ETV Bharat / crime

Telangana HC on gutka: గుట్కా, పాన్‌ మసాలాపై నిషేధాన్ని సమర్థించిన తెలంగాణ హైకోర్టు

author img

By

Published : Nov 30, 2021, 2:48 PM IST

గుట్కా, పాన్‌ మసాలాపై నిషేధాన్ని తెలంగాణ హైకోర్టు సమర్ధించింది. గుట్కా నిషేధాన్ని సవాలు చేస్తూ దాఖలైన 160 పిటిషన్లు కొట్టివేసింది.

telangana high court
telangana high court

Telangana High Court on gutka: కరోనా కంటే గుట్కా వల్లే ఎక్కువమంది మరణిస్తున్నారని తెలంగాణ హైకోర్టు వ్యాఖ్యానించింది. గుట్కా, పాన్‌ మసాలాపై నిషేధాన్ని న్యాయస్థానం సమర్థించింది. గుట్కా నిషేధాన్ని సవాలు చేస్తూ దాఖలైన 160 పిటిషన్లు కొట్టివేసింది.

ఏటా రూ.350 కోట్లు..

ఏటా రూ.350 కోట్లు.. ఈ అంకెలు చాలు రాజధానిలో గుట్కా వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా ఎలా సాగుతుందో చెప్పేందుకు. చూడటానికి చాలా చిన్న వ్యాపారంగానే కనిపిస్తున్నా తెరవెనుక పెద్ద మాఫియా, కర్ణాటక గుట్కా డాన్‌లున్నారు. ఆరోగ్యానికి హానికరమంటూ ప్రభుత్వం నిషేధించిన గుట్కా రాజధాని నగరంలోని గల్లీగల్లీలో దొరుకుతోంది. దిల్లీ, యూపీ.. కర్ణాటక రాష్ట్రాల నుంచి గుట్కా సంచులు లారీల్లో వస్తుండగా.. ఇక్కడి నుంచి టన్నుల్లో ఏపీ, మహారాష్ట్ర, రాజస్థాన్‌లకు వెళ్తున్నాయి. హైదరాబాద్‌, రాచకొండ, సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్లలో తొంభైశాతం పాన్‌డబ్బాలు... రిటైల్‌ దుకాణాల్లో గుట్కా అమ్ముతున్నారని పోలీసులకు తెలుసు. ఎవరైనా ఫిర్యాదుచేస్తే కేసులు పెడుతున్నారు. లేదంటే గుర్తుకొచ్చిప్పుడు ప్రత్యేకడ్రైవ్‌లు నిర్వహించి తనిఖీలు, దాడులు నిర్వహిస్తున్నారు. కొందరు పోలీస్‌ అధికారులకు ఈ మాఫియాతో సంబంధాలుండడంతోనే విక్రయాలు కొనసాగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. బేగంబజార్‌, కాటేదాన్‌, సనత్‌నగర్‌ పారిశ్రామికవాడలు.. గుట్కా తయారీ, నిల్వల కేంద్రాలుగా మారాయి. యువకులు.. మైనర్లు గుట్కాకు మహారాజ పోషకులుగా మారారు.

అమ్మితే వంద శాతం లాభం..

ఈ ప్యాకెట్లు అమ్మితే వందశాతం లాభం వస్తుండడంతో సిగరెట్ల కంటే వీటి విక్రయాలపైనే పాన్‌డబ్బాలు, రిటైల్‌, చిల్లరవ్యాపారులు ఎక్కువ ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. రోజుకు వంద ప్యాకెట్లు విక్రయిస్తే రూ.500లు ఆదాయం వస్తుంది. డిమాండ్‌ ఉన్నప్పుడు ఒక్కో ప్యాకెట్‌ను రూ.15లకు కూడా అమ్ముతున్నారు.

తయారీ ఇక్కడే...

గుట్కా తయారీ హైదరాబాద్‌ శివార్లలో గుట్టు చప్పుడు కాకుండా కొనసాగుతోంది. రోజుకు రూ.20లక్షల నుంచి రూ.50లక్షల విలువైన సరకు తయారవుతోంది... పాతబస్తీ, కాటేదాన్‌ పారిశ్రామిక వాడలోని పాతగోదాములు, కర్మాగారాల్లో యంత్రాల సాయంతో తయారు చేస్తున్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన కూలీలను తీసుకువస్తున్నారు. ముడిసరకు తీసుకువచ్చి వేర్వేరు బ్రాండ్ల పేర్లతో గుట్కాను తయారు చేసి హోల్‌సేల్‌గా విక్రయిస్తున్నారు.

మహారాష్ట్ర, ఏపీలో అమ్మకం..

