ప్రియుడ్ని కిడ్నాప్ చేసేందుకు ప్రియురాలు యత్నించిన క్రమంలో జరిగిన పెనుగులాటలో అతడి తండ్రి మృతి చెందడం మంగళవారం విశాఖ నగర పరిధిలో కలకలం రేపింది. భీమిలి సీఐ శ్రీనివాస్, స్థానికుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. తగరపువలస బాలాజీనగర్‌కి చెందిన రౌతు వంశీకృష్ణ(24) అదే ప్రాంతంలోని తన తండ్రికి చెందిన చికెన్ దుకాణానికి మంగళవారం మధ్యాహ్నం వెళ్తున్నాడు. జాతీయరహదారి అండర్‌పాస్ వంతెన కింద సినీఫక్కీలో నలుగురు యువకులతో కలిసి కాపు కాసిన 35 ఏళ్ల మహిళ అతడిని కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించింది. అక్కడికి సమీపంలోనే ఉన్న అతడి తండ్రి రౌతు వెంకటరావు(48) వచ్ఛి.. తన కొడుకు వద్దకు ఎందుకు వచ్చావని ఆమెను నిలదీయడంతో ఇరువర్గాల మధ్య పెనుగులాట జరిగింది.
ఈ క్రమంలో వెంకటరావు అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు విడిచారు. మహిళ, ఆమెతో వచ్చిన నలుగురు యువకులు అక్కడ్నుంచి కారులో పరారయ్యారు. మధురవాడ ఏసీపీ రవిశంకర్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు వివరాలు సేకరించారు. మృతదేహాన్ని భీమిలి ప్రభుత్వాసుపత్రికి పంపారు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు నిందితులపై 304 పార్ట్ 2 కింద కేసు నమోదు చేశామని సీఐ చెప్పారు.
శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన ఆ మహిళ భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి తగరపువలస బాలాజీనగర్‌లో రెండేళ్ల కిందట ఉండేవారు. ఈ యువకునితో ఏర్పడిన పరిచయంతో వారిద్దరూ కొద్దిరోజులు బయటకు వెళ్లిపోయారు. అప్పట్లో భీమిలి స్టేషన్‌లో ఈవిషయంపై అదృశ్యం కేసు నమోదయ్యింది. ఆ కారణంగా జరిగిన గొడవల్లో పెద్దల సమక్షంలో వంశీ తండ్రి వెంకటరావు ఆమెకు రూ.2లక్షలు ఇచ్చి పత్రాలు రాయించుకున్నారని స్థానికులు, మృతుని భార్య పోలీసులకు చెప్పారు.
ఇదీ చదవండి: