ETV Bharat / crime

నిన్న గోదావరిలో గల్లంతైన ముగ్గురి మృతదేహాలు లభ్యం

author img

By

Published : Aug 2, 2021, 11:26 AM IST

స్నేహితుల దినోత్సవం రోజునే గోదావరి గల్లంతైన ముగ్గురు యువకుల మృతదేహాలు లభ్యమయ్యాయి. చేతికి అందివచ్చిన కుమారులు గోదావరి నదిలో పడి చనిపోవడం చూసిన తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ముగ్గురు యువకులు ఒకేసారి మృతి చెందడంతో గ్రామంలో విషాధ ఛాయలు అలముకున్నాయి.

three-bodies
three-bodies

స్నేహితుల దినోత్సవం నాడు సరదాగా గడిపేందుకు వెళ్లిన యువకులు కానరాని లోకాలకు వెళ్లిపోయారు. తెలంగాణ నిజామాబాద్ జిల్లా అర్సపల్లిలకి చెందిన ఆరుగురు మిత్రులు.. ఉదయ్, రాహుల్, శివ, సాయికృష్ణ, రోహిత్, రాజేందర్ స్నేహితుల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలనుకున్నారు. అందులో భాగంగానే నందిపేట మండలం జీజీ నడుకుడ సమీపంలోని ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్ వద్దకు వెళ్లారు. అందరూ కలిసి సరదాగా ఈత కొట్టాలనుకున్నారు. అనుకున్నదే తడువుగా నీళ్లలోకి దిగారు. కాసేపు ఫొటోలు దిగారు. అనంతరం ఈత కొట్టబోయే ప్రయత్నం చేశారు.

ఒక్కరిని కాపాడేందుకు దిగి.. అందరూ గల్లంతు

ఈ క్రమంలోనే మొదట శివ అనే యువకుడు నీళ్లలోకి దిగగా.. లోతు తెలియక నీట మునిగాడు. అతడిని కాపాడేందుకు మిగతా మిత్రులూ నీటిలోకి దిగారు. లోతు తెలియక ఆరుగురు స్నేహితులూ గల్లంతయ్యారు. గమనించిన స్థానికులు వారిని కాపాడే ప్రయత్నం చేశారు. ఈ సమాచారం తెలుసుకున్న నందిపేట్‌ పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. హుటాహుటిన గజ ఈతగాళ్లను రప్పించి యువకులను రక్షించేందుకు యత్నించారు. ఎట్టకేలకు సాయికృష్ణ, రోహిత్, రాజేందర్​లను ప్రాణాలతో కాపాడారు. మిగిలిన ముగ్గురు యువకులు.. ఉదయ్, రాహుల్, శివ గల్లంతయ్యారు. అర్ధరాత్రి వరకు గజ ఈతగాళ్లు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. చీకటి కావడంతో అధికారులు గాలింపు చర్యలను ఆపేశారు.

ఈరోజు ఉదయం మళ్లీ గాలింపు..

ఈ రోజు ఉదయం మళ్లీ రంగంలోకి దిగిన గజ ఈతగాళ్లు.. గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. గంటలపాటు శ్రమించగా.. నిన్న గల్లంతైన ముగ్గురి మృతదేహాలు లభించాయి. చేతికి అందివచ్చిన కుమారులు అచేతనంగా పడి ఉండటం చూసిన తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. ముగ్గురు యువకులు ఒకేసారి మృతి చెందడం.. అదీ స్నేహితుల దినోత్సవం నాడే కావడంతో గ్రామంలో విషాధ ఛాయలు అలముకున్నాయి.

ప్రాజెక్టులో నీరు లేని సమయంలో స్థానిక రైతులు తమ పొలాలకు మట్టి కోసం ఇక్కడ తవ్వకాలు చేపడతారు. ఆ గుంతల్లో నీరు చేరడంతో ప్రమాదానికి దారితీసిందని స్థానికులు చెబుతున్నారు.

ఇదీ చూడండి: ఏపీఎస్‌డీసీ నిబంధనలు కొన్ని రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయి: కేంద్రం

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.