ETV Bharat / city

రుషికొండకు 'బ్లూ ఫ్లాగ్'​తో విశాఖ అంతర్జాతీయంగా మెరుస్తుందా!

author img

By

Published : Oct 7, 2020, 1:05 PM IST

నీలి సాగర తీరానికి మరింత వన్నె తెచ్చేందుకు 'బ్లూ ఫ్లాగ్' ఎగురుతుందా? సాగర నగరిని ఎంతో కాలంగా ఊరిస్తున్న అరుదైన గుర్తింపు మనకు దక్కుతుందా? ప్రపంచ శ్రేణి బీచ్​ల సరసన మన రుషికొండ నిలుస్తుందా? ఎన్నో అంచనాల నడుమ అందరినీ ఊరిస్తున్న బ్లూఫ్లాగ్ సర్టిఫికేషన్ మనను వరిస్తే సాగర నగరికి మరో మేరు నగ జత చేరినట్లే. 3 సంవత్సరాల కృషికి గుర్తింపు దక్కే రోజు ఎంతో దూరం లేదు. మన విశాఖను అంతర్జాతీయ స్థాయిలో మరోసారి తళుక్కున మెరిపించే అరుదైన అవకాశంపై ప్రకటన త్వరలోనే రాబోతుందని అందరూ ఆశిస్తున్నారు.

ruhsikonda beach
రుషికొండ బీచ్

గత కొద్ది సంవత్సరాలుగా 'బ్లూ-ఫ్లాగ్' బీచ్ పేరు మన విశాఖలో తరచూ వినిపిస్తూనే ఉంది. అసలు ఏంటీ 'బ్లూఫ్లాగ్'. అది వస్తే విశాఖకు ఏంటి లాభం అనుకుంటున్నారా.. ఆ నీలి జెండా ప్రపంచ పర్యటకానికి మనల్ని ఎంతో ప్రత్యేకంగా పరిచయం చేయనుంది.

కొద్ది సంవత్సరాల క్రితం వరకు సాధారణ బీచ్​ల సరసన ఉన్న రుషికొండ బీచ్​ను ఇప్పుడు ఓసారి చూస్తే... 'బ్లూ ఫ్లాగ్' సర్టిఫికేషన్ ప్రత్యేకతలు మనకు కనిపిస్తాయి. ఒక్కసారి ఆ జెండా మన తీరంలో ఎగిరితే.. ఇక రుషికొండకు అంతర్జాతీయ గుర్తింపు దక్కినట్లే. అన్ని ప్రమాణాల్లోనూ ఆ బీచ్ మేటిగా నిలిచిందని చాటి చెప్పే సర్టిఫికేషన్ బ్లూఫ్లాగ్​తో వస్తుంది.

బ్లూఫ్లాగ్ ప్రత్యేకత

ఐరోపా దేశాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఈ సర్టిఫికేషన్​కు ఎంతో ప్రత్యేకత ఉంది. అందుకే ప్రధాని నరేంద్రమోదీ ఈ కాన్సెప్ట్​ను మన దేశంలో పరిచయం చేయడం ద్వారా పర్యటకానికి సరికొత్త శోభ తీసుకురావాలని భావించారు. ఆ దిశగా దేశంలో ఎంతో ఆకర్షణ కలిగిన 13 బీచ్​లను ఎంపిక చేసి పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ ద్వారా బీమ్స్ ప్రాజెక్టును అమలు చేశారు. ఈ ప్రాజెక్టులో అవకాశం దక్కించుకున్న రుషికొండ బీచ్ మూడేళ్ల కాలంలో రూ. 7 కోట్ల వ్యయంతో అనేక హంగులతో సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. గత నెలలో నేషనల్ జ్యూరీ రుషికొండ బీచ్​తో పాటు మరో 7 బీచ్​లను ఎంపిక చేసి వాటి వివరాల్ని డెన్మార్క్​లో పర్యావరణ అవగాహన సంస్థ (ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్​మెంట్ ఎడ్యుకేషన్) సంస్థకు పంపించింది. ఇంతటి ప్రతిష్ఠాత్మకమైన సర్టిఫికేషన్​పై ఈ నెలలో ఎఫ్ఈఈ ప్రకటన చేయనుంది.

అంతర్జాతీయ స్థాయికి విశాఖ

నాలుగు ప్రధాన అంశాలకు ప్రాధాన్యత ఇస్తూ... 33 ప్రమాణాలను నిర్దేశించుకుని రుషికొండ బీచ్​ను పర్యావరణ హితంగా అభివృద్ధి చేశారు. ప్రస్తుతం ఎంపికైన బీచ్​లలో రుషికొండ బీచ్ ప్రత్యేకమనే చెప్పాలి. 'బ్లూ ఫ్లాగ్' సర్టిఫికేషన్ వస్తే... పర్యటకంగా విశాఖ మరో స్థాయికి వెళుతుందనే ఆశాభావాన్ని పర్యటక రంగంలో సేవలు అందిస్తున్నవారు వ్యక్తం చేస్తున్నారు. విశాఖకు వచ్చే అంతర్జాతీయ పర్యటకుల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.

బీచ్​కు వచ్చే సందర్శకుల్లో అవగాహన కల్పించేందుకు అనేక ఏర్పాట్లను చేశారు. మరోవైపు ప్రతి ఒక్కరిలో బీచ్ పరిరక్షణపై మరింత బాధ్యత పెంచేందుకు 'ఐ యామ్ సేవింగ్ మై బీచ్ ఫ్లాగ్' అనే హోర్డింగును రుషికొండ తీరంలో ఆవిష్కరించారు.

ఇవీ చదవండి..

నేటితో 87 వసంతాలు పూర్తి చేసుకున్న విశాఖ నౌకాశ్రయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.