5G In India: దేశ సమాచార, సాంకేతిక విప్లవంలో మరో మైలురాయిగా నిలుస్తుందంటున్న 5జీ మొబైల్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చేసింది. 5జీ సేవలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల శ్రీకారం చుట్టారు. 4జీతో పోలిస్తే ఎన్నో రెట్లు వేగవంతమైన అంతర్జాలం అందించే 5జీ- అమెరికా, చైనా, దక్షిణ కొరియా, ఐరోపాలోని కొన్ని దేశాల్లో ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది. ఈ విషయంలో రకరకాల కారణాలతో మనం వెనకబడినప్పటికీ ఇప్పటి నుంచే వేగం పుంజుకోవడానికి అవకాశాలు పుష్కలం.
2జీ, 3జీల సమయంలో సెల్‌ఫోన్ నెట్‌వర్క్ అనేది కేవలం సమాచార మార్పిడికి మాత్రమే. అయితే 4జీతో అంతర్జాల వేగం పెరగడం, డిజిటలీకరణ దూకుడుతో విస్తృత ప్రయోజనాలు అందుబాటులోకి వచ్చాయి. కరోనా నేపథ్యంలో ఇంటినుంచే పని, ఆన్‌లైన్ తరగతులు, టెలీ మెడిసిన్ వంటి వాటికి 4జీ ఎంతగానో ఉపయోగపడింది. 5జీతో వాటి పరిధి మరింత విస్తృతం కానుందనడంలో సందేహం లేదు. 'కృత్రిమ మేధ, మెషీన్ లెర్నింగ్' వంటి ఆధునిక సాంకేతికతలు మరింత వేగంగా వ్యాప్తి చెందడానికి, తద్వారా విద్య, వైద్యం వంటి ప్రాధాన్య రంగాల్లో అభివృద్ధి సాధించడానికి 5జీ ఎంతగానో సహకరిస్తుంది.
కంపెనీల సన్నద్ధత ఎంత?
దేశీయ టెలికాం రంగంలో అగ్రస్థానం కోసం 'నువ్వా నేనా' అంటూ పోటీ పడుతున్న ఎయిర్‌టెల్, జియోలు 5జీ రాకతో తమ పట్టు నిలబెట్టుకొనేందుకు పూర్తిస్థాయిలో ప్రయత్నిస్తున్నాయి. ఎయిర్‌టెల్ సాధ్యమైనన్ని ఎక్కువ ప్రాంతాల్లో 5జీని తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు దేశంలోని 1000 నగరాల్లో 5జీని ప్రవేశపెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు జియో ఇన్ఫోకామ్ ప్రెసిడెంట్ కిరణ్ థామస్ ఈ ఏడాది జనవరిలోనే ప్రకటించారు. ఆర్థిక ఇబ్బందులున్నా 5జీ సెక్ట్రమ్ వేలంలో బలంగా నిలబడిన వొడాఫోన్ ఐడియా కూడా భవిష్యత్తుపై గంపెడాశలు పెట్టుకొంది. కానీ, కంపెనీలు చెబుతున్నంత వేగంగా 5జీ వ్యాప్తి ఉంటుందా అనేది ప్రశ్నార్థకమే.
అమెరికా, చైనాలలో 5జీ నెట్‌వర్క్‌ను వాడుకోగల పరికరాలు, టారిఫ్‌ను తట్టుకోగలిగే ఆర్థిక స్తోమత కలిగిన వినియోగదారులు ఉన్నారు. వారి సంఖ్య 15 కోట్లకు కాస్త అటూఇటుగానే ఉంది. 2026 కల్లా 19.5 కోట్ల 5జీ చందాదారులను సంపాదించుకోగలమని అమెరికా లెక్కలు కడుతోంది. మరోవైపు 9.61 లక్షల 5జీ బేస్ స్టేషన్లను నిర్మించిన చైనా సైతం ఇప్పటివరకు 12.8 కోట్ల 5జీ హ్యాండ్‌సెట్లను మాత్రమే దిగుమతి చేసుకోగలిగింది. ఈ నేపథ్యంలో మనదేశంలో 5జీ విస్తృతి, దానికి తగ్గట్లు ఆ సాంకేతికతను ఉపయోగించుకోగలిగే ఫోన్లు కోట్ల మంది వినియోగదారుల చెంతకు చేరడం అంత ఆషామాషీ కాదని నిపుణులు విశ్లేషిస్తున్నారు. మూడు, నాలుగేళ్లుగా 5జీ వస్తే ఏం చేయాలనే అంశంపైనే ప్రధాన టెలికాం కంపెనీలన్నీ దృష్టి సారించాయి.
