ETV Bharat / lifestyle

వేసవిలో చల్లచల్లని టీలు.. మీకోసమే!

author img

By

Published : Apr 11, 2021, 11:33 AM IST

చిరాకు, పరాకులను క్షణాల్లో మాయంచేసే ఛాయ్‌ చెమక్కుల గురించి ఎంత చెప్పినా తక్కువే. అసలే ఎండలు మండిపోతుంటే వేడిగా టీలేంటి అంటారా.. కూల్‌కూల్‌. ఈ చల్లచల్లని టీలు మీకోసమే.

cool tea
వేసవిలో చల్లచల్లని టీలు.. మీకోసమే!

మందారాలతో

hibiscus
మందారాలతో

కావాల్సినవి: నీళ్లు- రెండు కప్పులు, మందారాలు- నాలుగు, తేనె- రెండు టీస్పూన్లు, నిమ్మరసం- టీస్పూన్‌.
తయారీ: మందారపూలను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. రెండు కప్పుల నీళ్లను బాగా మరిగించి దాంట్లో మందారాలు వేయాలి. తర్వాత గిన్నె మీద మూత పెట్టి పావుగంటపాటు పక్కన పెట్టేయాలి. ఇప్పుడు వడకట్టి తేనె, నిమ్మరసం కలిపి ఐస్‌క్యూబ్స్‌ వేసుకోవాలి. మందారపూలను ఎండబెట్టి తయారుచేసిన పొడి మార్కెట్‌లోనూ అందుబాటులో ఉంటుంది.

గులాబీరేకులతో

rose petals
గులాబీరేకులతో

కావాల్సినవి: నీళ్లు- రెండు గ్లాసులు, గులాబీరేకలు- గుప్పెడు, నిమ్మరసం- అరచెక్క, తేనె- రెండు టీస్పూన్లు.
తయారీ: నీళ్లను బాగా మరిగించి గులాబీ రేకలు వేయాలి. ఐదు నిమిషాలు మరిగిన తర్వాత గిన్నె మీద మూతపెట్టి స్టవ్‌ ఆఫ్‌ చేయాలి. చల్లారిన తర్వాత వడకట్టి, తేనె, నిమ్మరసం కలపాలి. దీంట్లో ఐస్‌క్యూబ్స్‌ వేసుకుని తీసుకోండి.

లెమన్‌గ్రాస్‌తో

lemon grass
లెమన్‌గ్రాస్‌తో

కావాల్సినవి: నీళ్లు- నాలుగు కప్పులు, లెమన్‌గ్రాస్‌- రెండు రెమ్మలు, నిమ్మరసం- రెండు టేబుల్‌స్పూన్లు, గ్రీన్‌టీ బ్యాగ్‌లు- రెండు, తేనె- రెండు టేబుల్‌స్పూన్లు.
తయారీ: లెమన్‌గ్రాస్‌ను ముందుగా చిన్నచిన్న ముక్కల్లా కోసుకోవాలి. గిన్నెలో నాలుగు కప్పుల నీళ్లను మరిగించుకోవాలి. దీంట్లో లెమన్‌గ్రాస్‌ ముక్కలు వేయాలి. ఇప్పుడు పాత్ర మీద మూత పెట్టి తక్కువ మంట మీద పది నిమిషాలపాటు ఈ ముక్కలను ఉడికించాలి. ఇవి బాగా ఉడికి నీళ్లు ఆకుపచ్చ రంగులోకి వచ్చేయాలి. గ్రీన్‌టీ బ్యాగ్‌లను ఈ నీళ్లలో ముంచి మరో ఐదు నిమిషాలపాటు మరగనివ్వాలి. ఇప్పుడు స్టవ్‌ ఆఫ్‌ చేసి రెండు నిమిషాలపాటు టీని అలాగే ఉంచాలి. వడకట్టుకుని నిమ్మరసం, తేనె కలపాలి. వేడి తగ్గిన తర్వాత రెండు, మూడు గంటలపాటు ఫ్రిజ్‌లో పెట్టి చల్లచల్లగా తాగేయాలి.

థాయ్‌ ఐస్‌టీ

thai ice tea
థాయ్‌ ఐస్‌టీ

కావాల్సినవి: నీళ్లు- రెండు కప్పులు, బ్లాక్‌టీ- రెండు టీస్పూన్లు, దాల్చినచెక్క- చిన్న ముక్క, యాలకులు- రెండు, కండెన్స్‌డ్‌ మిల్క్‌/ కొబ్బరిపాలు/ హోల్‌మిల్క్‌- రెండు టీస్పూన్లు, పంచదార- టేబుల్‌స్పూన్‌.
తయారీ: నీళ్లను బాగా మరిగించి బ్లాక్‌ టీపొడి వేయాలి. దీంట్లోనే దాల్చినచెక్క, యాలకులు వేసి మరిగించాలి. ఈ మిశ్రమాన్ని వడకట్టి కండెన్స్‌డ్‌ మిల్క్‌, పంచదార కలపాలి. గ్లాసుల్లో ఐస్‌క్యూబ్స్‌ వేసి ఈ టీ మిశ్రమాన్ని పోసుకుని చల్లగా ఆస్వాదించండి.

ఇదీ చూడండి:

'లక్క కళ'కు జీవం పోస్తున్న రాజస్థాన్​ వాసి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.