ETV Bharat / city

TDP leaders on Jagan: ఎన్నికలు ఎప్పుడు జరిగినా.. జగన్​ ఇంటికెళ్లడం ఖాయం: తెదేపా

author img

By

Published : May 17, 2022, 4:49 PM IST

TDP leaders on jagan: సీఎం జగన్​పై తెదేపా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల్ని ఆదుకోవడంలో ఏపీ ప్రభుత్వంతో పోలిస్తే పొరుగున ఉన్న తెలంగాణ నయమని తెలుగుదేశం నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. వైకాపా ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధర కల్పించట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే రెండేళ్లలో మరో రూ.3 లక్షల కోట్లు అప్పు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోందని తెదేపా సీనియర్ నేత యనమల ఆరోపించారు. జగన్‌ పాలన కారణంగా వడ్డీ చెల్లించేందుకే లక్ష కోట్ల రూపాయలు కావాల్సి వస్తోందన్నారు.

TDP leaders
సర్కారుపై ధ్వజమెత్తిన తెదేపా నేతలు

TDP leaders on jagan: 'ఒక్కఛాన్స్' అని అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి జగన్​ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. జగన్​ పాలనతో ప్రజలు విసిగిపోయారని, సీఎం సభలో మాట్లాడుతుంటే మహిళలు లేచి వెళ్లిపోవడమే అందుకు నిదర్శనమన్నారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా... జగన్ ఇంటికి పోవడం ఖాయమని అన్నారు. ప్రతిపక్షాలు సమావేశాలు నిర్వహించుకునే విషయంలో అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలన్నారు. మహానాడుకు మినీ స్టేడియం ఇవ్వకపోవడాన్ని ఆక్షేపించారు. ఈనెల 27, 28న ఒంగోలులో తెదేపా పండుగను ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. ప్రభుత్వం, జగన్ తీరు వల్ల రాష్ట్నానికి జరుగుతున్న నష్టం, నవరత్నాలతో ప్రజలను ఏ విధంగా మోసం చేశారో మహానాడు వేదికగా ప్రజలకు వివరిస్తామని చెప్పారు.

సర్కారుపై ధ్వజమెత్తిన తెదేపా నేతలు

"వైకాపా ప్రభుత్వ హయాంలో సహజ సంపద దోచేస్తున్నారు. సహజ సంపద ద్వారా వచ్చిన ఆదాయం ప్రభుత్వ ట్రెజరీకి రావాలి... కానీ సహజ సంపద ఆదాయం వైకాపా నాయకుల జేబుల్లోకి వెళ్తోంది. రాష్ట్ర ఆదాయం పడిపోయి అప్పుల పాలైన పరిస్థితి. వైకాపా హయాంలో రూ.8 లక్షల కోట్లు అప్పు తెచ్చారు. మిగిలిన రెండేళ్లలో మరో రూ.3 లక్షల కోట్లు అప్పు తెస్తారు." - యనమల రామకృష్ణుడు, తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు

రైతులను దొంగలుగా భావించి.. వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెడుతున్నారా? అంటూ వైకాపా ప్రభుత్వంపై తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడితే ఉద్యమిస్తామని హెచ్చరించారు. మీటర్లు బిగిస్తే 30 శాతం విద్యుత్ ఆదా అవుతుందన్న ప్రభుత్వ వ్యాఖ్యల వెనుకున్న అర్థమేంటని నిలదీశారు.

విద్యుత్ దోచేయడానికి రైతులేమీ దొంగలు కాదన్నారు. ఆదా అయిన కరెంటుతో గృహ విద్యుత్ ఛార్జీలేమైనా తగ్గిస్తారా అని అడిగారు. పంటను మద్దతు ధరకు అమ్ముకున్న రైతులు.. కేవలం 2 శాతం మాత్రమే ఉంటారన్న సోమిరెడ్డి... అందరికీ కనీస మద్దతు ధర ఇప్పించినట్లు ప్రభుత్వం నిరూపించగలదా అని సవాల్‌ విసిరారు. రైతులకు ధాన్యం కొనుగోళ్లల్లో న్యాయం చేశామని ప్రభుత్వం గుండె మీద చేయి వేసుకుని చెప్పగలదా అని ధ్వజమెత్తారు.

ఏపీలో రెండున్నరేళ్ల జగన్ పాలనలో 2,112 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వీళ్లల్లో కౌలు రైతులు ఎక్కువగా చనిపోయారన్నారు. కానీ ప్రభుత్వం మాత్రం కేవలం 718 మందే ఆత్మహత్య చేసుకున్నారని అంటోందని విమర్శించారు. రైతు భరోసా ద్వారా రూ.1.10 వేల కోట్లు ఇచ్చామని సీఎం జగన్ గొప్పలు చెప్పుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

జగన్ ప్రభుత్వంలో ధాన్యం రైతుల పరిస్థితి దైన్యంగా ఉందని మండిపడ్డారు. ఎమ్మెస్పీతో పోలిస్తే ఎకరానికి రూ.15 వేల చొప్పున నష్టపోయారని తెలిపారు. ఏపీలో రైతు కుటుంబానికి రూ.7,500 ఇస్తున్నారని.. తెలంగాణలో రైతు బంధు కింద రూ.10 వేలు ఇస్తున్నారని చెప్పారు. దేశం మొత్తం మీద డ్రిప్ ఇరిగేషన్ అమలవుతుంటే.. ఏపీలో ఎందుకు అమలు కావడం లేదని ప్రశ్నించారు.

"ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధర కల్పించట్లేదు. పక్క రాష్ట్రంలో ఒక్క సీజన్‌కు కోటి టన్నులు కొంటున్నారు. పక్క రాష్ట్రంలో కొనుగోలు చేసిన మూడోరోజే నగదు జమ చేస్తున్నారు. వైకాపా ప్రభుత్వం విధ్వంసం తప్ప సాధించిందేమీ లేదు. రైతుల భూములకు భూసార పరీక్షలు చేసే దిక్కు లేదు. వ్యవసాయ మోటార్లకు విద్యుత్‌ మీటర్లు బిగిస్తున్నారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడితే ఉద్యమానికి సిద్ధం." - సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి, తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.