ETV Bharat / city

NASA: ‘బ్రేక్‌ ది ఐస్‌ లూనార్‌ ఛాలెంజ్‌’లో తెలుగు యువకుల సత్తా

author img

By

Published : Aug 21, 2021, 9:49 AM IST

అమెరికా అంతరిక్ష సంస్థ నాసా నిర్వహించిన ‘బ్రేక్‌ ది ఐస్‌ లూనార్‌ ఛాలెంజ్‌’లో తెలుగు యువకుల సత్తా చాటారు. పోటీలో విజయం సాధించి నగదు బహుమతితో పాటు రెండేళ్ల పాటు నాసాలో పనిచేసే అవకాశాన్ని సాధించారు.

‘బ్రేక్‌ ది ఐస్‌ లూనార్‌ ఛాలెంజ్‌’లో తెలుగు యువకుల సత్తా
‘బ్రేక్‌ ది ఐస్‌ లూనార్‌ ఛాలెంజ్‌’లో తెలుగు యువకుల సత్తా

అమెరికా అంతరిక్ష సంస్థ నాసా నిర్వహించిన పోటీలో తెలుగు యువకులు సత్తా చాటారు. నగదు బహుమతితో పాటు రెండేళ్ల పాటు నాసాలో పనిచేసే అవకాశాన్ని సాధించారు. చంద్రునిపై ఉన్న మంచును నీరుగా మార్చే ప్రాజెక్టు రూపకల్పనకు పోటీలను నాసా ‘బ్రేక్‌ ది ఐస్‌ లూనార్‌ ఛాలెంజ్‌’ పేరున నిర్వహించింది. ప్రపంచ వ్యాప్తంగా 48 దేశాల నుంచి 374 బృందాలు పోటీకి పేర్లు నమోదు చేసుకున్నాయి. ‘టీం ఏఏ-స్టార్‌’ పేరిట తెలుగు యువకులు ప్రణవ్‌ ప్రసాద్‌, అమరేశ్వర ప్రసాద్‌, సాయి ఆశిష్‌ కుమార్‌ల బృందం పాల్గొంది. నాసా ఎంపిక చేసిన పది బృందాల్లో వీరికీ చోటు దక్కింది. 25 వేల డాలర్ల బహుమతి గెలుచుకుంది. ఈ విషయాన్ని నాసా తన అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచింది.

ముగ్గురూ కలిసి..

టీం ఏఏ-స్టార్‌ పేరిట ఏర్పడ్డ ఈ బృందానికి అమెరికాలోని వాషింగ్టన్‌లో ఉన్న ప్రణవ్‌ ప్రసాద్‌ సారధ్యం వహించారు. తెనాలి నుంచి చుండూరు అమరేశ్వర ప్రసాద్‌, విశాఖ నుంచి కరణం సాయి ఆశిష్‌ కుమార్‌ భాగస్వాములయ్యారు. ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన ఈ ముగ్గురు స్టార్టప్‌ల ఏర్పాటు, ఉన్నత చదువుల్లో నిమగ్నమయ్యారు. గతంలోనూ సాయి ఆశిష్‌, అమరేశ్వర ప్రసాద్‌లు మరో సాంకేతిక నిపుణుడితో కలిసి నాసా నిర్వహించిన ‘లూనార్‌ ఛాలెంజ్‌’లో పాల్గొన్నారు. అందులో మూడో స్థానంలో నిలిచి 2 వేల డాలర్ల బహుమతిని సొంతం చేసుకున్నారు.

నీరుగా మార్చేలా రూపొందించాం..

ఈ విజయంపై విశాఖకు చెందిన సాయి ఆశిష్‌ కుమార్‌ మాట్లాడుతూ.. ‘గత ఏడాది నవంబర్‌ నుంచి ఈ ప్రాజెక్టుపై మా బృందం పనిచేయడం ప్రారంభించింది. చంద్రుని ఉపరితలంపై తవ్వి దిగువన ఉన్న మంచును బయటకు తీసే ప్రాజెక్టు నమూనాను నాసా వారు రూపొందించమన్నారు. మేం దానికి మరిన్ని అదనపు హంగులు జత చేశాం. మంచును తీసిన చోటు నుంచి వాహనంలో నిర్దేశిత ప్రాంతానికి చేర్చే క్రమంలోనే నీరుగా మార్చేలా రూపొందించాం. చంద్రునిపై వాస్తవంగా పనిచేసేలా ప్రాజెక్టు రూపొందించేందుకు నాసాలోనే రెండేళ్లపాటు పని చేసేందుకు అవకాశం ఇవ్వనున్నారు. నేను, అమరేశ్వర ప్రసాద్‌ ఇంజినీరింగ్‌లో కలిసి చదువుకున్నాం. మా బృందానికి నేతృత్వం వహించిన ప్రణవ్‌ ప్రసాద్‌ మాకు బంధువు. ఆయన అమెరికాలోనే పుట్టి పెరిగి అక్కడే ఉంటున్నారు’ అని పేర్కొన్నారు.

ఇదీ చదవండి

GANDHI ISSUE: 'రేపిస్టు అన్న వార్తలు కలిచివేశాయి.. జీవితంపై ఆశ కోల్పోయా'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.