ETV Bharat / city

ఎవరి కళ్లలో ఆనందం కోసం ఇదంతా చేశారు.. ప్రశ్నించడమే నా తప్పా? : ఏబీ వెంకటేశ్వరరావు

author img

By

Published : Apr 22, 2022, 1:26 PM IST

Updated : Apr 23, 2022, 5:35 AM IST

SC quashes IPS AB Venkateswara Rao's suspension
ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌ను రద్దుచేసిన సుప్రీంకోర్టు

13:22 April 22

ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌ రద్దు చేసిన సుప్రీంకోర్టు

IPS AB Venkateshwar rao: సీనియర్ ఐపీఎస్ అధికారి, ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌ రద్దు చేస్తూ.. సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. మళ్లీ సర్వీసులోకి తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్​ లీవ్​ పిటిషన్​ (ఎస్‌ఎల్‌పీ)ను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు.. హైకోర్టు ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. రెండేళ్లకు మించి సస్పెన్షన్​ విధించడం కుదరదని పేర్కొంది. ఏబీవీని మళ్లీ సర్వీసులోకి తీసుకోవాని ఆదేశించింది.

అసలేం జరిగింది..? దేశ, రాష్ట్ర భద్రతా వ్యవహారాల్లో నిబంధనల్ని అతిక్రమించారంటూ రాష్ట్ర ఇంటెలిజెన్స్ మాజీచీఫ్ ఏబీ వెంకటేశ్వరరావును 2020 ఫిబ్రవరిలో సర్వీసు నుంచి ప్రభుత్వం సస్పెండ్ చేసింది. జాతీయ, రాష్ట్ర భద్రతకు ముప్పు కలిగించేలా ఓ విదేశీ రక్షణ ఉత్పత్తుల తయారీ సంస్థకు పోలీసు సెక్యూరిటీ ప్రోటోకాల్ వ్యవస్థ వివరాలను అప్పగించారని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇజ్రాయెల్‌కు చెందిన రక్షణ ఉత్పత్తుల తయారీ సంస్థతో వెంకటేశ్వరరావు కుమ్మక్కయ్యారని.. నిబంధనలకు వ్యతిరేకంగా నిఘా ఉపకరణాలు కొనుగోలు చేశారని ఆయనపై మోపిన అభియోగాల్లో ప్రభుత్వం పేర్కొంది.

నేనెప్పుడూ చట్ట ప్రకారమే ముందుకెళ్లా : సస్పెన్షన్‌ రద్దు చేస్తూ.. మళ్లీ సర్వీసులోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో.. దీనిపై ఏబీ వెంకటేశ్వరరావు స్పందించారు. తానెప్పుడూ చట్టప్రకారమే ముందుకెళ్లానని పేర్కొన్నారు. కేసును తప్పుదారి పట్టించిన వారినుంచి రెవెన్యూ రికవరీ చేయాలని డిమాండ్ చేశారు.

‘ఒక తప్పుడు రిపోర్టు ఆధారంగా నన్ను సస్పెండ్‌ చేశారు. హైకోర్టు ఆ సస్పెన్షన్‌ను కొట్టేసింది. ఈ రోజు సుప్రీంకోర్టు అదే విషయాన్ని ధ్రువీకరించింది. కానీ అందుకు రెండు సంవత్సరాల రెండు నెలలు పట్టింది. ఇదంతా ఎందుకు జరిగింది? దీనికి కారకులెవరు? ఈ రోజు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేసు ఓడిపోవడానికి కారణమెవరు? ఏ బావ కళ్లలో ఆనందం కోసం ఇదంతా చేశారు? ఎవరి కళ్లలో ఆనందం కోసం ఇదంతా చేశారు?’ అని ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సూటిగా ప్రశ్నించారు. తనపై సస్పెన్షన్‌ ఎత్తివేస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన అనంతరం కోర్టు ఆవరణలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘2020 ఫిబ్రవరి 8వ తేదీ అర్ధరాత్రి నన్ను సస్పెండ్‌ చేయడంతో పాటు అదే సమయంలో అనేక అభాండాలతో ముఖ్యమంత్రి సీపీఆర్వో పూడి శ్రీహరి ఒక విష ప్రచార ప్రకటన విడుదల చేశారు. అది విస్తృతంగా ప్రచారమైంది. సాక్షి టీవీ రెండు రోజులు అదే పని మీద ఉండటంతో చాలామంది దాన్ని నమ్మారు. నమ్మనివాళ్లు కూడా ఏం జరిగిందో నన్ను అడగడానికి ఇబ్బంది పడ్డారు. దాంతో చట్టబద్ధంగా ఈ అంశాన్ని ఎదుర్కొంటానని మర్నాడు నేను పత్రికా ప్రకటన విడుదల చేశాను. సస్పెన్షన్‌ను ప్రశ్నిస్తూ నేను క్యాట్‌కు వెళ్లినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సీనియర్‌ న్యాయవాది ప్రకాష్‌రెడ్డిని నియమించి ఆయనకు రూ.20 లక్షల ఫీజు చెల్లించింది. హైకోర్టులో ఏజీ వాదించారు, అక్కడ ఎంత ఖర్చయిందో తెలియదు. సుప్రీంకోర్టులో న్యాయవాదుల బృందాన్నే నియమించారు. అందుకు ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చయ్యాయో తెలియదు. నాకూ ఖర్చు అయినందున ప్రభుత్వం ఈ కేసులో పెట్టిన ఖర్చుకు సమానంగా నాకూ కోర్టు ఖర్చులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరతా’ అని తెలిపారు.

