ETV Bharat / crime

కాల్వల్లో కన్నీటి వరద.. భద్రతలేక బలవుతున్న ప్రయాణికులు

author img

By

Published : Feb 17, 2021, 10:20 AM IST

ఎన్నో కలలు నీళ్లపాలవుతున్నాయి. మరెన్నో ఆశయాలు ప్రవాహంలో కలిసిపోతున్నాయి. కుటుంబ సభ్యులు పెట్టుకున్న ఆశల్ని కాల్వలు జల సమాధి చేస్తున్నాయి. చిన్నపాటి రక్షణ చర్యలు.. భద్రత ఏర్పాట్లు చేస్తే చాలు ఎన్నో నిండు ప్రాణాలను కాపాడవచ్చు. కానీ అధికారుల్లో నిర్లక్ష్యం నిండుగా పారుతున్నపుడు ఆ మాత్రం బాధ్యతను ఆశించడం దురాశే. వాహనం నడిపేవారు ఒక్కక్షణం ఏమారుపాటుగా ఉన్నా.. ఏకాగ్రత కోల్పోయినా.. నిండు ప్రాణాలు బలైపోతున్నాయి.

vehicles-are-rushing-into-bridges-at-irrigation-canals-in-telangana-due-to-lack-of-proper-safety-arrangements
కాల్వల్లో కన్నీటి వరద.. భద్రతలేక బలవుతున్న ప్రయాణికులు

తెలంగాణలో సాగునీటి కాల్వల వద్ద, వంతెనలపై సరైన భద్రత ఏర్పాట్లు లేక వాహనాలు వాటిలోకి దూసుకుపోతున్నాయి. తరచుగా జరుగుతున్న ఇలాంటి దుర్ఘటనలు ఆవేదనకు గురిచేస్తున్నాయి. ప్రమాదాలు జరిగినపుడు హడావుడి చేస్తున్న ప్రభుత్వ శాఖలు.. ఆ తరువాత పట్టించుకోకపోవడం మరో ప్రమాదానికి దారి తీస్తోంది. శ్రీరామసాగర్‌, నాగార్జునసాగర్‌, జూరాల, కోయిల్‌సాగర్‌, నెట్టెంపాడు, కల్వకుర్తి, ఏఎమ్మార్పీ తదితర ఎత్తిపోతల పథకాల్లోని జలాశయాల నుంచి పంట చేలకు నీటిని తరలించే కాల్వలపై వంతెనలకు చాలాచోట్ల కనీస రక్షణ ఏర్పాట్లు లేవు. దూరం నుంచి ప్రయాణిస్తూ వచ్చేవారు కాల్వ చెంతకు రాగానే ఇరుకైన కల్వర్టుల్ని లేదా వంతెనలను గుర్తించేలోపే రెప్పపాటులో కాల్వల్లో మునిగిపోతున్నారు. గత కొద్దిరోజుల్లోనే జగిత్యాల, వరంగల్‌ గ్రామీణ జిల్లాల్లో కార్లు కాల్వల్లో మునిగిన ఘటనల్లో ఆరుగురు మృత్యువాత పడ్డారు. ఇదే మాదిరిగా గత ఐదేళ్లలో పదుల సంఖ్యలో ప్రాణాలు నీళ్లలో కలిసిపోయాయి.

vehicles-are-rushing-into-bridges-at-irrigation-canals-in-telangana-due-to-lack-of-proper-safety-arrangements
కాల్వల్లో కన్నీటి వరద.. భద్రతలేక బలవుతున్న ప్రయాణికులు

నిజామాబాద్‌-జగిత్యాల జాతీయ రహదారిపై తాటిపల్లి వద్ద కాకతీయ కాల్వ వంతెన తీరు ఇది. రక్షణ గోడలు శిథిలమయ్యాయి. నామమాత్రంగా సిమెంటు ఇటుకలతో మరమ్మతులు చేసి చేతులు దులుపుకున్నారు. వెడల్పుగా ఉన్న ఈ రహదారి వంతెన వద్దకు రాగానే ఇరుకైపోయి ప్రమాదాలకు అడ్డాగా మారింది.