ఇక్కడ తయారైన తర్వాత మహారాష్ట్ర, రాజస్థాన్‌ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు ఎగుమతి అవుతోంది. మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌, పుణె, నాందేడ్‌, కర్ణాటకలోని బెంగళూరు, బీదర్‌, కలబురిగి, రాజస్థాన్‌లోని జైపూర్‌, యూపీలోని ఆగ్రా, దిల్లీల్లోని అంతరాష్ట్ర గుట్కా వ్యాపారులతో హైదరాబాద్‌ గుట్కా వ్యాపారులకు సంబంధాలున్నాయి. సరిహద్దులు, చెక్‌పోస్టుల్లో పట్టుబడకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మూడేళ్ల క్రితం టాస్క్‌ఫోర్స్‌, ఎస్‌ఓటీ, నల్గొండ జిల్లా పోలీసులు వేర్వేరుగా దాడులు చేస్తే.. మూడు నెలల్లో రూ.8 కోట్ల గుట్కా.. రూ.2 కోట్ల ముడిసరకు స్వాధీనం చేసుకున్నారు.

నిల్వలు బయటపడ్ఢా

పాతబస్తీ, సైదాబాద్‌, మలక్‌పేట పోలీస్‌ ఠాణాల పరిధుల్లో అమ్మకాలు జోరుగా కొనసాగుతున్నాయి. సైదాబాద్‌ ఠాణా పరిధి సింగరేణి కాలనీలో పెద్దఎత్తున గుట్కా నిల్వలు బయటపడ్డాయి. కొందరు అధికార పార్టీకి చెందిన నేతలు ఈ వ్యవహారంలో పాత్రధారులుగా ఉన్నారని పోలీసులకు తెలుసు... నియంత్రణ చర్యలు తీసుకోవడంలో మీనమేషాలు లెక్కపెడుతున్నారు. నందనవనం, బంజరాబస్తీ, గుంటిజంగయ్యనగర్‌తో పాటు మురికివాడల్లో పోలీసుల దాడుల విషయం గురించి ముందస్తుగానే వారికి సమాచారం అందుతోంది.

అక్కడ నిషేధం లేక..

పాన్‌మసాలాలపై నిషేధం లేకపోవడంతో కొంతమంది వ్యాపారులు, తంబాకు ప్యాకెట్లను తయారు చేయించి, పాన్‌ మసాలాలతో కలిపి విక్రయిస్తున్నారు. పక్కన ఉన్న కర్ణాటక, మహారాష్ట్రలో గుట్కాపై నిషేధం లేకపోవడంతో కొంతమంది వ్యాపారులు అక్కడి నుంచి పెద్ద ఎత్తున తీసుకువచ్చి ఇక్కడ విక్రయిస్తున్నారు.

రాజస్థాన్‌ నుంచి వచ్చి..

రాజస్థాన్‌ రాష్ట్రం పాలి జిల్లాకు చెందిన దినేశ్‌కుమార్‌ జగద్గిరిగుట్టలో స్థిరపడ్డాడు. కొన్నేళ్ల నుంచి కర్ణాటక నుంచి గుట్కాను క్వింటాళ్లలో తెప్పిస్తున్నారు. వీటిని విక్రయించేందుకు రాజస్థాన్‌లో ఉంటున్న తన బంధువులు సురేష్‌, సీతారాంలను పిలిపించాడు. జగద్గిరిగుట్ట నుంచి బోయిన్‌పల్లి, తిరుమలగిరి, చిలకలగూడ, మల్కాజిగిరి, లాలాగూడ ఠాణాల పరిధిల్లోని వివిధ ప్రాంతాల్లోని దుకాణాలలో విక్రయిస్తున్నాడు. బోయిన్‌పల్లిలో గుట్కాసంచులు నిల్వ ఉంచేందుకు కర్ణాటక రాష్ట్రం యాద్‌గిర్‌ నాగలాపూర్‌కు చెందిన కత్తి మల్లికార్జున్‌ను ఎంచుకున్నాడు. కొద్దిరోజుల క్రితం పోలీసులు సురేష్‌, సీతారాం, మల్లికార్జున్‌లను అరెస్ట్‌చేశారు. దినేష్‌కుమార్‌ పారిపోయాడు.

మీకు తెలుసా..

  • నిషేధానికి ముందు ఒక్కో గుట్కా ప్యాకెట్‌ ధర: రూ.1-2, ప్రస్తుతం: రూ.6-10
  • నిత్యం నగరంలో అమ్ముడవుతున్న ప్యాకెట్లు: 50 లక్షలు
  • ఏటా జరుగుతున్న వ్యాపారం విలువ: సుమారు రూ.350 కోట్లు
.

ఇదీ చూడండి:

గుట్కా నిషేధం బాధ్యత ఇకపై వారిదే.. సర్కారు నిర్ణయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.