ETV Bharat / international

పోర్న్​స్టార్​ వివాదంతో ట్రంప్​పై కాసుల వర్షం.. 24 గంటల్లో రూ.33 కోట్లు.. డేనియల్స్​కు కూడా..

author img

By

Published : Apr 1, 2023, 3:44 PM IST

పోర్న్ స్టార్ వివాదం డొనాల్డ్ ట్రంప్​తో పాటు శృంగార తారకు కాసులు తెచ్చిపెడుతోంది. 24 గంటల్లో ట్రంప్ ప్రచార బృందం 4 మిలియన్ డాలర్లను సమీకరించింది. పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్ తన మర్చెండైజ్ బిజినెస్​తో దూసుకెళ్తున్నారు.

donald trump stormy daniels
donald trump stormy daniels

పోర్న్ స్టార్ వివాదంలో చిక్కుకున్న అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​ పట్ల ఆయన అభిమానుల్లో సానుభూతి పెరుగుతోంది. ఈ వివాదంపై నేరాభియోగాలు ఎదుర్కొంటున్న ఆయనకు విరాళాల వెల్లువ మొదలైంది. 2024 అధ్యక్ష ఎన్నికలకు సిద్ధమవుతున్న ట్రంప్.. న్యాయస్థానంలో ఈ పరిణామం జరిగిన 24 గంటల్లోనే 4 మిలియన్ డాలర్ల (రూ.32.87కోట్లు)ను సమీకరించారు. ఇందులో 25 శాతానికి పైగా డొనేషన్లు తొలిసారి విరాళాలు ఇస్తున్న దాతల నుంచి వచ్చాయని ట్రంప్ ప్రచార కమిటీ వెల్లడించింది. దీన్ని బట్టి రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థిగా ఆయన స్థానం మరింత బలపడుతోందని పేర్కొంది.

"అమెరికాలోని 50 రాష్ట్రాల నుంచి ట్రంప్ ప్రచారానికి విరాళాలు వచ్చాయి. ట్రంప్ ప్రచారానికి వస్తున్న సగటు విరాళాలు 34 డాలర్లే. దీన్ని బట్టి ఎంత మంది సాధారణ ప్రజలు విరాళాలు ఇస్తున్నారో గుర్తించండి. ఎన్నికలను ప్రభావితం చేస్తూ, కోట్ల కొద్దీ విరాళాలు వెదజల్లే జార్జ్ సోరోస్ వంటి బిలియనీర్లతో కష్టపడి పనిచేసే దేశభక్తులు విసుగెత్తిపోయారు. న్యాయవ్యవస్థను ఆయుధంగా వాడుకోవడాన్ని అమెరికన్లు తిరస్కరిస్తున్నారని క్షేత్రస్థాయిలో వస్తున్న విరాళాలను బట్టి తెలుస్తోంది."
-ట్రంప్ ప్రచార బృందం ప్రకటన

కేసు ఏంటంటే..
2006లో పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్​తో ట్రంప్ అక్రమ సంబంధం పెట్టుకున్నారని, దాని గురించి బయటపెట్టకుండా ఉండేందుకు 2016 అధ్యక్ష ఎన్నికల సమయంలో ఆమెకు డబ్బులు ముట్టజెప్పారన్నది ప్రధాన అభియోగం. తన మాజీ న్యాయవాది మైఖేల్‌ కొహెన్‌ ద్వారా 1,30,000 డాలర్లను డేనియల్స్‌కు ట్రంప్ చెల్లించారు. డేనియల్స్​తో ఒప్పందంలో భాగంగానే డబ్బు చెల్లించినట్లు కొహెన్ చెబుతున్నారు. ఈ వాదనను ఖండిస్తూ, ఒప్పందాన్ని రద్దు చేయాలని డేనియల్స్ కోరుతున్నారు. ఈ నేపథ్యంలోనే పోర్న్​ స్టార్​తో అనైతిక ఒప్పందం కుదుర్చుకున్న కేసులో ట్రంప్​పై నేరాభియోగాల నమోదుకు మన్‌హటన్‌ గ్రాండ్‌ జ్యూరీ గురువారం అనుమతించింది.

donald trump stormy daniels
డొనాల్డ్ ట్రంప్

మరోవైపు, ఈ కేసు నేపథ్యంలో పోర్న్ స్టార్​పైనా కాసుల వర్షం కురుస్తోంది. ఆమె ఫొటోలు, సంతకంతో కూడిన మర్చెండైజ్​ను కొనేందుకు ఫ్యాన్స్ ఎగబడుతున్నారు. డేనియల్ బికినీ ధరించిన చిత్రంతో పాటు ఆమె సంతకం ఉన్న టీషర్టులకు తెగ ఆర్డర్లు పెడుతున్నారు. ఒక్కో టీషర్ట్​ను రూ.1600-1700 మధ్య విక్రయిస్తున్నారు డేనియల్స్. అచ్చం ట్రంప్​లా కనిపించేలా తయారు చేసిన పెంపుడు శునకాల ఆట బొమ్మలను రూ.2500కు విక్రయిస్తున్నారు. తనకు లభిస్తున్న మద్దతుకు ట్విట్టర్​లో హర్షం వ్యక్తం చేశారు డేనియల్స్. ఈ కేసు నేపథ్యంలో ట్రంప్ పెద్ద ఎత్తున నిధులు పోగేసుకుంటున్నారని, తానెందుకు ఆ పని చేయకూడదని ప్రశ్నించారు.

donald trump stormy daniels
స్టార్మీ డేనియల్స్

తర్వాత ఏం జరుగుతుంది?
ఈ కేసులో విచారణ ఎదుర్కోవడానికి కోర్టులో ట్రంప్‌ లొంగిపోవాలి. కోర్టు ఆదేశాల నేపథ్యంలో ట్రంప్‌ సోమవారం ఫ్లోరిడా నుంచి న్యూయార్క్‌కు రానున్నారు. మంగళవారం కోర్టులో లొంగిపోయే అవకాశముంది. 10 నుంచి 15 నిమిషాల్లో ట్రంప్​పై నమోదైన నేరాభియోగాలను చదివి వినిపిస్తారు. ఒకవేళ ట్రంప్‌ లొంగిపోయేందుకు అంగీకరిస్తే.. అరెస్టు చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తారు. ఆ తర్వాత విచారణ జరిపి అరెస్టు నివేదిక తయారు చేస్తారు. సాధారణంగా సామాన్య నిందితులను కోర్టులో ప్రవేశపెట్టడానికి సంకెళ్లు వేసి తీసుకొస్తారు. ట్రంప్‌ మాజీ అధ్యక్షుడైనందున ఆయనకు కొన్ని మినహాయింపులు కల్పించే అవకాశాలున్నాయి. అయితే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడానికి ఈ కేసు ట్రంప్​నకు అడ్డంకి కాబోదు. క్రిమినల్‌ కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్న వ్యక్తి ఎన్నికల్లో పోటీ చేయకూడదని ఆ దేశ రాజ్యాంగంలో ప్రస్తావించలేదు. క్రిమినల్ కేసుల్లో జైలు శిక్ష పడ్డా పోటీ పడేందుకు ఎలాంటి అభ్యంతరం ఉండదు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.