ఫేస్‌బుక్​లో నకిలీ ఖాతాలను తెరుస్తుంటారు. కుటుంబీకులు లేదా మిత్రుల్లో ఎవరి ఫొటోలు అయినా తీసుకుని డిస్​ప్లే పిక్చర్(డీపీ)లుగా పెట్టుకుంటారు. ఫేక్ ప్రొఫైల్స్ వాడే మగవారు ఎక్కువగా అమ్మాయిలను ఇంప్రెస్ చేయడానికి ఇలా చేస్తుంటారట. తమకు తెలిసినవారిలో ఎవరైనా అందమైన అబ్బాయిలు ఉంటే వారి ఫొటోలు పెట్టుకుని అమ్మాయిలతో చాటింగ్ చేస్తారట. సెలబ్రిటీలకు దగ్గరయ్యేందుకు కూడా ఫేక్ ప్రొఫైల్స్​ను వినియోగిస్తున్నారట. ఇలాంటి ప్రొఫైల్స్ వాడేవారు ఏదైనా చెడు జరిగితే డీపీలో ఉన్న వ్యక్తుల మీదకు ఆ తప్పును నెడుతున్నారని నిపుణులు అంటున్నారు. కాబట్టి సోషల్ మీడియా ముఖ్యంగా ఫేస్​బుక్​ను వినియోగించే వారు నకిలీ(ఫేక్​) ప్రొఫైల్స్​ను గుర్తించడం అన్నది తప్పనిసరి. వీటిని జల్లెడ పట్టేందుకు పలు సూత్రాలను సూచిస్తున్నారు ​టెక్​ నిపుణులు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

అంగట్లో ఫేక్​ అకౌంట్లు!
ఫేస్‌బుక్​లో ఉండే ఫేక్ అకౌంట్​లలో చాలా వరకు హ్యాక్ చేసిన అకౌంట్లే. ఫేస్‌బుక్​లో ఉన్న పాత అకౌంట్లకు బ్లాక్ మార్కెట్​లో డిమాండ్ బాగా పెరుగుతోందట. ఎవరైనా ఒక వ్యక్తి మరో వ్యక్తిని ఫాలో అవుతూ ఒక కొత్త ఫేస్‌బుక్ అకౌంట్ క్రియేట్ చేస్తే.. దాన్ని గుర్తించడం సులువే. అందుకే కొందరు కేటుగాళ్లు కొత్త అకౌంట్లకు బదులు అప్పటికే ఉన్న పాత అకౌంట్లను హ్యాక్ చేస్తున్నారని నిపుణులు చెబుతున్నారు. ఏదైనా దేశానికి చెందిన పాత అకౌంట్​ను బ్లాక్ మార్కెట్​లో డబ్బులు పెట్టి మరి కొంటున్నారట.

ఫేక్​ వీరులు రెగ్యులర్​గా పోస్ట్​లు పెట్టరు!
ఫేక్ ప్రొఫైల్స్​లలో ఒక విషయాన్ని సులువుగా గుర్తించొచ్చు. రోజువారి జీవితానికి సంబంధించిన అప్​డేట్లు ఈ ఖాతాల్లో పెద్దగా ఉండవు. వారు ఎవరి పేరు మీద నకిలీ అకౌంట్ క్రియేట్​ చేశారో.. వారికి సంబంధించి ఏవైనా ఫొటోలు గానీ వీడియోలు గానీ దొరికితేనే వాటిని అప్పుడప్పుడు పోస్ట్​ చేస్తుంటారు. ఒక్కోసారి ఆయా వ్యక్తుల ఫొటోలను దొంగిలించి కూడా ఫేస్‌బుక్​లో అప్​లోడ్ చేస్తుంటారు.

టైమ్​లైన్​ ద్వారానూ పసిగట్టోచ్చు!
ఫేస్‌బుక్​లో టైమ్​లైన్​ను బట్టి కూడా ఆ అకౌంట్ నకిలీనా కాదా అనేది చెప్పేయొచ్చు. ఫేక్ ప్రొఫైల్స్​ను నిశితంగా గమనిస్తే వాటి టైమ్​లైన్స్ సరిగ్గా ఉండదు. ఈమధ్య తరచూ పోస్టులు పెడుతూ ఉండొచ్చు కానీ అంతకుముందు కొన్ని నెలల పాటు ఆ ప్రొఫైల్ పూర్తి ఇన్​యాక్టివ్​గా ఉండొచ్చు. ఇలాంటి ప్రొఫైల్స్​లలో గతంలో పెట్టిన పాత పోస్టులు పూర్తిగా కనిపించకుండా హైడ్ చేసి ఉండొచ్చు. కొత్తగా ఏవైనా పోస్టులు పెట్టి, పాత పోస్టులను తీసేసే బ్లాక్​ వాల్ అకౌంట్లతో జాగ్రత్తగా ఉండాలి.

హెల్ప్​ చేయండి అని పెట్టే స్టోరీస్​పై ఓ కన్నేయండి!
ఫేస్‌బుక్​లో మీకు తెలిసినవారు, కుటుంబసభ్యులు లేదా మిత్రుల నుంచి సాయం కోరుతూ ఏదైనా మెసేజ్ వచ్చిందా? ఫలానా సమాచారం కావాలంటూ సందేశం అందుకున్నారా? అయితే వారితో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఆలోచించకుండా మీ సీక్రెట్​ విషయాలను ఎట్టిపరిస్థితుల్లోనూ అలాంటి వారితో పంచుకోవద్దు. ఫేస్‌బుక్​లో మీకు, వాళ్లకు చాన్నాళ్లుగా పరిచయం ఉన్నా సరే అశ్రద్ధ వహించొద్దు. అవసరమైతే నేరుగా కాల్ చేసి నిజానిజాలు తెలుసుకోండి. వీలైతే కలసి సమస్యేంటో అడిగి తెలుసుకోండి. అన్నీ సరైనవని అనిపిస్తే తప్ప సాయం చేయకండి.

