ETV Bharat / city

దారుణం.. విజయవాడలో కుళ్లిన మాంసం

author img

By

Published : Jul 5, 2022, 10:49 AM IST

Updated : Jul 5, 2022, 5:03 PM IST

NON VEG: సాధారణంగా మాంసం అంటే ఇష్టం ఉండని వారు చాలా తక్కువ మంది ఉంటారు. ఆదివారం వచ్చిందంటే చాలు మటన్​, చికెన్​, చేపల దుకాణాల దగ్గర జనం బారులు తీరుతారు. అదే అదనుగా చాలా మంది వ్యాపారులు కుళ్లిన మాంసాన్ని విక్రయిస్తున్నారు. తాజాగా పలు చిన్నహోటళ్లతో పాటు, పలు మాంసం దుకాణదారులకు సరఫరా చేసేందుకు దాచి ఉంచిన కుళ్లిపోయిన మాంసాన్ని నగరపాలక సంస్థ ప్రజారోగ్య విభాగం అధికారులు ఆకస్మికంగా దాడులు చేసి పట్టుకున్నారు. ఇంతకీ ఇది ఎక్కడంటే?

NON VEG
NON VEG

NON VEG: విజయవాడ నగంలోని పలు చిన్నహోటళ్లతో పాటు, మాంసం దుకాణదారులకు సరఫరా చేసేందుకు దాచి ఉంచిన కుళ్లిపోయిన మాంసాన్ని నగరపాలక సంస్థ ప్రజారోగ్య విభాగం అధికారులు సోమవారం ఆకస్మికంగా దాడులు చేసి పట్టుకున్నారు. దాదాపు 100 కిలోల మాంసాన్ని కొందరు అక్రమ వ్యాపారుల నుంచి స్వాధీనం చేసుకున్నారు. రాణిగారితోట బూషేష్‌గుప్తానగర్‌ వాటర్‌ ప్లాంటు ప్రాంతానికి చెందిన హరిమాణిక్యం రాము అనే వ్యక్తి, మరికొందరితో కలిసి పక్క జిల్లాలు, వివిధ ప్రాంతాల నుంచి నాసిరకమైన, అనారోగ్యకమైన జీవాలను, చనిపోయిన మేకలు, గొర్రెల మాంసాన్ని సేకరించి నగరానికి తీసుకొచ్చి అక్రమంగా విక్రయిస్తున్నారు. ఈ మేరకు నగరపాలక సంస్థ అధికారులకు ఫిర్యాదులు అందగా, ఆకస్మికంగా దాడులు చేసి సరకును స్వాధీనం చేసుకున్నారు.

పల్నాడు నుంచి..: వినుకొండ ప్రాంతంలో ప్రత్యేకంగా జీవాల సంత జరుగుతుంది. ఆ సంతలో కొందరు వ్యాపారులు.. మరణించిన గొర్రెలను, మేకలను తీసుకొచ్చి విక్రయిస్తారు. మరోవైపు నిల్వ ఉంచిన మేకలు, గొర్రెల తలకాయలు, కాళ్లను తక్కువ ధరకు అమ్ముతారు. చనిపోయిన జీవాల పొట్టలను చీల్చి అందులోని పేగులు, ఇతర అవయవాలను తొలగించి, వాటి స్థానే పూర్తిగా ఐస్‌ నింపుతారు. అటువంటి జీవాలను రూ.1500-2000 వేలకు నగరంలోని వ్యాపారులు కొనుగోలు చేస్తారు. వాటిని ఐస్‌బాక్సులు, డీఫ్రిజ్‌లో నిల్వచేసి నగరంలోని పేదలు నివాసం ఉండే ప్రాంతాలతోపాటు, మాంసాహారం విక్రయించే చిన్నహోటళ్లకు తక్కువ ధరకు సరఫరా చేస్తున్నారు. ప్రధానంగా కృష్ణలంక రాణిగారితోట ప్రాంతంలోని 5 మాంసం దుకాణదారులకు ఇటువంటి మాంసాన్ని సరఫరా చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఆపై అక్కడి వ్యాపారులు కిలో రూ.800 చొప్పున వినియోగదార్లకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇలా చాలాకాలంగా ఈ వ్యవహారం గుట్టుగా సాగుతోందని ప్రజారోగ్య విభాగం అధికారులకు ఫిర్యాదులు అందాయి. దీంతో వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్‌ రవిచంద్ర ఆధ్వర్యంలో ప్రజారోగ్య విభాగం అధికారులు, సిబ్బంది బృందంతో వెళ్లి ఆకస్మికంగా దాడులుచేసి అక్రమంగా నిల్వఉంచిన సుమారు 100 కిలోల మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన సరకు కుళ్లిపోయిన, పురుగులు పట్టిన దశలో ఉన్నట్లుగా అధికారులు వెల్లడించారు. వాటిపై సున్నం, బ్లీచింగ్‌ చల్లి ధ్వంసం చేశారు. ఆ తదుపరి వాహనంలో కబేళా ప్రాంగణానికి తరలించి అక్కడ గుంతలు తీసి పూడ్చిపెట్టారు. ప్రస్తుతం పట్టుబడిన వ్యాపారికి ప్రజారోగ్య చట్టం అనుసరించి నోటీసు జారీ చేశామని, తర్వాత కఠిన చర్యలు తీసుకుంటామని వీఎఎస్‌ రవిచంద్ర తెలిపారు.

ఇవీ చదవండి:

Last Updated : Jul 5, 2022, 5:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.