అవయవ మార్పిడి చేయించుకున్న రోగులకు ఇది శుభవార్త! ఇలాంటివారు ఎదుర్కొనే అత్యంత తీవ్ర సమస్యకు అమెరికాలోని కొలంబియా వర్సిటీ శాస్త్రవేత్తలు విరుగుడు కనుగొన్నారు. ఇందుకోసం ఒక 'సజీవ ఔషధాన్ని' అభివృద్ధి చేశారు. ఇందులోని సుశిక్షిత కణాలు ప్రాణాంతక ఇన్‌ఫెక్షన్ల నుంచి రోగులను రక్షిస్తాయని వెల్లడైంది. భవిష్యత్‌లో ఇవి క్యాన్సర్‌పై పోరుకూ అక్కరకొస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఆ రోగుల్లో ఏమిటీ ఇబ్బంది?
ఒక్క అమెరికాలోనే ఏటా 40వేల అవయవాలు, 20వేల ఎముక మజ్జ మార్పిళ్లు జరుగుతుంటాయి. అందులో 20 శాతం మందిలో ఇన్‌ఫెక్షన్లు తలెత్తుతుంటాయి. ఫలితంగా వారిలో అవయవ మార్పిడి ప్రయత్నాలు విఫలమవుతుంటాయి.
- ఈ ఇన్‌ఫెక్షన్లను కలిగించే వైరస్‌లు.. ఆరోగ్యవంతులకు పెద్దగా హాని కలిగించేవి కావు. చాలామంది గతంలోనే వీటిని ఎదుర్కొని ఉంటారు. ఆ వైరస్‌లు వారిలో నిద్రాణంగా ఉంటాయి.
- అవయవ మార్పిడి చేయించుకున్న రోగులు తమ రోగ నిరోధక వ్యవస్థను కట్టడి చేయడానికి ఇమ్యునోసప్రసెంట్లను వాడుతుంటారు. కొత్త అవయవంపై స్వీయ రోగనిరోధక వ్యవస్థ దాడి చేయకుండా చూడటం వీటి ఉద్దేశం. ఈ ఔషధాలను వాడేవారిలో.. నిద్రాణంగా ఉండే వైరస్‌లు క్రియాశీలమై, తీవ్ర ఇన్‌ఫెక్షన్లు కలిగిస్తుంటాయి.
- ఇలాంటి వైరస్‌లలో కొన్నింటిపై పోరాడటానికి యాంటీవైరల్ చికిత్సలు లేవు. అలాగని రోగులు ఇమ్యునోసప్రసెంట్ల వాడకాన్ని ఆపేస్తే.. మార్పిడి చేసిన అవయవం దెబ్బతింటుంది.
- పావెల్ మురాన్‌స్కీ నేతృత్వంలోని బృందం అభివృద్ధి చేసిన ‘సజీవ ఔషధం’ ఈ సమస్యకు పరిష్కారం చూపుతోంది.
ఇదీ ఔషధం..
నిర్దిష్ట వైరస్‌ను లక్ష్యంగా చేసుకునే టి కణాలను భారీ స్థాయిలో ఉత్పత్తి చేసే విధానాన్ని శాస్త్రవేత్తలు గతంలో అభివృద్ధి చేశారు. ఆ బృందంలో పావెల్ ఉన్నారు. రోగనిరోధక వ్యవస్థకు సంబంధించిన ఈ కణాలు.. నిర్దిష్ట వైరస్‌ను గుర్తించి, నిర్మూలించే విధానంపై శిక్షణ పొంది ఉంటాయి. శరీరంలో మిగతా భాగాల జోలికి పోవు.
- తొలుత.. ఆరోగ్యంగా ఉన్న దాత నుంచి టి కణాలను సేకరిస్తారు. అందులో వైరస్‌ను గుర్తించగలిగే కణాలను ఎంపిక చేసుకుంటారు. వాటి సంఖ్యను ల్యాబ్‌లో వృద్ధి చేస్తారు. ఈ కణాలు రోగికి సరిపోలేలా ఉండాలి. అందువల్ల వాటిని దగ్గరి బంధువుల నుంచే సేకరించాలి.
- ఇవి సురక్షితమని, ఇన్‌ఫెక్షన్‌ను తగ్గించాయని మునుపటి పరిశోధనల్లో తేలింది. అయితే నాడు ఈ కణాల సంఖ్యను పెంచడానికి నెలపైనే పట్టింది. వైరస్ ఇన్‌ఫెక్షన్‌పై పోరాడుతున్న వారికి ఇది సుదీర్ఘకాలమే.
వేగంగా ఉత్పత్తి
ఈ నేపథ్యంలో పావెల్ వినూత్న విధానంతో రెండు వారాల్లోనే టి కణాల సంఖ్యను వృద్ధి చేశారు. ఇందుకోసం కాఫీ కప్పు కన్నా చిన్నగా ఉండే బయోరియాక్టర్లను ఉపయోగించారు. మొదటి దశ క్లినికల్ ప్రయోగాల్లో వీటి సమర్థత రుజువైంది. రోగుల్లో ఎలాంటి దుష్ప్రభావాలు తలెత్తలేదు.
తదుపరి లక్ష్యం.. క్యాన్సర్
క్యాన్సర్‌పై పోరులోనూ టి కణాలను ఉపయోగించాలని పావెల్ బృందం లక్ష్యంగా పెట్టుకొంది. ఇప్పటికే కార్-టి కణాలపై ప్రయోగాలు జరుగుతున్నాయి. రోగి శరీరం నుంచి సేకరించిన కణాలకు జన్యుమార్పిడి చేయడం ద్వారా వీటిని రూపొందిస్తున్నారు. అవి ప్రధానంగా బ్లడ్ క్యాన్సర్లపైనే పనిచేస్తున్నాయి. ఇతర రకాలపై పెద్దగా ప్రభావం చూపలేదు. ఇవి క్యాన్సర్ కణాల ఉపరితలంపై ఉన్న రేణువులను మాత్రమే గుర్తించగలుగుతాయి. అయితే ఆ రుగ్మతతో ముడిపడిన అనేక యాంటిజన్లు ట్యూమర్ కణాల అంతర్భాగాల్లో ఉంటాయి. సహజసిద్ధ టి కణాలతో వీటిని గుర్తించి, నిర్మూలించొచ్చని పావెల్ చెబుతున్నారు. ఈ క్రమంలో ఆయన సీడీ4+ టి హెల్పర్ కణాలపై ప్రధానంగా దృష్టిసారించారు.