ETV Bharat / city

MP Vijayasai Reddy:ఆ ఆస్తులతో.. విజయసాయి రెడ్డికి సంబంధం లేదా?

author img

By

Published : Oct 9, 2022, 7:16 AM IST

YSRCP MP Vijayasai Reddy: విశాఖలో.. ఒక్క ఫ్లాట్ తప్ప నాకు, నా కుటుంబ సభ్యులకూ ఆస్తులే లేవు.. ఏడాది క్రితం వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పిన మాటలివి.. కానీ అప్పుడు ఆయన చెప్పిన దానికి.. ఇప్పుడు విశాఖలో జరుగుతున్నదానికీ పొంతనే లేదు.. విజయసాయిరెడ్డి కుమార్తె, అల్లుడికి చెందిన కంపెనీ విశాఖలో తక్కువ వ్యవధిలోనే భారీగా భూములు కొనుగోలు చేసింది. కేవలం 11 నెలల్లోనే 87వేల714 చదరపు గజాలు సొంతం చేసుకుంది. ఈ భూముల పక్క నుంచే వెళ్లేలా భోగాపురం గ్రీన్‌ఫీల్డ్‌ రహదారి ఎలైన్‌మెంట్‌ కూడా మారిపోయింది. మరి ఇప్పుడు విజయసాయిరెడ్డి ఏమంటారో?. విన్నారు కదా.. విశాఖలో.. తానుండే మూడు పడకల ఫ్లాట్‌ తప్ప తనకు గానీ, తన కుటుంబ సభ్యులెవరికీ ఆస్తులు లేవని.. ఇక ముందు తీసుకోబోమని వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పిన మాటలివి.. ఉత్తరాంధ్ర ఇన్‌ఛార్జిగా ఉన్నప్పుడు విశాఖలో భూ ఆక్రమణల ఆరోపణలపై స్పందిస్తూ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలివి.

MP Vijayasai Reddy
వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి

Vijayasai Reddy family: ఆహా.. ఏం చెప్పారు సాయిరెడ్డి గారూ! విశాఖలో మీకు ఆస్తులే లేవా? మీ కుటుంబ సభ్యులెవరి పేరుతో కూడా లేవా? మరి పెనక నేహా రెడ్డి, పెనక రోహిత్‌రెడ్డీ ఎవరు? మీ కూతురూ, అల్లుడూ కాదా?.. కుమార్తెను, అల్లుణ్నీ కుటుంబ సభ్యులుగా పరిగణించకూడదని వైకాపా ప్రభుత్వం ఈ మధ్య చట్టమేదైనా తెచ్చిందా? మీ కుమార్తె, అల్లుడు ఏర్పాటు చేసిన అవ్యాన్‌ రియల్టర్స్‌ సంస్థ.. ప్రతిపాదిత భోగాపురం గ్రీన్‌ఫీల్డ్‌ రహదారిని ఆనుకుని కొన్ని వందల కోట్ల రూపాయల విలువ చేసే భూముల్ని కొనడం వాస్తవం కాదా? ప్రభుత్వ రికార్డుల ప్రకారమే 53 కోట్ల రూపాయల విలువైన ఆ భూముల విలువ బహిరంగ మార్కెట్‌లో దానికి అనేక రెట్లు ఎక్కువ ఉంటుందన్నది నిజం కాదా? మీ కూతురు, అల్లుడు భూములు కొంటే అవి మీవి కానట్టా?

విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా చేస్తే, పరిపాలనా కేంద్రమైన కోర్‌ క్యాపిటల్‌ను ఏర్పాటు చేయాలని జీఎన్‌రావు కమిటీ, బోస్టన్‌ కన్సల్టెన్సీ గ్రూపు ప్రతిపాదించిన ప్రాంతానికి అత్యంత దగ్గరలోనే ఆ భూములు ఉండటం కాకతాళీయమేనంటారా? భీమిలి- భోగాపురం బీచ్‌ కారిడార్‌ను గత ప్రభుత్వం సముద్ర తీరాన్ని ఆనుకుని ఉన్న రోడ్డు పక్కనే ప్రతిపాదిస్తే, మీ ప్రభుత్వం దాని ఎలైన్‌మెంట్‌ మార్చడం, నేరెళ్లవలస దగ్గర ఆ రోడ్డు వంపు తిరిగి.. మీ కుమార్తె, అల్లుడు కొన్న భూముల పక్క నుంచే వెళ్లడం కూడా యాదృచ్ఛికమే అంటారా? వివాదాస్పద దసపల్లా భూముల్ని తీసుకున్న కంపెనీకి.. మీ కూతురు, అల్లుడికి చెందిన అవ్యాన్‌ సంస్థ నుంచి నిధులు వెళ్లాయని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.

అదే కంపెనీ అటు సముద్రతీరానికి, ప్రతిపాదిత భోగాపురం రహదారికి మధ్యలో కోట్ల విలువైన భూములు కొనడంలో ఎలాంటి వ్యాపార ప్రయోజనాలూ లేవంటే నమ్మమంటారా? ఇప్పటికే కోట్ల విలువ చేసే ఆ భూములు.. మీ ప్రభుత్వం చెబుతున్నట్టే అక్కడికి రాజధాని వస్తే బంగారమైపోతాయన్నది దాచినా దాగని నిజం కాదా? ఒక పక్క విశాఖలో ఇన్ని చేస్తూ.. మీరు కేవలం ప్రజాసేవకే అక్కడికి వెళ్లినట్టు, ఆస్తులపైనా, భూములపైనా ఎలాంటి మమకారం లేనట్టు ఎంత చక్కగా చెప్పారు సాయిరెడ్డీ! .