ఆ ప్రస్తావన వస్తే తప్పించుకోవడానికి చూస్తారు!
నకిలీ అకౌంట్లను వాడే వారు తమకు బాగా తెలిసిన వారి పేర్లు, ఫొటోలతోనే వాటిని నడిపిస్తుంటారు. కాబట్టి మీ గురించి తెలియని విషయాల ప్రస్తావన వస్తే వారు తప్పించుకోవడానికే ప్రయత్నిస్తారు. కాబట్టి ఆ అకౌంట్ నకిలీదో కాదోనని తెలుసుకునేందుకు వారితో లోతుగా సంభాషణ జరపడం ఒక పద్ధతి అని నిపుణులు సూచిస్తున్నారు. అన్ని విషయాల గురించి మాట్లాడితే ఎక్కడో చోట వారు దొరికిపోయే అవకాశం ఉందని చెబుతున్నారు.

టెన్షన్​ ఎందుకు.. టూల్స్​ ఉన్నాయ్​గా!
మీ ఫేస్‌బుక్​లో ఏదైనా అకౌంట్ నకిలీదని మీకు అనుమానం వచ్చిందా? వెంటనే గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ వాడండి. అది వద్దనుకుంటే టిన్ ఐ(TinEye) లేదా పిక్సీ(Pixsy)లాంటి సెర్చ్ టూల్స్​ సహాయంతో సదరు అకౌంట్​ ఫేక్ ప్రొఫైలా కాదా అనేది సులువుగా తెలుసుకోవచ్చు. ఆయా సెర్చ్ టూల్స్​లో మీతో కాంటాక్ట్​లో ఉన్న వ్యక్తి డీపీని లేదా ఇతర ఫొటోలను అప్​లోడ్ చేసి సెర్చ్ బటన్​పై క్లిక్ చేయండి. సెర్చ్​లో ఒకవేళ ఫొటోలు అంతకుముందు వేరే ఎక్కడో ఒకచోట వాడినట్లు చూపిస్తే.. మీతో కాంటాక్ట్​లో ఉన్న అకౌంట్ నకిలీదని గ్రహించండి.

పదే పదే ఫ్రెండ్​ రిక్వెస్ట్​లను పంపుతున్నారా..?
ఫేస్‌బుక్​లో ఈమధ్య మీకు ఫ్రెండ్ రిక్వెస్టులు ఎక్కువగా వచ్చాయా? ఎలాంటి మ్యూచువల్ ఫ్రెండ్స్ లేని అకౌంట్ల నుంచి రిక్వెస్టులు వస్తున్నాయా? అయితే అవి ఫేక్ అకౌంట్లు అయ్యే ప్రమాదం ఉంది. మిమ్మల్ని లక్ష్యంగా చేసుకుని పదే పదే వేర్వేరు అకౌంట్ల నుంచి ఫ్రెండ్ రిక్వెస్టులు వస్తున్నాయంటే అలర్ట్​గా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. మ్యూచువల్ ఫ్రెండ్స్ లేని ఖాతాల నుంచి రిక్వెస్టులు వస్తే అవసరమైతే వాటిని బ్లాక్ చేయడానికి ఆలోచించొద్దు.

దీని కోసం మొబైల్​లోని ఫేస్‌బుక్​ సెట్టింగ్స్ యాప్​లోకి వెళ్లాలి. సెట్టింగ్స్ సెక్షన్​లో 'హౌ పీపుల్ కెన్ ఫైండ్​ అండ్ కాంటాక్ట్ యూ'​పై క్లిక్ చేయాలి. అందులో 'హూ కెన్ సెండ్ యూ ఫ్రెండ్ రిక్వెస్ట్​' ఆప్షన్​ను ఎంచుకోవాలి. ఆ తర్వాత 'ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్రెండ్స్'ఆప్షన్​ను సెలెక్ట్ చేయాలి. దీంతో మీ స్నేహితుల మిత్రులు మాత్రమే మీకు ఫ్రెండ్ రిక్వెస్టులు పంపేందుకు ఆస్కారం ఉంటుంది.

ఇతరులనూ చైతన్యపరచండి!
ఇక చివరగా ఫేక్​ ప్రోఫైల్స్​కు ఎలా చెక్​ పెట్టాలో మీరు మాత్రమే తెలుసుకొని ఉండిపోకండి. వీలైతే ఇతరులకూ దీని గురించి సమాచారం అందించి చైతన్యపరచండిలా.. ఫేక్ ప్రొఫైల్స్ గురించి మీ స్నేహితులు, కుటుంబీకులకు వివరించండి. నకిలీ ప్రొఫైల్స్ వల్ల ఎంత నష్టం వాటిల్లే ప్రమాదం ఉందో వారికి కూడా తెలియజేయండి. ఫ్రెండ్ రిక్వెస్ట్ రాగానే వెంటనే యాక్సెప్ట్ చేయకుండా.. ఆ అకౌంట్​కు సంబంధించిన వివరాలు తెలుసుకుని నిజనిర్ధారణ చేసుకోమని చెప్పండి. తెలిసిన వారని నమ్మకం కుదిరిన తర్వాతే సదరు అకౌంట్లతో చాటింగ్​ చేయడం శ్రేయస్కరం అని వారికి అర్థమయ్యేలా చెప్పాల్సిన బాధ్యత మనందరి పైనా ఉంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.