ETV Bharat / city

TDP ON YSRCP: మళ్లీ.. "కోడి కత్తి"కి సానబెడుతున్న జగన్​: తెదేపా

author img

By

Published : Dec 13, 2021, 9:14 PM IST

TDP ON YSRCP: జగన్​ రెడ్డిని హతమార్చడానికి ఓ కులం ప్రయత్నిస్తోందని వైకాపా నేతలు చేసిన వ్యాఖ్యలపై తెదేపా శ్రేణులు తీవ్రంగా మండిపడ్డారు. మరో కోడి కత్తి డ్రామాకు జగన్​ తెరితీశారని విమర్శించారు. బురద రాజకీయలను మానుకోవాలని వైకాపా నేతలకు సూచించారు. "అబ్బాయ్ గారూ.. ఈ సారి ఏ బాబాయ్‌కి గురిపెట్టారో?" అని తెదేపా సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు ఎద్దేవా చేశారు.

తెదేపా
TDP ON YSRCP

TDP ON YSRCP: "నిన్న తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి.. నేడు ఉప ముఖ్యమంత్రి నారాయ‌ణ‌స్వామి.. జ‌గ‌న్ రెడ్డి ప్రాణాల‌కు హాని త‌ల‌పెట్టొచ్చని వ్యాఖ్యానించడం మ‌రో కోడిక‌త్తి డ్రామా. బాత్రూమ్ బాబాయ్ గొడ్డలివేటు రిహార్సల్ లాగా అనిపిస్తోంది" అని తెదేపా సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు. ఓ వైపు అప్పుల‌కుప్ప.. మ‌రోవైపు తీవ్రమైన ప్రజావ్యతిరేక‌త‌ నేపథ్యంలో.. మ‌ళ్లీ కోడిక‌త్తికి సాన‌బెడుతున్న సంకేతాలు క‌నిపిస్తున్నాయని విమర్శించారు. "అబ్బాయ్ గారూ.. ఈ సారి ఏ బాబాయ్‌కి గురిపెట్టారో?" అని ఎద్దేవా చేశారు. తల్లి విజయమ్మ, చెల్లి షర్మిల దూరంగా ఉంటున్నా.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైఎస్ వివేకానంద రెడ్డి హత్య చెబుతోందన్నారు. బురద రాజకీయం మాని "హూ కిల్డ్ బాబాయ్" అనే ప్రశ్నకు వైకాపా నాయకులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

ఆ వ్యాఖ్యలు.. వైకాపాలో వర్గపోరుకి సంకేతం: బుద్ధ వెంకన్న
ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి.. ఉత్త ముఖ్యమంత్రిగా మారి ఏదేదో మాట్లాడుతున్నాడని తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న విమర్శించారు. హత్యారాజకీయాలకు వైఎస్​ కుటుంబమే పెట్టిందిపేరని.. అందులో భాగంగా జరిగినవే కోడికత్తి డ్రామా, బాబాయ్ గొడ్డలిపోటు అని అన్నారు. జగన్​ను హతమార్చడానికి ఓ కులం ప్రయత్నిస్తోందన్న నారాయణస్వామి వ్యాఖ్యలు.. వైకాపాలోని వర్గపోరుకి సంకేతమన్నారు. అధికారపార్టీలోని వారే ముఖ్యమంత్రిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారా..? ఎప్పుడు సీఎం కుర్చీ దక్కుతుందా? అని ఎదురుచూస్తున్నారని ఎద్దేవా చేశారు.

పీకే (ప్రశాంత్ కిషోర్) ఆలోచనల ప్రకారమే వైకాపా నేతలు తెదేపాని ఓ కులానికి పరిమితంచేసే ప్రయత్నంచేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ఎక్కడున్నా ఆయన పక్కన బీసీలు, ఎస్సీలు ఉంటారుగానీ ఆయన కులంవారు ఉండరని పేర్కొన్నారు. మీడియా సంస్థలపై, నిజాలు నిర్భయంగా వెల్లడిస్తున్నఏబీఎన్ ఎండీ రాధాకృష్ణ వంటి వారిపై కక్షసాధింపులు మాని, ముఖ్యమంత్రి ఇంటిదొంగలపై దృష్టిపెట్టాలని హితవు పలికారు.