అధికార పార్టీ అగ్రనాయకుల్లో ఒకరిగా, పార్టీలో నంబర్‌ 2గా ఉంటూ, నిన్న మొన్నటి వరకు ఆ పార్టీ ఉత్తరాంధ్ర ఇన్‌ఛార్జిగానూ వ్యవహరించిన విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి, అల్లుడు రోహిత్‌రెడ్డి విశాఖలో భారీగానే ఆస్తులు వెనకేశారు. వారికి చెందిన అవ్యాన్‌ రియల్టర్స్‌ కంపెనీ అటు భోగాపురం విమానాశ్రయానికి, ఇటు విశాఖకు మధ్య భీమునిపట్నం మండలంలో వందల కోట్ల విలువైన భూముల్ని కేవలం 11 నెలల వ్యవధిలోనే చకచకా కొనేసింది.

కేవలం భీమిలి మండలంలోనే 11 నెలల్లో 16 మంది నుంచి వివిధ సర్వే నంబర్లలో 87,714 చదరపు గజాల భూమిని అవ్యాన్‌ రియల్టర్స్‌ సంస్థ కొనుగోలు చేసింది. ప్రభుత్వ రికార్డుల ప్రకారమే ఆ భూమి విలువ 53 కోట్ల 3 లక్షల రూపాయలు. బహిరంగ మార్కెట్‌లో దానికి అనేక రెట్లు ఎక్కువ పలుకుతుంది. ఎంతో వ్యూహాత్మకంగా భీమిలి నుంచి భోగాపురం విమానాశ్రయం వరకు తలపెట్టిన ఆరు వరుసల గ్రీన్‌ఫీల్డ్‌ రహదారికి పక్కనే ఆ భూములు కొనడం విశేషం.

విజయ సాయిరెడ్డి అల్లుడు, కుమార్తె భాగస్వాములుగా అవ్యాన్‌ రియల్టర్స్‌ ఎల్​ఎల్​పీ సంస్థను 2020 సెప్టెంబరు 7న ఏర్పాటు చేశారు. ఆ సంస్థ భీమిలి మండలంలో 2021 ఫిబ్రవరి నుంచి భూములు కొనడం ప్రారంభించింది. నేరెళ్లవలస, భీమిలి, ఎగువపేటల్లో భూములు కొనుగోలు చేసింది. నేరెళ్లవలసకు చెందిన జె.మల్లికార్జునుడు అనే వ్యక్తి నుంచి కొన్న 19,892 చదరపు గజాల భూమిని 2021 ఫిబ్రవరి 18న భీమిలి సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో మొదట రిజిస్ట్రేషన్‌ చేశారు. అప్పటి నుంచి 2021 డిసెంబరు 17 మధ్య అదే కార్యాలయంలో మొత్తం 25 రిజిస్ట్రేషన్లు జరిగాయి. నేరెళ్లవలసలో 14, భీమిలిలో 10, ఎగువపేటలో ఒక స్థలం కొన్నారు. 2021 సెప్టెంబరులో గరిష్ఠంగా 10 రిజిస్ట్రేషన్లు జరిగాయి. ‘ఎం.గురునాథరావు-ఇతరుల’ నుంచి ఒకే సర్వే నంబరులోనే ఏకంగా ఏడు స్థలాలు కొనుగోలు చేశారు. 2021 ఫిబ్రవరిలో 3, మార్చిలో 6, జులై, ఆగస్టుల్లో ఒక్కొక్కటి, సెప్టెంబరులో 10, అక్టోబరులో 3, డిసెంబరులో ఒకటి రిజిస్ట్రేషన్లు జరిగాయి.

అవ్యాన్‌ రియల్టర్స్‌ LLP సంస్థ 2021 ఫిబ్రవరి 19 - డిసెంబరు 15 మధ్య... భీమిలి, నేరెళ్లవలస, ఎగువపేటల్లో కొన్న భూముల భూముల యజమానుల పేర్లు, డాక్యమెంట్ నంబర్లు, సర్వే నెంబర్లు, కొన్న స్థలం విస్తీర్ణం వివరాలు ఇలా ఉన్నాయి. ఇలా మొత్తం 11 నెలల్లోనే 25 రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఈ 25 రిజిస్ట్రేషన్ల ద్వారా 87, 713.99 చదరపు గజాల భూమిని అవ్యాన్‌ రియల్టర్స్ కొనుగోలు చేసింది. ఈ భూముల ప్రభుత్వ రికార్డుల ప్రకారమే 53 కోట్ల రూపాయలు. ఇక బహిరంగ మార్కెట్‌లో ఈ భూముల విలువ వందల కోట్లలో ఉంటుందనడంలో సందేహం లేదు.

విశాఖలో ఎంపీ విజయసాయిరెడ్డి కుటుంబ సభ్యుల ఆస్తులు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.