సజీవదహనం కేసులో ట్విస్ట్.. చనిపోయింది ధర్మ కాదు..

author img

By

Published : Jan 17, 2023, 12:24 PM IST

Updated : Jan 17, 2023, 2:19 PM IST

murder twist

Twist In Secretariat Employee Death: తెలంగాణ రాష్ట్రం మెదక్ జిల్లాలో సచివాలయ ఉద్యోగి సజీవదహనం కేసులో అనూహ్య మలుపు చోటు చేసుకుంది. ఈ నెల 9న చనిపోయింది ధర్మ అని అందరూ అనుకున్నారు. కానీ చనిపోయింది కారు డ్రైవర్‌ అని పోలీసులు తెలిపారు. ఇదంతా బీమా డబ్బుల కోసం ధర్మ ఆడిన నాటకం అని చెప్పారు.

Twist In Secretariat Employee Death: ఔరా.. ప్రజలు ఎంతకు తెగిస్తున్నారు. ఒకప్పుడు బీమా కట్టుకోండి.. 'చనిపోతే మీ ప్రాణాలు తిరిగిరాకపోవచ్చు కానీ మీరు చనిపోయిన తర్వాత.. వచ్చిన డబ్బుతో మీ కుటుంబానికి ఒక దారి చూపిన వాళ్లు అవుతారు అనేవారు.' కానీ మనం చనిపోయిన తరువాత వచ్చిన డబ్బులతో మనకేం పని అనుకునేవాళ్లే ఎక్కువ. ప్రస్తుత రోజుల్లో మాత్రం అలా కాదు మన బీమా చేయించుకోనవసరం లేదు మన పేరు మీద వేరేవాళ్లు చేయిస్తారు. డబ్బులు కూడా అవసరం లేదు వారే కట్టుకుంటున్నారు. మనం చేయాల్సింది ఒక్కటే వారి చేతిలో మనం చనిపోవడమే.. ఇదేంటి అనుకుంటున్నారా.. ఈ మధ్య కాలంలో జరిగిన వరుస ఘటనలే ఇందుకు తార్కాణం. మొన్న అనాథకు బీమా చేయించి హత్యచేసి ప్రమాదంగా చిత్రీకరించిన క్రైం స్టోరీ మరవక ముందే తాజాగా బీమా సొమ్ము కోసం ఒకరిని చంపేసి కారులో ఉంచి పెట్రోల్‌ పోసి సజీవ దహనం చేసి తానే మృతి చెందినట్లు చిత్రీకరించాడు తెలంగాణ సెక్రటేరియట్‌ ఉద్యోగి.

ధర్మ ఆడిన నాటకం: మెదక్ జిల్లాలో సచివాలయ ఉద్యోగి సజీవదహనం కేసులో అనూహ్య మలుపు చోటు చేసుకుంది. ఈనెల 9న టేక్మాల్ మండలం వెంకటాపురం వద్ద కారులో వ్యక్తి సజీవదహనమైన ఘటనలో మృతుడు సెక్రటేరియట్ ఉద్యోగి ధర్మ అని మొదట్లో అందరూ భావించినా చనిపోయింది ధర్మ కాదు.. కారు డ్రైవర్‌ అని ఇవాళ పోలీసులు తేల్చారు. ఇదంతా బీమా డబ్బుల కోసం ధర్మ ఆడిన నాటకం అని చెప్పారు. ఆయన హైదరాబాద్‌ సెక్రటేరియేట్‌లో సీనియర్‌ అసిస్టెంట్‌గా పని చేస్తున్నాడు. ధర్మ భార్య నీల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

బెట్టింగ్‌లకు పాల్పడి అప్పులు చేసిన ధర్మ: ఘటనా స్థలంలో పెట్రోల్‌ డబ్బా దొరకడంతో పోలీసులు ఈ కేసులో కొత్త కోణాన్ని పరిశీలించారు. దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు.. ధర్మా సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ ఆధారంగా తను ఇంకా బతికే ఉన్నాడని భావించి దర్యాప్తు కొనసాగించారు. తర్వాత ధర్మ బతికే ఉన్నాడని అనుమానించి, గోవాలో ఉన్నట్లు గుర్తించారు. నిందితుడిని హైదరాబాద్‌కు తీసుకొచ్చి, విచారించగా విస్తుపోయే విషయం వెలుగులోకి వచ్చింది.

ప్రమాదంలో చనిపోయింది ధర్మ కారు డ్రైవర్‌గా పోలీసులు గుర్తించారు. ధర్మా బెట్టింగ్‌లు ఆడి అప్పుల పాలవడంతో.. బీమా డబ్బులొస్తే అప్పులు తీర్చొచ్చని భావించినట్లు దర్యాప్తులో తేలింది. బీమా సొమ్ము కోసమే ధర్మ సజీవదహనం నాటకం ఆడినట్లు తేలింది. డ్రైవర్‌ను చంపి, కారులో ఉంచి పెట్రోల్‌ పోసి నిప్పు పెట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుడు ధర్మాను ఇవాళ కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది.

ఇన్సూరెన్స్ పాలసీ కోసం అనాథను చంపి ప్రమాదంగా చిత్రీకరించి: రెండేళ్ల క్రితం అనుమానాస్పద రీతిలో మృతి చెందిన ఓ వ్యక్తి కేసులో ఇన్సూరెన్స్​ పాలసీ సంస్థ అనుమానం.. నలుగురు నిందితులను పట్టించింది. కేసు నమోదు చేసిన పోలీసులు తీగ లాగితే డొంకంతా కదిలింది. ఇన్సూరెన్స్ పాలసీ కోసం తన వద్ద పని చేసే వ్యక్తిని దారుణంగా హత్య చేసిన ప్రధాన నిందితుడు సహా సహకరించిన మరో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. ఊహించని విషయం ఏమిటంటే హత్యకు స్కెచ్ వేసింది ఓ హెడ్ కానిస్టేబుల్. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..?

2021 డిసెంబర్​లో షాద్​నగర్ నియోజకవర్గం ఫరూక్​నగర్ మండలం మొగిలిగిద్ద గ్రామ శివారులో రోడ్డు ప్రమాదంలో భిక్షపతి అనే వ్యక్తి మృతి చెందాడు. అప్పుడు అనుమానాస్పద వాహనం ఢీకొని మృతి చెందినట్లు కేసు నమోదు చేశారు. భిక్షపతి పేరుపై హైదరాబాద్​లో ఉన్న ఇల్లు దానిపై ఉన్న ఇన్సూరెన్స్ క్లైమ్ చేసేందుకు నామినిగా ఉన్న శ్రీకాంత్ కంపెనీకి వెళ్లాడు.

క్లైమ్​ దర్యాప్తులో ఇన్సూరెన్స్ కంపెనీ వారికి అనుమానం రావడంతో షాద్​నగర్ పోలీసులను ఆశ్రయించారు. దీంతో అనుమానంతో బోడ శ్రీకాంత్​ను విచారించారు. విచారణలో గతంలో అతనిపై కేసులు ఉన్నట్లు గుర్తించారు. అతనే హత్య చేయించినట్లు గుర్తించారు. ఆయనతో పాటు మరో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేయగా.. వీరిలో ఎస్ఓటీ విభాగంలో హెడ్ కానిస్టేబుల్​గా పని చేస్తున్న మోతిలాల్ కూడా ఉన్నాడు. కేసు దర్యాప్తులో పోలీసులకు విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.

ఇవీ చదవండి

Last Updated :Jan 17, 2023, 2:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.