అదే సమయంలో దేశంలో ఇప్పటికే విస్తృత స్థాయిలో ఉన్న 4జీ నెట్‌వర్క్ మెరుగుదలను పక్కనపెట్టేశాయన్నది కాదనలేని వాస్తవం. కరోనా సమయంలో, ఆ తరవాత.. ఇంటి నుంచి పని, ఆన్‌లైన్ విద్య వంటి అవసరాల నేపథ్యంలో ఇంటికి మూడు, నాలుగు స్మార్ట్‌ఫోన్లు వచ్చాయి. అయితే ఆ స్థాయిలో నెట్‌వర్క్ అభివృద్ధి చెందలేదు. సెల్‌ఫోన్ సిగ్నల్ టవర్ల సంఖ్య పెరగకపోవడంతో హైదరాబాద్ వంటి మహానగరాల్లోనే చాలాచోట్ల అంతర్జాలం మొరాయించడం, ఫోన్ కాల్స్‌లో సేవాలోపాలు నెలకొంటున్న ఉదాహరణలు కోకొల్లలు. ఈ పరిస్థితుల్లో పూర్తిగా కొత్త సాంకేతికతను చందాదారులకు అందివ్వడంలో కంపెనీలు ఏ మేరకు సఫలీకృతమవుతాయనేది వేచి చూడాలి.
దేశీయంగా విస్తృత ప్రయోజనాలు
దేశీయంగా ఉత్పత్తిచేసిన పరికరాలనే 5జీలో వాడుతుండటంతో తయారీ రంగానికి ఎనలేని ప్రోత్సాహం లభించనుంది. యాపిల్ లాంటి దిగ్గజ కంపెనీలూ భారత్‌లో తయారీకి జై కొడుతున్న తరుణంలో దేశీయంగా 5జీ ఫోన్లు అందుబాటు ధరల్లోనే లభించనున్నాయి. జూన్‌తో ముగిసిన ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికే దేశంలో దాదాపు అరకోటి 5జీ ఫోన్లు ఉన్నాయి. స్మార్ట్‌ఫోన్ మార్కెట్ పడిపోతుందని కంపెనీలు ఆందోళన చెందుతున్నాయి. 5జీ వాటికో సువర్ణావకాశం. ఇప్పుడున్న ఫోన్ల స్థాయిని పెంచుకోవాలంటే కచ్చితంగా 5జీ సాంకేతికత ఉన్న మొబైళ్లను కొనాల్సివస్తుంది. దీంతో కంపెనీలకు కొత్త వినియోగదారులు దొరికినట్లే. వినోదమే కాదు... గేమింగ్ రంగ పురోభివృద్ధికీ 5జీ ఎంతగానో సహకరిస్తుంది. 5జీతో వేగవంతమైన అంతర్జాలం అందుబాటులోకి వస్తుంది.
కృత్రిమ మేధ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, వర్చువల్ రియాలిటీ వంటి ఆధునిక పరిజ్ఞానం విస్తృతమవుతుంది. సుదృఢమైన అంతర్జాల సౌకర్యం ఆన్‌లైన్ విద్య, టెలి మెడిసిన్‌తోపాటు బ్యాంకింగ్, పారిశ్రామికీకరణ, వ్యవసాయం వంటివాటిలో అభివృద్ధికి అవకాశం కల్పిస్తుంది. తద్వారా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగవుతాయని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. 5జీ రాకతో రానున్న ఒకటిన్నర దశాబ్దాల కాలంలో దేశ ఆర్థిక వ్యవస్థ రూ.36.72 లక్షల కోట్లకు పెరుగుతుందని ప్రధాని మోదీ 5జీ సర్వీసుల ప్రారంభోత్సవం సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశారు. విద్య, వైద్యం, వ్యవసాయం, పరిశ్రమలు వంటి మౌలిక రంగాలు శరవేగంగా అభివృద్ధి చెంది, ఉద్యోగ కల్పనలోనూ ఉపకరిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఆకాంక్షలన్నీ తీరాలంటే ప్రధానంగా కావాల్సింది 5జీని పూర్తి స్థాయిలో వినియోగదారులకు అందించాలన్న దృఢ సంకల్పం ఉన్న టెల్కోలు. 115 కోట్లకు పైగా మొబైల్ కనెక్షన్లతో బంగారుబాతులా ఉన్న భారత మార్కెట్‌ను అవి ఎంతగా ఉపయోగించుకుని, వినియోగదారులకు ఎంత మెరుగైన సేవలందిస్తాయనే అంశంపైనే 5జీ చుట్టూ అల్లుకున్న ఆశలన్నీ ఆధారపడి ఉంటాయి.
ఛార్జీలు పెరగవా?
ప్రభుత్వం ముందు నుంచీ 4జీ, 5జీ ధరల్లో భారీ తేడా ఉండకపోవచ్చని చెబుతోంది. అయితే డేటా వేగం పెరుగుతున్నందువల్ల వినియోగదారులు 5జీ నెట్‌వర్క్‌లో ఎక్కువ డేటా వాడాల్సిన అవసరం ఉంటుంది. ఫలితంగా టెలికాం కంపెనీలకు ప్రతి వినియోగదారుపై సగటు ఆదాయం (ఏఆర్‌పీయూ) పెరుగుతుంది. అందుకే ఛార్జీల గురించి ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలపై కంపెనీలు మారుమాట్లాడటం లేదని మార్కెట్ నిపుణులు అంటున్నారు. అయితే మొదట్లో అందరినీ కొత్త తరం సాంకేతికత వైపు ఆకర్షించేందుకు కంపెనీలు టారిఫ్ విషయంలో కాస్త జాగ్రత్త పాటిస్తాయని, అందరూ అలవాటు పడ్డాక ఛార్జీలు పెంచే అవకాశాలుంటాయని విశ్లేషిస్తున్నారు.
- శ్యాంప్రసాద్ ముఖర్జీ కొండవీటి