ETV Bharat / city

ఆదాయ మార్గాలు అన్వేషించకుండా అప్పులతో పాలన ఎన్నాళ్లు ?: యనమల

author img

By

Published : Jul 23, 2021, 3:32 PM IST

tdp leader Yanamala on state loans
తెదేపా నేత యనమల

ఇష్టానుసారం ఖర్చులతో ఆర్థిక సంక్షోభం సృష్టించి రాష్ట్రం దివాలా తీసేస్థితికి తీసుకొచ్చారని అధికార పార్టీపై తెదేపా నేత యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. ఆదాయ మార్గాలు అన్వేషించకుండా అప్పులతో ఎన్నాళ్లు పాలన సాగిస్తారని ముఖ్యమంత్తి జగన్​ను ప్రశ్నించారు.

అప్పులకు గ్యారంటీ అవసరం లేదని ఆర్థిక మంత్రి బుగ్గన.. రాష్ట్ర ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని తెదేపా నేత యనమల(yanamala) రామకృష్ణుడు అన్నారు.. అప్పులకు గ్యారంటీ అవసరంతోపాటు కేంద్ర అనుమతి అక్కరలేదనడం దుర్మార్గం అన్నారు. ఏ కార్పొరేషన్ ద్వారా రుణాలు తీసుకున్నా.. గ్యారంటీ ఇవ్వాల్సిందేనన్నారు. ఆర్టికల్ 293(3) ప్రకారం బడ్జెట్ అప్పులకు కేంద్ర అనుమతి తప్పనిసరితోపాటు ఎఫ్ఆర్బీఎం పరిధి 3శాతం దాటకూడదని స్పష్టం చేశారు. 2శాతం అదనపు రుణాల కోసం కేంద్రం షరతులతో అనుమతిచ్చింది వాస్తవమో కాదో రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గ్యారంటీ అవసరమే లేదనుకుంటే ఎస్క్రో ఒప్పందం ఎందుకు చేసుకున్నారని నిలదీశారు. ఇష్టానుసారం ఖర్చులతో ఆర్థిక సంక్షోభం సృష్టించిన సీఎం జగన్.. రాష్ట్రం దివాలా తీసే స్థితికి తెచ్చారని ఓ ప్రకటనలో ధ్వజమెత్తారు.

"కార్పొరేషన్ల ద్వారా తీసుకునే రుణాలకు ఇచ్చే గ్యారంటీలు రాష్ట్ర ఆదాయంలో 90శాతం మించరాదు. రాష్ట్ర ప్రభుత్వం ఈ నిబంధనల పక్కకు పెట్టి అప్పులకు గ్యారంటీలు ఇచ్చింది. మార్కెట్ రుణాల కంటే ఆఫ్ బడ్జెట్ రుణాలు ఎక్కువగా చేసింది." అని విమర్శించారు.

అది పెద్ద తప్పిదమే..

2019-20లో రూ.77,700 కోట్లు, 2020-21లో రూ.91,000 కోట్ల బడ్జెట్ రుణాల గురించి కేంద్ర ప్రభుత్వానికి చెప్పకపోవడం పెద్ద తప్పిదమని యనమల మండిపడ్డారు. సంక్షేమానికి ఆఫ్ బడ్జెట్ రుణాలు ఖర్చు చేస్తే, కార్పొరేషన్ రుణాలను ఎలా రికవరీ చేస్తారు. కార్పొరేషన్లు రుణాలు తీర్చకపోతే ఆ భారం ప్రభుత్వంపైనే పడుతుందన్నారు.. సంక్షేమానికి చేసిన ఖర్చును ఆర్థికాభివృద్ధిలోకి ఎలా వస్తుందని నిలధీశారు.

"వినిమయ బడ్జెట్​తో బడుగు బలహీన వర్గాల ఆర్ధిక అభివృద్ధి ఎలా సాధ్యం. రాష్ట్రాభివృద్ధి ప్రశ్నార్థకం చేసి పేదలను ఇంకా పేదలుగాను, ధనికుల్ని మరింత ధనికులుగా చేస్తున్నారు. పేదల సంక్షేమం సాకుతో వారిపై అప్పుల భారం మోపి కొత్త ధనిక వర్గానికి జగన్ రెడ్డి చేయూతనిస్తున్నారు. సెస్ ద్వారా వసూలు చేసే నిధుల్ని ఖజానాకు జమ చేయకుండా ఏవిధంగా ఖర్చు చేస్తారో మంత్రి సమాధానమివ్వాలి. డెట్ సర్వీస్ ఇప్పటికే రూ.లక్షకు చేరుకుంది. ఆదాయాలన్నీ ఖర్చులకు సరిపోతే ఇక అభివృద్ధికి తావెక్కడ. రాష్ట్ర ఆదాయం పెరగకుండా, అప్పులూ దొరక్క.. అభివృద్ధి, సంక్షేమం అమలు ఎలా సాధ్యం. ఇప్పటికే సంక్షేమ రంగం సంక్షోభంలో కూరుకుపోయి, అభివృద్ధి కుంటుపడింది. ప్రజాదాయం పెంచేందుకు గత రెండేళ్లలో ఒక్క ప్రణాళికా వేయకపోగా.. ఆదాయ మార్గాలను అన్వేషించట్లేదు. ఇష్టానుసారం అప్పులు చేసి ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితికి వచ్చారు" అని యనమల దుయ్యబట్టారు.

ఇదీ చదవండి..

అప్పులకు గ్యారంటీ అక్కర్లేదు: ఆర్థిక మంత్రి బుగ్గన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.