ETV Bharat / city

రాష్ట్రవ్యాప్తంగా పారిశుద్ధ్య కార్మికుల నిరసన

author img

By

Published : Jun 15, 2021, 8:41 AM IST

సమస్యలను పరిష్కరించాలని డిమాండు చేస్తూ రెండు రోజులపాటు పట్టణ పారిశుద్ధ్య కార్మికులు చేపట్టిన సమ్మె.. పోలీసులు, కార్మికుల మధ్య తోపులాటలు, ధర్నాలు, ఆందోళనల మధ్య సోమవారం ప్రారంభమైంది. అనంతపురంలో పోలీసులు, కార్మికుల మధ్య తోపులాటలో ముగ్గురు మహిళా కార్మికులు స్పృహ తప్పి పడిపోయారు.

municipality workers protest at andhra pradesh
municipality workers protest at andhra pradesh

సమస్యల పరిష్కారం కోరుతూ... రాష్ట్ర వ్యాప్తంగా పారిశుద్ధ్య కార్మికులు నిరసన చేపట్టారు. అనంతపురంలో కార్మికుల తలపెట్టిన సమ్మెలో ఉద్రిక్తత నెలకొంది. ధర్నా చేస్తున్న కార్మికులను పోలీసులు అడ్డుకోవడంతో కార్మికులకు.. పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఈ నేపథ్యంలో ఇద్దరు కార్మికులు సృహ కోల్పోయారు. వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. . పోలీసులు మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తించారని ఆరోపిస్తూ అనంతపురం రెండో పట్టణ పోలీస్‌ స్టేషన్‌ ఎదుట కార్మికులు ధర్నా చేశారు. 20 మందిని అరెస్టు చేసి తరువాత విడుదల చేశారు. మడకశిర పట్టణంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట కార్మికులు నిరసన చేపట్టారు. కమిషనర్​కు వినతిపత్రం అందించారు. ఔట్ సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. తలుపుల మేజర్ పంచాయతీ పారిశుధ్యకార్మికులు సచివాలయం ఎదుట అర్ధనగ్న ప్రదర్శన చేశారు.

విశాఖ జిల్లాలో...

వేపగుంట జోనల్ కార్యాలయం ఎదుట పారిశుద్ధ్య కార్మికులు ధర్నా నిర్వహించారు. కరోనాతో మృతి చెందిన కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. సక్రమంగా జీతం చెల్లించాలని డిమాండ్ చేస్తూ.. విశాఖ జిల్లా నర్సీపట్నం మున్సిపల్​ కార్యాలయం ఎదుట కార్మికులు ఆందోళన చేపట్టారు. విశాఖలోని జోనల్‌ కార్యాలయాల ఎదుట కార్మికులు నిరసన చేపట్టారు.

ప్రకాశం జిల్లాలో...

నగర జనాభా నిష్పత్తి ప్రకారం కార్మికుల సంఖ్య పెంచాలని కోరుతూ ప్రకాశం జిల్లా ఒంగోలు కార్పొరేషన్​ కార్యాలయం ముందు పారిశుద్ధ్య కార్మికులు నిరసన చేపట్టారు. పొరుగుసేవల కార్మికులను క్రమబద్ధీకరించాలని కోరుతూ... శ్రీకాకుళం నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట కార్మికులు మోకాలుపై కూర్చొని నిరసన తెలిపారు. సమస్యలు పరిష్కరించకపోతే పోరాటాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

కడప జిల్లాలో...

కడపలోనూ ధర్నా చేస్తున్న పలువురు కార్మికులను అరెస్టు చేసి అనంతరం విడిచిపెట్టారు. విజయవాడలోని అలంకార్‌ సెంటర్‌లో నిర్వహించిన ధర్నాలో ఏపీ మున్సిపల్‌ కార్మికులు, ఉద్యోగుల సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమామహేశ్వరరావు పాల్గొని ప్రసంగించారు.

ఇదీ చదవండి:

నాణ్యమైన విద్యలో..జాతీయ స్థాయిలో ఏపీకి 19వ స్థానం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.