ప్రవీణులు... ప్రబుద్ధులు

‘ఒక డీజీపీ ఇచ్చిన ఫోర్జరీ మెమో ఆధారంగా ఒక ఏడీజీ సీఐడీ రాయించిన తప్పుడు రిపోర్టు ఆధారంగా అప్పట్ల్లో ఉన్న ప్రవీణులు, చీఫ్‌ సెక్రటరీలు ఏం చదవకుండానే గుడ్డి సంతకాలు పెట్టి 24 గంటల్లో సస్పెన్షన్‌ ఉత్తర్వులు ఇచ్చారు. తప్పుడు రిపోర్టుల ఆధారంగా ఆరు నెలలకోసారి సస్పెన్షన్‌ పొడిగించడంతో పాటు దానిపై ముగ్గురు సీనియర్‌ అధికారులతో కూడిన రివ్యూ కమిటీ సస్పెన్షన్‌ను పొడిగించాల్సిందేనని సిఫార్సులు చేస్తూ పోయింది. ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టించిన అధికారుల ప్రవర్తనను సాక్ష్యాలతో సహా నేను ప్రభుత్వానికి నివేదించాను. వారు ఏం చర్యలు తీసుకున్నారో నాకు తెలియదు. సీఐడీ డీఎస్పీ నుంచి చీఫ్‌ సెక్రటరీ వరకు అంతా తలా తోకా లేని ఆవు వ్యాసం రాశారు. కేంద్ర ప్రభుత్వానికి, కోర్టు అఫిడవిట్లలోనూ అదే ఆవు వ్యాసం రాశారు. వాళ్లు కాగితాలు చదవరా? ఫుల్‌స్టాప్‌, కామాలు కూడా మార్చరా..? అసలు కొనుగోలు చేయనిదాంట్లో అవినీతి ఎలా జరుగుతుందని ఒక్కరూ ప్రశ్నించరా? ఆలోచించరా? వారికి వృత్తినైపుణ్యం లేదా? నన్ను ఇష్టపడే లక్షల మందిని క్షోభ పెట్టి ఏం సాధించారు? ప్రజలు చెమటోడ్చి రక్తం చిందించి పన్నులు కడితే వచ్చిన ప్రజల సొమ్మును ఎలా ఖర్చు చేస్తారు?

పారపుచ్చుకొని పొలానికి నీళ్లు పెడితే, బడ్డీ కొట్టులో పొద్దున్నుంచి సాయంత్రం వరకు కూర్చుంటే, కూరగాయల బండిపై కాలనీలో కూరగాయలు అమ్ముకొని వస్తే వాళ్లకు శ్రమ విలువ తెలుస్తుంది. పన్నుల సొమ్మును ఇలాంటి పనికిమాలిన, తప్పుడు, దొంగ, చెత్త కేసులు వేసి ఖర్చుపెట్టడానికి ఆ అధికారులకు తప్పు అనిపించడం లేదా? మనం ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులం అయ్యింది ఇందుకోసమేనా? ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టించి చట్టవిరుద్ధ, నిర్హేతుక, ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడానికి కారణమైన అధికారులు, అనధికారులెవరైనా ఉంటే వాళ్లందరికీ బుద్ధి వచ్చేలా శిక్షించాలని, జరిగిన నష్టాన్ని, ఖర్చును వాళ్ల జేబుల్లో నుంచి వసూలు చేయాలని ప్రభుత్వాన్ని కోరతాను’ అని చెప్పారు.

