ETV Bharat / city

Schools Reopen: నేటినుంచే రాష్ట్రంలో పాఠశాలల పునఃప్రారంభం

author img

By

Published : Aug 16, 2021, 4:28 AM IST

రాష్ట్రవ్యాప్తంగా నేడు విద్యాసంస్థలు ప్రారంభం కానున్నాయి. కరోనా నిబంధనలు పక్కాగా పాటించాలని, విద్యార్థులు గుమికూడకుండా చూడాలని ప్రభుత్వం నిర్దేశించింది. గదుల కొరత ఉంటే రోజు విడిచి రోజు తరగతులు నిర్వహించాలని స్పష్టంచేసింది. అలాగే కరోనా కేసులు 10శాతం లోపు ఉన్న ప్రాంతాల్లోనే విద్యాలయాలు తెరవాలని ఇప్పటికే మార్గదర్శకాలు జారీ చేసింది.

Schools Reopen
Schools Reopen

కరోనా రెండో దశ ఉద్ధృతితో ఏప్రిల్‌ 20న మూతబడిన విద్యాసంస్థల్లో.. ఇన్నాళ్ల తర్వాత మళ్లీ సందడి మొదలు కానుంది. కరోనా నిబంధనలు పాటిస్తూ 1 నుంచి 10వ తరగతితోపాటు ఇంటర్మీడియట్‌ రెండో ఏడాది విద్యార్థులకు పాఠాలు బోధించనున్నారు. గదుల కొరత ఉన్న విద్యాసంస్థల్లో రెండు విడతలుగా తరగతులు నిర్వహిస్తారు. పాఠశాల ఆవరణల్లో గ్రామ, వార్డు సచివాలయాలు తొలగించాలని హైకోర్టు ఆదేశించినా.. కొన్నిచోట్ల ఇప్పటికీ కొనసాగుతుండటం విద్యార్థులకు ఇబ్బందిగా మారనుంది. పాఠశాల విద్యలో నూతన విద్యావిధానం అమలు చేయనున్నారు.

ఆరు విభాగాలుగా పాఠశాల విద్యావ్యవస్థ

ఇప్పటివరకు ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత అనే మూడు విభాగాలుగా ఉన్న పాఠశాల విద్యావ్యవస్థను.. ఆరు విభాగాలుగా మారుస్తున్నారు. పూర్వ ప్రాథమిక విద్య(పీపీ)-1, 2 నిర్వహించే అంగన్‌వాడీలు.. శాటిలైట్‌ ఫౌండేషన్‌ బడులుగా మారతాయి. పీపీ-1, 2తోపాటు ఒకటి, రెండు తరగతులు ఉంటే ఫౌండేషన్‌గా, పీపీ-1, 2తోపాటు 1 నుంచి 5తరగతులు ఉంటే ఫౌండేషన్‌ ప్లస్, 3 నుంచి 7లేదా 8వ తరగతి వరకు ఉంటే ప్రీ-హైస్కూళ్లు, 3 నుంచి 10వరకు ఉన్నత పాఠశాలలు, 3 నుంచి 12 వరకు హైస్కూల్‌ ప్లస్‌గా ఉంటాయి.

అయోమయంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు..
నూతన విద్యావిధానంలో భాగంగా 250 మీటర్ల దూరంలోని 3, 4, 5.. తరగతులను ఉన్నత పాఠశాలలకు తరలిస్తున్నారు. ఈ పరిణామం విద్యార్థులతోపాటు, ఉపాధ్యాయులనూ అయోమయానికి గురిచేస్తోంది. ఏ స్కూలు తరలిపోతుంది, ఏ ఉపాధ్యాయుడు ఎక్కడికి వెళ్లాల్సి వస్తుందనే దానిపై ఇప్పటిదాకా స్పష్టత లేదు. 3, 4, 5 తరగతుల తరలింపును నిరసిస్తూ నల్లబ్యాడ్జిలతో విధులకు హాజరుకావాలని ఏపీ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య నిర్ణయించింది. అన్ని ప్రాథమిక పాఠశాలల్లోని 3, 4, 5 తరగతులను ఉన్నత పాఠశాలలకు తరలించాలని పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదించగా.. ఉపాధ్యాయ సంఘాలు, ఎమ్మెల్సీలు, విద్యావేత్తలు తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ తర్వాత దీనిపై కొంత వెనక్కి తగ్గిన ప్రభుత్వం.. 250 మీటర్ల దూరంలో ఉన్నవాటిని తరలించాలని నిర్ణయించింది.

ఇదీ చదవండి:

జియో-గూగుల్​ కొత్త స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్లు ఇవేనా?

Arrest: రమ్య హత్య కేసులో నిందితుడు అరెస్ట్: డీజీపీ గౌతమ్ సవాంగ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.