ETV Bharat / crime

సంకల్ప సిద్ధి కుంభకోణంలో విస్తుపోయే కోణాలు.. కేవలం రిఫరల్​ పాయింట్లతోనే

author img

By

Published : Dec 6, 2022, 8:13 AM IST

SANKALP SIDDHI UPDATE: పాయింట్లు ఆశ చూపారు.. గిఫ్ట్‌లు ఎరవేశారు.. అత్యాశతో ప్రభుత్వ ఉద్యోగులు సైతం సభ్యులుగా చేరారు. కమిషన్ల కోసం బంధువులను చేర్పించారు. సంకల్ప సిద్ధి స్కాంలో.. ఆర్టీసీ, విద్యుత్‌ ఉద్యోగులతోపాటు.. చాలా మంది పోలీసులు మోసపోయారు.

SANKALP SIDDHI CASE UPDATES
SANKALP SIDDHI CASE UPDATES

SANKALP SIDDHI CASE UPDATES : పోలీసులు కస్టడీలో ఉన్న సంకల్ప సిద్ధి నిందితుల విచారణలో.. అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. డిపాజిటర్లకు సకాలంలో డబ్బులు చెల్లించకుండా.. కేవలం రిఫరల్‌ పాయింట్లనే చూపిస్తూ సంకల్ప సిద్ధి నిర్వాహకులు.. టోకరా వేశారు. వీటి కోసం ప్రత్యేకంగా వ్యాలెట్‌ను రూపొందించారు. అందులో జమ అయ్యే ఈ పాయింట్లను ఇతరులకు బదిలీ చేసే వెసులుబాటు కల్పించారు. ఎక్కువ మందిని చేర్చిన వారికి మొబైల్, ట్యాబ్‌లు ఇస్తామని ఆశ చూపారు. చాలా మంది పోటీపడి మరీ తెలిసిన వారిని చేర్పించారు. వెబ్‌సైట్‌ను పరిశీలిస్తున్న పోలీసులు మొత్తం 17 బ్యాంకు ఖాతాలను ఇప్పటికే గుర్తించారు. వీటి ద్వారా.. అధికశాతం లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు.

రిఫరల్‌ పాయింట్లతో బోగస్‌ సభ్యుల్ని కుప్పలుతెప్పలుగా నిర్వాహకులు చేర్పించారు. ఎక్కువ మంది ప్రభుత్వ ఉద్యోగులే చేరారని విచారణలో తేలింది. వీరు తిరిగి తమకు తెలిసిన వారిని, బంధువులను కూడా కమీషన్‌ కోసం చేర్పించారు. గన్నవరం డిపో పరిధిలో చాలా మంది ఆర్టీసీ ఉద్యోగులు సంకల్ప సిద్ధిలోని వివిధ పథకాల్లో డిపాజిట్‌ చేయడంతో పాటు..మరికొందరిని చేర్పించారు. పోలీసుల్లోనూ పలువురు బాధితులు ఉన్నారని తెలిసింది.

విద్యుత్తు శాఖ ప్రధాన కార్యాలయమైన విద్యుత్తు సౌధలోనూ పెద్దసంఖ్యలో ఉద్యోగులు సభ్యులుగా చేరారు. ఇలా విజయవాడ పరిసర ప్రాంతాల్లోనే ఎక్కువ మంది ప్రభుత్వ ఉద్యోగులు ఇందులో పెట్టుబడులు పెట్టి మోసపోయారు. అందరి వివరాలను నిశితంగా పరిశీలిస్తున్న పోలీసులు.. అసలు డిపాజిటర్ల సంఖ్య 30 నుంచి 35 వేల వరకు ఉంటారని ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. సైబర్, బ్యాంకింగ్‌ నిపుణులతో వెబ్‌సైట్‌లోని వివరాలను సరిపోల్చుతున్నారు.

వసూలు చేసిన వందల కోట్ల డిపాజిట్లను ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టారన్న అంశంపై పోలీసులు దృష్టి సారించారు. ఇప్పటి వరకు గుర్తించిన ప్రకాశం జిల్లా కనిగిరి, నిడమానూరు, తదితర చోట్ల నిర్వాహకుల పేరున స్థిరాస్తులను సీజ్‌ చేసి, అటాచ్‌ చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. మరికొన్ని చోట్ల కూడా భూములు కొనుగోలు చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. వీటి వివరాల కోసం పోలీసులు రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీకి లేఖ రాయనున్నారు.

ఇప్పటివరకు ఈ కేసులో ఆరుగురిని ఆరెస్టు చేశారు. పోలీసు కస్టడీలో ఉన్న నిందితుల విచారణ ముమ్మరంగా సాగుతోంది. సంస్థ సీఎండీ వేణుగోపాల కృష్ణ.. పోలీసుల విచారణలో పెద్దగా నోరు విప్పడం లేదని చెబుతున్నారు. తనకేమీ తెలియదని, కిరణ్‌కు అన్ని విషయాలూ తెలుసని చెబుతున్నట్లు సమాచారం.

సంకల్ప సిద్ధి కుంభకోణంలో విస్తుపోయే విషయాలు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.