యూపీఎస్సీపైనా ఒత్తిడి

తనపై వచ్చిన ఆరోపణలపై విచారించిన నివేదిక తనకు ఇస్తే సమాధానం ఇచ్చానని ఆయన ఓ ప్రశ్నకు బదులిచ్చారు. దానిని ఆలస్యంగా కేంద్ర ప్రభుత్వానికి పంపారని... కేంద్రం యూపీఎస్సీకి పంపిందన్నారు. యూపీఎస్సీ సమీక్షకు మూడు నాలుగు నెలల సమయం తీసుకుంటుందన్నారు. అయితే కొందరు ప్రబుద్ధులు.. ప్రవీణులు యూపీఎస్సీకి వెళ్లి రిపోర్టు తమకు అనుకూలంగా రాయాలని కోరితే వాళ్లు వాతలు పెట్టి పంపినట్లు తెలిసిందన్నారు. ప్రభుత్వం తలుచుకుంటే తప్పుదారి పట్టించిన అధికారుల నుంచి కేసుకు అయిన ఖర్చు వసూలు చేయొచ్చని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ప్రజల సొమ్ముకు బాధ్యులైనవారు ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే రెండు నెలల తర్వాత.. కాకపోతే రెండేళ్ల తర్వాతైనా ప్రతి రూపాయికీ లెక్క చెప్పాల్సిందేనన్నారు. రెండేళ్లకు మించి సస్పెండ్‌ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేనందున ఎత్తివేయాలని తాను ప్రస్తుత సీఎస్‌కు లేఖ రాస్తే ఆయన పట్టించుకోలేదన్నారు. ఆయనకు నిబంధనలు తెలియవా.. చదువుకోలేదా? అని ప్రశ్నించారు. ఆయన తగిన సమయంలో నిర్ణయం తీసుకుంటే ఈ ఖర్చంతా తప్పేదన్నారు. ప్రభుత్వాలు నడిపేవాళ్లు వస్తుంటారు.. పోతుంటారని, తన సర్వీసులో పది పన్నెండు బ్యాచ్‌లను చూశానని, సీఎస్‌లు 15-20 మందిని చూశానన్నారు. ప్రజలు, వారు రాసుకున్న శాసనం, శాసనం ద్వారా ఏర్పడిన ప్రభుత్వం, న్యాయం, ధర్మం మాత్రమే శాశ్వతమన్నారు.

నేను లోకల్‌.. ఎవరినీ వదిలిపెట్టను

తాను లోకల్‌ అని, తన విషయంలో తప్పుడు నిర్ణయాలు తీసుకున్నవాళ్ల మీద చర్యలు తీసుకునే వరకూ వదలబోనని ఆయన హెచ్చరించారు. అధికారుల వెనుక పాలకులు ఉన్నారని అనుకుంటున్నారా అని ప్రశ్నించగా పాలకులు.. అధికారులని కాదని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరతానన్నారు. తనపై క్రిమినల్‌ కేసుల విషయంలో చట్టపరంగా ముందుకు పోతానన్నారు. పోలీస్‌ డ్రస్సో.. లేక ఏదో ఒక డ్రస్సో వేసుకుంటానని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం విధుల్లో చేరతానన్నారు. లోకల్‌ అంటే ఏం చేస్తారనగా జరగబోయేది మీకే తెలుస్తుందని బదులిచ్చారు.

నేను ఎప్పుడూ చట్ట ప్రకారమే ముందుకెళ్లా. ఎవరి కళ్లలో ఆనందం కోసం ఇదంతా చేశారు? నన్ను, నా కుటుంబాన్ని క్షోభ పెట్టి ఏం సాధించారు? సస్పెన్షన్‌ను ప్రశ్నించడమే నేను చేసిన తప్పా? నాపై వాదించే లాయర్లకు రూ.లక్షల ఫీజు చెల్లించారు. అసలు కొనుగోలే లేనప్పుడు అవినీతి ఎలా జరుగుతుంది? కొందరు తప్పుడు కేసులతో ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చారు. తప్పుదారి పట్టించిన వారినుంచి రెవెన్యూ రికవరీ చేయాలి. బాధ్యులపై చర్యలు తీసుకునే వరకు వదిలిపెట్టేది లేదు. ప్రభుత్వానికి, అధికారులకు చట్టాలు, నిబంధనలు తెలియవా? .-ఏబీ వెంకటేశ్వరరావు, ఐపీఎస్ అధికారి

సంబంధిత కథనాలు:

Last Updated : Apr 23, 2022, 5:35 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.