ETV Bharat / city

తల్లీ కుమారుల హత్య కేసులో నిందితులను ఆ వీడియో కాల్​ పట్టించింది..

author img

By

Published : Sep 14, 2022, 10:47 AM IST

Visakha Double murder case
విశాఖ తల్లీకుమారుల హత్య కేసు

Visakha Double murder case updates: లేనిపోని గొప్పలకు పోవడం ఇద్దరి హత్యకు దారితీసింది. విశాఖ తల్లీకుమారుల హత్య కేసును పోలీసులు ఛేదించారు. అసలేం జరిగిందంటే..?

Visakha Double murder case updates: విశాఖలో ఇటీవల జరిగిన తల్లీకుమారుల హత్య కేసులో నిందితులను ఎట్టకేలకు పోలీసులు పట్టుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలను మంగళవారం నగర పోలీసు కమిషనర్‌ సీహెచ్‌.శ్రీకాంత్‌ విలేకరులకు వెల్లడించారు.

* ఈనెల 8వ తేదీన విశాఖ నగరం దువ్వాడ పోలీసు స్టేషన్‌ పరిధిలోని మదీనాబాగ్‌లో ఎం.గౌరమ్మ (52), ఆమె కుమారుడు పోలారెడ్డిలు హత్యకు గురయ్యారు. ఈ జంట హత్యలు నగరంలో సంచలనం సృష్టించాయి. పోలీసులు దర్యాప్తులో భాగంగా మొదట గౌరమ్మ చిన్నకోడలిపై అనుమానం వ్యక్తంచేసినా ఆమె నిందితురాలు కాదని తెలిసింది. తల్లి మరణవార్త విని గౌరమ్మ కుమార్తె మస్కట్‌ నుంచి రాగా.. ఆమె చెప్పిన ఓ క్లూ నిందితులను పట్టుకునేలా చేసింది. దీని ఆధారంగా చిన్నఅక్కిరెడ్డిపాలెంకు చెందిన ఎస్‌.చైతన్య(32), గుంటూరుకు చెందిన ఎం.కిశోర్‌బాబు(32)లను నిందితులుగా పోలీసులు గుర్తించారు.

* చైతన్య ఏడాది క్రితం ఓ రెస్టారెంట్‌ను పెట్టి సుమారు రూ.16లక్షల వరకు నష్టపోయాడు. ఇంట్లో గొడవలతో రెండు నెలల క్రితం మదీనాబాగ్‌కు మారాడు. అక్కడ గుంటూరుకు చెందిన కిశోర్‌బాబుతో పరిచయం ఏర్పడింది. వీరికి మద్యం దుకాణం వద్ద ఆహార పదార్థాలను విక్రయించే గౌరమ్మ, ఆమె కుమారుడు పోలారెడ్డిలతో పరిచయం పెరిగింది. మద్యం తాగడానికి వచ్చినపుడు తల్లీకొడుకులతో మాట్లాడుతుండేవారు. ఈ నేపథ్యంలో గౌరమ్మ తన వద్ద రూ.30 లక్షల నగదు, బంగారం ఉందని వీరితో గొప్పలు చెప్పింది. ఇంటిని కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నానంది.

* ఈ మాటలు నిజమనుకున్న చైతన్య రూ. 6 లక్షలు అప్పు అడిగాడు. ఆమె నిరాకరించింది. తనకు ఓ స్థలం ఉందని దాన్ని కొనుగోలు చేయాలని కోరాడు. దీనికీ ఆమె ఒప్పుకోలేదు. దీంతో ఆమె వద్ద ఉన్న డబ్బును ఎలాగైనా దొంగిలించాలన్న ఉద్దేశంతో కిశోర్‌బాబుతో కలిసి ప్రణాళిక రచించాడు. ముందు మత్తుమందు ఇచ్చి దొంగతనం చేయాలనుకున్నా అది కుదరలేదు. దీంతో మరో పథకం వేశాడు. ఈనెల 7వ తేదీ రాత్రి పోలారెడ్డితో కలిసి చైతన్య, కిశోర్‌బాబు మద్యం దుకాణం వద్ద మద్యం తాగారు. మిగిలిన మద్యం పోలారెడ్డి ఇంటికి వెళ్లి తాగుదామని రెండు బుల్లెట్‌ వాహనాల్లో అతన్ని వెంటబెట్టుకొని వచ్చారు. ముగ్గురు పోలారెడ్డి ఇంట్లో మద్యం తాగిన తర్వాత చైతన్య, కిశోర్‌లు కలిసి పోలారెడ్డిని హత్యచేశారు. ఆ సమయంలో కొడుకుకు భోజనం ఇద్దామని వచ్చిన గౌరమ్మను కూడా చంపేశారు. గౌరమ్మ ఇంట్లోకి వెళ్లిన వీరిద్దరూ బీరువాను తెరిచి చూడగా, కేవలం రూ.2వేలు మాత్రమే దొరికాయి. బంగారం అనుకుని రోల్డ్‌గోల్డ్‌ ఆభరణాలను పట్టుకుని చెన్నై పారిపోయారు.

ఇలా దొరికారు: ఈ హత్యలు జరిగే ముందు.. మస్కట్‌లో ఉన్న గౌరమ్మ కుమార్తె తన సోదరుడు పోలారెడ్డికి వీడియోకాల్‌ చేసింది. ఆ సమయంలో ఫోన్‌ కట్‌ కావడంతో పోలారెడ్డి పక్కనే ఉన్న చైతన్య ఫోన్‌ నుంచి సోదరికి వీడియోకాల్‌ చేశాడు. ఆ సమయంలో వారిని కూడా సోదరికి పరిచయం చేశాడు. ఆ తర్వాత చైతన్య, కిశోర్‌లు తల్లీకొడుకులను హత్య చేశారు. వీడియోకాల్‌ సమయంలో ఇద్దరు కొత్త వ్యక్తులను చూసినట్లు ఈ ఘటన తరువాత ఆమె పోలీసులకు చెప్పింది. ఆరోజు రాత్రి రెండు బుల్లెట్లు వచ్చాయని అంతకుముందే గౌరమ్మ చిన్నకోడలు చెప్పడం.. కుమార్తె చెప్పిన కొత్త వ్యక్తుల సమాచారంతో నిందితులు వీరేనని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. నిందితులు చెన్నై నుంచి తిరిగి వస్తుండగా.. పట్టుకున్నారు. రోల్డ్‌గోల్డ్‌ ఆభరణాలు, బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.