ETV Bharat / city

NGT Committee On Rushikonda: రుషికొండ ప్రాజెక్టు పనులకు ఎన్​జీటీ బ్రేక్.. కారణం ఇదే!

author img

By

Published : Dec 23, 2021, 4:10 PM IST

విశాఖలోని రుషికొండ వద్ద ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ చేపడుతున్న ప్రాజెక్టు పనులకు జాతీయ హరిత ట్రైబ్యునల్‌ బ్రేక్ వేసింది. మెుదటి నుంచి అనేక అనుమానాలున్నా రుషికొండ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు ఓ కమిటీని నియమించింది. నలుగురు సభ్యులతో కూడిన కమిటీ.. అక్కడి వాస్తవ పరిస్థితులను అధ్యయనం చేసి ఎన్​జీటీకి నివేదిక అందించనుంది.

రుషికొండ ప్రాజెక్టు పనులకు ఎన్​జీటీ బ్రేక్
రుషికొండ ప్రాజెక్టు పనులకు ఎన్​జీటీ బ్రేక్

విశాఖలోని రుషికొండ వద్ద.. ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ చేపడుతున్న ప్రాజెక్టు పనులపై జాతీయ హరిత ట్రైబ్యునల్‌ స్పందించింది. అక్కడి వాస్తవ పరిస్థితులపై నివేదిక రూపొందించేందుకు నలుగురు సభ్యులతో కూడిన కమిటీ ఏర్పాటుకు ఆదేశించింది. ఆది నుంచి అనేక అనుమానాలున్న రుషికొండ పనులను ఈ కమిటీ సభ్యులు.. క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు.

రుషికొండ వద్ద నిబంధనలకు విరుద్ధంగా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని, బృహత్తర ప్రణాళికను పట్టించుకోవటం లేదని, పర్యావరణానికి హానికలుగుతోందని ఎంపీ రఘురామకృష్ణరాజు గతంలో జాతీయ హరిత ట్రైబ్యునల్​కు ఫిర్యాదు చేశారు. ఈ అంశంపై స్పందించిన ఎన్‌జీటీ ఈ నెల 17న ప్రాథమిక విచారణ చేపట్టింది. ప్రతివాదులుగా ఏపీ ప్రభుత్వాన్ని పేర్కొంది. ఏపీ నగరాభివృద్ధి సంస్థ చట్టం ప్రకారం బృహత్తర ప్రణాళికలో పర్యావరణ సున్నిత ప్రాంతాన్ని పరిరక్షించాల్సిన ప్రభుత్వం ఇలా చేయడంపై తీవ్రంగా స్పందించింది. ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం తవ్వకాల కారణంగా రుషికొండ పరిసర ప్రాంతాల్లోని వాతావరణం తీవ్రంగా దెబ్బతింటోందని పేర్కొనడంతో ఈ కమిటీని నియమించినట్లు ఎన్‌జీటీ తెలిపింది.

నలుగురు సభ్యులతో కూడిన స్వతంత్ర కమిటీలో కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి, రాష్ట్ర పర్యావరణ ప్రభావ అంచనాల ప్రాథికార సంస్థ , జిల్లా కలెక్టర్‌ ఉండాలని ఎన్‌జీటీ ఆదేశించింది. ఈ కమిటీకి ఎస్​ఈఐఏఏ (S.E.I.A.A) నోడల్‌ ఏజెన్సీగా సమన్వయం చేయాలని సూచించింది. రెండు వారాల్లో క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టడంతోపాటు స్థానికులతోనూ మాట్లాడి.. రెండు నెలల్లోగా నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది.

అయితే.. రుషికొండ వద్ద చేపడుతున్న ప్రాజెక్టు విషయంలో ఆది నుంచీ అనుమానాలున్నాయి. తీర ప్రాంత జోన్‌, పర్యావరణ, అటవీశాఖ అనుమతులు తీసుకున్నప్పటికీ ప్రస్తుతం ఇక్కడ కొండ మీద జరుగుతున్న పనులు పర్యావరణానికి పూర్తి విఘాతం కలిగించేలా ఉన్నాయని నిపుణులు భావిస్తున్నారు. సముద్రం పక్కనే ఉన్న కొండను పూర్తిగా తొలిచేస్తే కొత్త సమస్యలు ఉత్పన్నమవుతాయంటున్నారు. ఇక్కడ తవ్విన మట్టిని సమీప సముద్ర తీరంలో డంపింగ్‌ చేయడంపైనా అభ్యంతరం వ్యక్తమవుతోంది.

ఇదీ చదవండి

రుషికొండ వద్ద మరో భారీ ప్రాజెక్టు రూపకల్పనకు సన్నాహాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.