vehicles-are-rushing-into-bridges-at-irrigation-canals-in-telangana-due-to-lack-of-proper-safety-arrangements
కాల్వల్లో కన్నీటి వరద.. భద్రతలేక బలవుతున్న ప్రయాణికులు

కరీంనగర్‌ జిల్లా మేడిపల్లి నుంచి కోరుట్లకు వెళ్లే జాతీయ రహదారి-63లో శ్రీరామసాగర్‌ ప్రధాన కాల్వపై ఉన్న వంతెన ఇది. ఇరువైపులా రెయిలింగ్‌ లేదు. వాహనదారులను అప్రమత్తం చేసేలా దూరం నుంచి కనిపించే గుర్తులు కూడా లేవు. ఏమాత్రం ఆదమరపుగా ఉన్నా వాహనాలు కాల్వలోకి దూసుకెళ్లే ప్రమాదం ఉంది.

vehicles-are-rushing-into-bridges-at-irrigation-canals-in-telangana-due-to-lack-of-proper-safety-arrangements
కాల్వల్లో కన్నీటి వరద.. భద్రతలేక బలవుతున్న ప్రయాణికులు

వరంగల్‌ గ్రామీణ జిల్లా పర్వతగిరి మండలంలో ఉన్న ఎస్సారెస్పీ బ్రాంచి కాల్వ ఇది. ఈ వంతెన వద్దకు చేరేదాక హెచ్చరించే గుర్తులేవీ లేవు. స్థానిక పోలీసులు వంతెనకు ఒకవైపు మట్టి పోయించి కొన్ని చర్యలు చేపట్టారు. ఈ కాల్వలో ఇటీవల కారు మునిగి ముగ్గురు ప్రాణాలు విడిచారు.

మలుపులో మృత్యు పిలుపు

రాష్ట్రంలోని గ్రామాలు-మండలాలు- జిల్లా కేంద్రానికి మధ్య ఉన్న రహదారులు వద్ద కాల్వలపై వంతెనలు కొన్నిచోట్ల ప్రమాదకరంగా మారాయి. ప్రధానంగా మూల మలుపులు, మండల, రాష్ట్ర, జాతీయ రహదారుల్లో వంతెనల వద్ద రోడ్డు ఇరుకుగా మారడం కూడా దుర్ఘటనలకు తావిస్తోంది. తెల్లవారుజామున పొగమంచు ఉన్న సమయాల్లో వంతెన గోడలు కనిపించకపోవడంతో కార్లు అదుపు తప్పుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. రాత్రి సమయాల్లో ఎదురుగా వస్తున్న వాహనాల లైట్ల కాంతితో రోడ్డు కనిపించని సమయంలోనూ ప్రమాదాలు జరుగుతున్నాయని చెబుతున్నారు. ఇప్పుడు వస్తున్న వాహనాల్లో పవర్‌ స్టీరింగ్‌ ఉండటంతో వంతెనలు సమీపించగానే కంగారుగా స్టీరింగ్‌ను కంగారుగా తిప్పడం వల్ల కూడా ప్రమాదాలకు ఆస్కారం ఏర్పడుతోందని సూచిస్తున్నారు. వంతెనలకు ఇరువైపులా గట్టి రక్షణ ఉంటే తప్ప ప్రమాదాల నివారణ సాధ్యం కాదని ఇంజినీరింగ్‌ నిపుణులు సూచిస్తున్నారు.

రహదారుల్లో ప్రధాన లోపాలివి

జగిత్యాల జిల్లా మేడిపల్లి నుంచి కోరుట్ల వెళ్లే జాతీయ రహదారి-63లో ఎస్సారెస్పీ ప్రధాన కాల్వ వంతెన రక్షణ గోడలు శిథిలమైపోయాయి. వాహనం అదుపుతప్పితే సులువుగా నీటిలో పడిపోయేలా ఉన్నాయి. పూర్తిస్థాయిలో మరమ్మతు చేయాల్సిన అధికారులు రక్షణ గోడల వద్ద ఐదారు సిమెంటు ఇటుకలు పెట్టి మమ అనిపించారు. వంతెనకు ఒకవైపు రక్షణ నిర్మాణాలు నిర్మించనేలేదు.

