ETV Bharat / city

sand depot : 'డిపోల నుంచి ఇసుక తీసుకెళ్లొచ్చు'

author img

By

Published : Aug 21, 2021, 5:29 AM IST

‘నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద గృహ నిర్మాణాలు చేపట్టే లబ్ధిదారులు..జేపీ వెంచర్స్‌ కంపెనీ ఏర్పాటు చేసిన డిపోల నుంచి ఇసుకను తీసుకెళ్లేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. సమీపంలో నదులు లేని ప్రాంతాల్లో ఇసుక సమస్యలు తలెత్తకుండా 130 చోట్ల డిపోలను ఏర్పాటు చేశారు. ఆయా చోట్ల ప్రభుత్వ పథకం కింద సొంత స్థలాలు ఉండి ఇల్లు కట్టుకునే వారు, జగనన్న కాలనీల్లో ఇళ్లు నిర్మించుకునే వారు ఇసుకను తరలించుకునేందుకు అనుమతిచ్చింది. వరదల కారణంగా రీచ్‌ల్లో తవ్వకాలు వీలులేని చోట ఏర్పాటు చేసిన డిపోల నుంచీ ఇసుక తీసుకెళ్లొచ్చు.

రాష్ట్రంలో డిపోల నుంచి ఇసుక తరలింపు
రాష్ట్రంలో డిపోల నుంచి ఇసుక తరలింపు

డిపోల నుంచి ఇసుక తరలింపు అనుమతితో ప్రభుత్వంపై భారం తగ్గనుంది. 40 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ఉండే లేఅవుట్‌కు జేపీ వెంచర్స్‌ కంపెనీ ప్రత్యేక వాహనాల్లో ఇసుకను తరలించాలి. ఇందుకుగాను గృహనిర్మాణశాఖ టన్నుకు రూ.175లను సదరు సంస్థకు చెల్లిస్తుంది. 40 కిలోమీటర్ల కంటే తక్కువ దూరంలో ఉన్న డిపో నుంచి జగనన్న కాలనీలకు ఇసుకను తీసుకెళ్లేందుకు గృహనిర్మాణశాఖ అధికారులు కూపన్‌ జారీ చేస్తారు. ఇసుక ఉచితంగా ఇస్తారు. రవాణా బాధ్యత లబ్ధిదారులదే. ఎక్కడికక్కడ డిపోలు ఏర్పాటు వల్ల లేఅవుట్‌లకు ఉండే దూరం తగ్గనుంది. ఆ మేరకు ప్రభుత్వానికి రవాణా భారం తగ్గుతుంది.
3.47 లక్షల మెట్రిక్‌ టన్నుల ఇసుక సరఫరా.. పురపాలక సంఘాలు, పట్టణాభివృద్ధి సంస్థల్లో చేపడుతున్న ఇళ్ల నిర్మాణానికి ఇప్పటివరకు జేపీ వెంచర్స్‌ కంపెనీ 3,47,562 మెట్రిక్‌ టన్నుల ఇసుకను సరఫరా చేసింది. ఇందులో 40 కిలోమీటర్లు దాటి ఉన్న లేఅవుట్‌లకు 1,18,677 మెట్రిక్‌ టన్నులు సరఫరా జరిగింది. అంతకంటే తక్కువ దూరంలో ఉన్న లేఅవుట్‌లకు 2,28,885 మెట్రిక్‌ టన్నులు సరఫరా చేశారు.

ఇసుక కోటా పెంపుపై ప్రత్యేక కమిటీ...

గృహనిర్మాణానికి ప్రస్తుతం ఇస్తున్న 20 టన్నుల ఇసుక కోటాను మరో 5 నుంచి 10 టన్నులకు పెంచాలన్న ఎమ్మెల్యేల విజ్ఞప్తిపై ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇటీవల జిల్లాలు, డివిజన్‌ స్థాయిలో జరిగిన సమీక్షా సమావేశాల్లో ఇసుక కోటాను పెంచాలని ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు గృహనిర్మాణశాఖ అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. 25 టన్నులకు పెంచేందుకు అనుమతివ్వాలని గృహనిర్మాణశాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. దీనిపై ప్రభుత్వం గృహనిర్మాణ సంస్థ, టిడ్కో, హౌసింగ్‌ బోర్డు అధికారులతో కమిటీని ఏర్పాటు చేయాలని సూచించింది. ఈ కమిటీ ప్రభుత్వ నమూనా ప్రకారం ఇల్లు నిర్మించేందుకు ఎంత ఇసుక అవసరం? కాస్త అందంగా కట్టుకుంటే ఎంత అవసరం కానుంది? అనే వివరాలు పరిశీలించి ప్రభుత్వానికి నివేదించనుంది. ఆ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.

ఇవీచదవండి.

polavaram : పోలవరం రివైజ్డ్‌ అంచనాలు..హైదరాబాదే దాటలేదు

RAHUL MURDER CASE : రాహుల్ హత్య కేసు... కీలక నిందితుల కోసం గాలింపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.