ETV Bharat / city

రికార్డు స్థాయిలో కొవిడ్​ కేసులు.. మారుమూల ప్రాంతాలకు మహమ్మారి

author img

By

Published : May 1, 2021, 9:12 AM IST

corona cases increasing in andhrapradesh
corona cases increasing in andhrapradesh

రాష్ట్ర వ్యాప్తంగా రెండో దశ కొవిడ్‌ వ్యాప్తి రోజురోజుకు ఉద్ధృతమవుతోంది. రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. కేవలం 8 రోజుల్లోనే లక్షకుపైగా కొవిడ్ కేసులు నమోదయ్యాయి. జిల్లాల నుంచి మారుమూల ప్రాంతాలకు వైరస్‌ వ్యాప్తి పెరిగిపోతోంది.

ఏపీలో కరోనా కేసులు

రాష్ట్ర వ్యాప్తంగా కొవిడ్‌ రెండో దశ వ్యాప్తి.. ప్రజలను భయందోళనకు గురిచేస్తోంది. కేవలం 8 రోజుల వ్యవధిలోనే లక్షకుపైగా కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదుకావటం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కరోనా వైరస్‌ శరవేగంగా పాకిపోతోంది. గుంటూరు జిల్లాలో శుక్రవారం ఒక్కరోజే 2,129 పాజిటివ్ కేసులు నమోదవటం.. పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఏప్రిల్ నెలలో 26,967 కేసులు రాగా.. మొత్తం కేసుల సంఖ్య 1,04,919కి చేరింది. విజయనగరం జిల్లాలో రోజురోజుకు పెరిగిపోతున్న కొవిడ్‌ కేసులకు అడ్డుకట్ట వేసేందుకు జిల్లా యంత్రాంగం శ్రమిస్తోంది. కొవిడ్ పరీక్షలను వేగవంతం చేసి మూడంచెల వ్యూహాన్ని అమ‌లు చేస్తున్నామ‌ని జిల్లా పాలనాధికారి.. హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్ తెలిపారు. రోగులకు సరిపడ బెడ్లు, ఆక్సిజన్‌ నిల్వలపై నిరంతరం పర్యవేక్షిస్తున్నామని ఆయన తెలియజేశారు.

విశాఖ జిల్లా మండల కేంద్రం చీడికాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కరోనా కలకలం రేపింది. ఆసుపత్రిలో అధికారులు, సిబ్బందికి కలిసి మొత్తం ఐదుగురికి కరోనా సోకింది. అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా రోగుల పరిస్థితి దారుణంగా తయారైంది. సుదూర ప్రాంతాల నుంచి వస్తున్న వారు తీవ్ర అస్వస్థతకు గురై అంబులెన్స్‌లోనే మృతి చెందిన సంఘటనలు వెలుగుచూస్తున్నాయి. గతరాత్రిప్రభుత్వాసుపత్రిలో ఆంబులెన్స్‌లో ఇద్దరు మృతి చెందారు.

చిత్తూరు జిల్లా తిరుచానూరు.. పద్మావతి అమ్మవారి ఆలయంలో మిరాశీ అర్చకుడుగా పనిచేస్తున్న ఎంజీ రామచంద్రన్ కరోనా చికిత్సపొందుతూ శుక్రవారం కన్నుమూశారు. తూర్పు గోదావరి జిల్లాలో శ్మశాన వాటికలకు కొవిడ్‌ మృతదేహాలు క్రమంగా పెరుగుతున్నాయి. కాకినాడ గ్రామీణ మండలం తూరంగి హిందూ స్మశాన వాటికకు నిత్యం 14 నుంచి 15 వరకు మృతదేహాలు వస్తున్నాయి. కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన తూర్పుగోదావరిజిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి దర్శనాలను మే8వ తేదీ వరకు నిలిపివేస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి చెప్పారు.

ఇదీ చదవండి: కొవిడ్‌ రోగులతో ప్రభుత్వాసుపత్రులు కిటకిట

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.