నత్తనడకన టిడ్కో ఇళ్ల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ

author img

By

Published : May 30, 2022, 4:21 AM IST

నత్తనడకన టిడ్కో ఇళ్ల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ

టిడ్కో ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా పురపాలక సంఘాల్లోని పేదలకు నిర్మించి ఇస్తున్న జీ+3 ఇళ్ల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. జులై నాటికి 1.50 లక్షల గృహాలను లబ్ధిదారులకు అందించాలనే లక్ష్యానికి అనుగుణంగా రిజిస్ట్రేషన్‌ సాగడం లేదు.

రాష్ట్రవ్యాప్తంగా పట్టణ మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (టిడ్కో) ఆధ్వర్యంలో పురపాలక సంఘాల్లోని పేదలకు నిర్మించి ఇస్తున్న జీ+3 ఇళ్ల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. జులై నాటికి 1.50 లక్షల గృహాలను లబ్ధిదారులకు అందించాలనే లక్ష్యానికి అనుగుణంగా రిజిస్ట్రేషన్‌ సాగడం లేదు. డిసెంబరు నుంచే క్షేత్ర స్థాయికి ఆదేశాలిస్తున్నా ప్రక్రియ వేగవంతం కావడం లేదు. ఇప్పటివరకు సుమారు 20వేల గృహాల రిజిస్ట్రేషన్‌ మాత్రమే పూర్తయినట్లు తెలిసింది. జిల్లాల్లో రిజిస్ట్రేషన్‌ అధికారులపై టిడ్కో అధికారులు ఒత్తిడి చేస్తున్నా ప్రక్రియలో పెద్దగా మార్పు రావడం లేదు. దీంతో ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేసి రిజిస్ట్రేషన్లను పూర్తి చేయాలని టిడ్కో అధికారులు నిర్ణయించారు.

రాష్ట్రవ్యాప్తంగా 2.62 లక్షల టిడ్కో గృహాలకుగాను గత ప్రభుత్వ హయాంలోనే లక్ష ఇళ్లు పూర్తయ్యాయి. ఇప్పటికే పూర్తయిన ఇళ్ల రిజిస్ట్రేషన్‌కు 11 జిల్లాల్లోని 15 పురపాలక సంఘాల్లో ప్రత్యేక రిజిస్ట్రేషన్‌ కేంద్రాలను ఏర్పాటు చేయాలని టిడ్కో అధికారులు నిర్ణయించారు. జీవీఎంసీ విశాఖ, మండపేట, పెద్దాపురం, భీమవరం, పాలకొల్లు, తాడేపల్లిగూడెం, గుడివాడ, చిలకలూరిపేట, గుంటూరు, గూడూరు, నెల్లూరు, ఆదోని, కర్నూలు, నంద్యాల, ఎమ్మిగనూరు పురపాలక సంఘాల్లోని మున్సిపల్‌ కమిషనర్ల కార్యాలయాల్లో వీటిని ఏర్పాటు చేస్తారు. రిజిస్ట్రేషన్‌ చేపట్టేందుకు అవసరమయ్యే సామగ్రిని టిడ్కో సమకూర్చనుండగా సాఫ్ట్‌వేర్‌, సిబ్బందిని రిజిస్ట్రేషన్‌శాఖ అందించేలా అంగీకారానికి వచ్చారు. లబ్ధిదారులు రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలకు రాకుండా ఇళ్లవద్దనే వారి సంతకం, వేలిముద్ర తీసుకుని ప్రక్రియ పూర్తి చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ల ప్రక్రియను వేగవంతం చేసేందుకు ప్రత్యేక డ్రైవ్‌ను నిర్వహించనున్నారు.

రిజిస్ట్రేషన్లు చూసైనా రుణమిస్తారని..: నిర్దేశిత పురపాలక సంఘాల పరిధిలో 1.12 లక్షల టిడ్కో గృహాలున్నాయి. వీటిలో 300 చ.అ విస్తీర్ణం ఉన్నవి 68వేల గృహాలుండగా.. 365 చ.అ విస్తీర్ణం, 430 చ.అ విస్తీర్ణం గల ఇళ్లు 44వేలు ఉన్నాయి. 300 చ.అ విస్తీర్ణం గల ఇళ్లను ప్రభుత్వం ఉచితంగా ఇచ్చినందున వీటి రిజిస్ట్రేషన్‌ను త్వరగా పూర్తి చేయాలని నిర్ణయించారు. మిగతా రెండు రకాల విస్తీర్ణంగల ఇళ్లల్లో కొన్నింటికి బ్యాంకుల నుంచి లబ్ధిదారుల వాటాగా రుణం మంజూరు కాలేదు. ఇళ్ల రిజిస్ట్రేషన్‌ పూర్తయి లబ్ధిదారులకు అందించిన తర్వాతే బ్యాంకులు రుణాలు ఇస్తాయనే ఆశతో అధికారులు ఉన్నారు.

ఇవీ చూడండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.