వారే వైకాపా ప్రభుత్వంలో కీలకస్థానాల్లో...
డిప్యూటీ సీఎం చెప్పిన కులంవారే.. ఇప్పుడు ఈప్రభుత్వంలో కీలక స్థానాల్లో ఉన్నారు. వారుకూడా ముఖ్యమంత్రిని హతమార్చడానికి ప్రయత్నిస్తున్నారా? అని బుద్ధా వెంకన్న ప్రశ్నించారు. సజ్జల రామకృష్ణారెడ్డి ఉస్కో అనగానే భౌ భౌమంటూ ఉరికొచ్చే వల్లభనేని వంశీ, దేవినేని అవినాశ్ వంటి వాళ్లు కూడా నారాయణస్వామి చెప్పిన కుట్రలో భాగస్వాములా? అని నిలదీశారు. వైకాపా వాళ్లు ఇష్టమొచ్చినట్లు మొరుగుతుంటే.. చూస్తూ ఊరుకుంటామని అనుకోకండి.. సింహాల్లా చీల్చి చెండాడుతామని హెచ్చరించారు.

రైతుల పట్ల ఇంత అలసత్వమా?
వర్షాలు, వరదలకు పంటలు దెబ్బతిన్నా, తెగుళ్లు సోకి నష్టపోయినా రూ.7 వేలిస్తాం బతకండి.., లేకుంటే చావండి అన్నట్లుగా రైతుల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తోందని తెలుగురైతు రాష్ట్రఅధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. గోదావరి జిల్లాల్లో వర్షాలకు తడిచిన, రంగుమారిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనేస్థితిలోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్​ రెడ్డి అసమర్థత, చేతగాని విధానాలు, అధికారుల అలసత్వంతో రైతులు నష్టపోవాలా? అని ప్రశ్నించారు. విజయనగరం జిల్లాలోని బకాయిలు చెల్లించమని అడిగిన చెరకు రైతులకు నోటిసులిస్తారా? అని నిలదీశారు. రాష్ట్రవ్యాప్తంగా నల్లి, తామర వ్యాప్తితో దారుణంగా దెబ్బతిన్ని మిరపరైతుల ముఖాలు కూడా ఈ ప్రభుత్వం చూడలేదని విమర్శించారు. పంట నష్టంపై ఆరా తీయాల్సిన అధికారులు.. మాకేం పట్టదనట్లు ఉన్నారని మండిపడ్డారు.

జగన్ జమానాలో విద్యార్థుల ఆకలి కేకలు: సయ్యద్ రఫీ
అన్న క్యాంటీన్లు మూసేసి పేదల కడుపు కొట్టిన జగన్‌.. చివరకు మధ్యాహ్న భోజనాన్ని రద్దు చేసి విద్యార్థుల ఆకలి కేకలకు కారకుడయ్యాడని తెదేపా అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ ధ్వజమెత్తారు. విద్యార్థుల ఆకలి కేకలు, మధ్యాహ్న భోజన నిర్వాహకుల వెతలు ముఖ్యమంత్రికి పట్టడంలేదని మండిపడ్డారు. కోడిగుడ్లు, పాలు సరఫరా చేసే వారితో సహా వంటలు వండే వారికి బకాయిలు చెల్లించడం లేదని ఆరోపించారు. మధ్యాహ్న భోజన నిర్వాహకులు, వంట ఏజెన్సీలకు రూ. 250కోట్ల వరకు ప్రభుత్వం చెల్లించాల్సి ఉందని పేర్కొన్నారు.

చంద్రబాబు హయాంలో విద్యార్థుల కడుపు నిండితే.. నేడు జగన్ జమానాలో విద్యార్థులు ఆకలితో చావడమేనా వైకాపా ప్రభుత్వం తీసుకొచ్చిన నాడు-నేడు పథకం ఉద్దేశ్యమా అని ప్రశ్నించారు. ఇకనైనా ముఖ్యమంత్రి మేల్కొని మధ్యాహ్న భోజనం పథకానికి రూ. వెయ్యి కోట్లు కేటాయించాలని డిమాండ్‌ చేశారు.

ఇదీ చదవండి...

Chandrababu on OTS: ఓటీఎస్ వసూళ్లు.. పేదల మెడకు ఉరితాళ్లు : చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.