  • వరంగల్‌ గ్రామీణ జిల్లాలో పర్వతగిరి, వర్ధన్నపేట, రాయపర్తితోపాటు వరంగల్‌-ఖమ్మం జాతీయ రహదారిలో మైలారం శివారుల గుండా ఎస్సారెస్పీ కాల్వ ప్రవహిస్తోంది. ఈ ప్రాంతాల్లోనూ కనీస రక్షణ చర్యలు లేవు.
  • జగిత్యాల-కరీంనగర్‌ మార్గంలో కొత్తపల్లి వద్ద ఎస్సారెస్పీ కాల్వలో టెంపో పడి పదేళ్ల క్రితం ఐదుగురు విద్యార్థులు ప్రాణాలు విడిచారు. ఈ మార్గంలో ఇప్పటికీ వంతెనల విస్తరణ చేపట్టలేదు.
  • నల్గొండ, సూర్యాపేట జిల్లాలో అనేక గ్రామాల పరిధిలో బోర్డులు ఏర్పాటు చేయాల్సి ఉంది.
  • జోగులాంబ గద్వాల నుంచి మల్దకల్‌ వెళ్లే మార్గంలో కాల్వపై వంతెన వద్ద ఎటువంటి రక్షణ లేదు.

భద్రతా చర్యలు నామమాత్రమే

  • రాష్ట్రంలో జాతీయ రహదారులు, రోడ్లు-భవనాల శాఖ, పంచాయతీరాజ్‌ శాఖల పరిధిలోని రహదారుల్లో ఉన్న కాల్వలపై వంతెనల వద్ద రక్షణ చర్యలు తీసికట్టుగా మారాయి. ముప్పాతికశాతం వంతెనలు శిథిలమైపోయి ఉన్నాయి. రక్షణ ప్రమాణాల్లో సగం కూడా అమలు చేయడం లేదు.
  • వంతెనలకు ఫర్లాంగు దూరం ముందే హెచ్చరిక బోర్డులు, వేగ నియంత్రికలు ఏర్పాటు చేయాలి. అవి రాత్రిపూటా కనిపించేలా ఉండాలి.
  • కాల్వకు ఇరువైపులా యాభై మీటర్ల వరకు ప్రత్యేకంగా రెయిలింగ్‌ ఏర్పాటు చేయాలి.
  • వంతెన గోడలు కనీసం నాలుగు అడుగుల ఎత్తుతో ఉండాలి.
  • అనుకోకుండా వంతెనపై రెయిలింగ్‌ను ఢీకొడితే వాహనాన్ని వెనక్కు నెట్టేలా ఆధునాతన విధానాలు ఏర్పాటు చేయాలి.

డ్రైవర్ల తప్పిదాలే కారణం

ఒకేచోట ఎక్కువ ప్రమాదాలు జరిగితే.. అధ్యయనం చేసి బ్లాక్‌ స్పాట్‌గా గుర్తిస్తాం. వెంటనే రక్షణ చర్యలు చేపడతాం. రోడ్లు నిర్మించిన శాఖే వంతెనల నిర్వహణ చేపట్టాలి. 97 శాతం ప్రమాదాలు డ్రైవర్ల తప్పిదాలతోనే జరుగుతున్నాయని సర్వే నివేదికలు చెబుతున్నాయి. శాఖాపరంగా ఎక్కడైనా మరమ్మతులు, రక్షణ చర్యలు తీసుకోవాల్సి ఉంటే వాటిని గుర్తిస్తాం.

- గణపతిరెడ్డి, ఈఎన్‌సీ, జాతీయ రహదారుల సంస్థ

ఉన్నతాధికారుల దృష్టికి

కాల్వలపై వంతెనలు కట్టాల్సి వస్తే వాటిని పూర్తి చేసి ఆ రోడ్డును పర్యవేక్షించే శాఖకు అప్పగిస్తాం. రోడ్డు నిర్వహణతోపాటు వంతెనల వద్ద రక్షణ చర్యలు కూడా ఆ శాఖే చేపట్టాల్సి ఉంది. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్తాం.

- సురేందర్‌, నీటి పారుదలశాఖ ముఖ్య ఇంజినీరు, జగిత్యాల

ఇదీ చదవండి: యురేనియం తవ్వకాలపై ప్రజాభిప్రాయ సేకరణకు హైకోర్ట్ పచ్చజెండా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.