ETV Bharat / city

Polavaram: ముంపులో మగ్గుతున్న పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులు

author img

By

Published : Jul 13, 2021, 10:36 PM IST

పోలవరం ప్రాజెక్టు కోసం వారంతా భూమిని త్యాగం చేశారు. ప్రభుత్వ పరిహారం, పునరావాసం కోసం ఎదురుచూశారు. పునరావాస ప్రాంతాల్లో ప్రభుత్వం ఇళ్లు నిర్మించింది కానీ.. కనీస మౌలిక వసతులు లేవు. ఇలాంటి స్థితిలో భారీవర్షాలొస్తే పరిస్థితేంటి అన్నదే ఇప్పుడు వారికి ప్రశ్నగా మిగిలింది. కాఫర్ డ్యామ్ కారణంగా ముంపు ప్రాంతాల్లోని గ్రామాల్లో ప్రవాహం ఇళ్లను ముంచెత్తుతోంది. అసంపూర్తిగా ఉన్న పునరావాస కాలనీలకు వెళ్లాలా.. లేక ప్రభుత్వమిచ్చే పరిహారంతో సొంతిళ్లూ, మూటాముల్లె సర్దుకుని ఊరూవాడా విడిచివెళ్లాలా అర్థంకాని పరిస్థితిలో ఉన్నారు. ఉభయగోదావరి జిల్లాల్లో పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాలను ఈటీవీ-ఈనాడు బృందం సందర్శించింది.

polavaram project expatiraites problems
ముంపులో మగ్గుతున్న పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులు

గోదావరి తీరాన ఉన్న పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులు పరిహారం పూర్తిస్థాయిలో దక్కక.. పునరావాసమూ లేక దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఎగువ కాఫర్ డ్యామ్ కారణంగా.. ప్రాజెక్టు సమీపంలోని ప్రాంతాల్లోకి బ్యాక్ వాటర్ చొచ్చుకొస్తోంది. ఫలితంగా.. ఉభయగోదావరి జిల్లాల్లోని గిరిజన గ్రామాల నిర్వాసితులు.. ఎత్తయిన ప్రాంతాల్లో తాత్కాలిక గుడిసెలు నిర్మించుకున్నారు. కొందరు అక్కడా ఉండలేక.. దూరప్రాంతాల్లో అద్దె ఇంట్లో ఉంటున్నారు. కుటుంబానికి 10 లక్షల రూపాయల పరిహారం చెల్లిస్తామంటూ.. పునరావాస కాలనీల నిర్మాణం చేపట్టినా.. అవి అసంపూర్తిగా ఉండటం వల్ల.. అక్కడికీ వెళ్లి తలదాచుకోలేని దుస్థితి నెలకొంది. ప్రాజెక్టు కోసం భూములు త్యాగం చేసినా.. తమ కష్టాలను పట్టించుకునే దిక్కు లేకపోయిందన్న వ్యథలో నిర్వాసితులు కూరుకుపోయారు.

నీట మునుగుతున్న పలు ప్రాంతాలు

గోదావరిలో ప్రవాహం మొదలు కాకముందే.. ప్రాజెక్టు ఎగువన ఉన్న చాలా మండలాలు ముంపులోకి వెళ్తున్నాయి. కాఫర్‌డ్యామ్ కారణంగా.. గోదావరి వెనుక జలాలతో కొన్నిప్రాంతాలు నీట మునుగుతున్నాయి. ఉభయగోదావరి జిల్లాల్లోని దేవీపట్నం, వేలేరుపాడు, కుక్కునూరు, వీ.ఆర్​.పురం తదితర ప్రాంతాల్లో.. నీరు చొచ్చుకోస్తోంది. పోలవరం నుంచి ఎగువన 50 కిలోమీటర్ల దూరంలోని వేలేరుపాడు వద్ద చాలాప్రాంతాలు.. ఎక్కడికక్కడ చిన్నపాటి జలాశయాల్లా మారాయి.

సురక్షిత ప్రాంతాలకు ప్రజలు
భద్రాచలం దగ్గర ప్రవాహం లేకపోయినా.. ముంపు ప్రాంతాలను నీరు చుట్టుముట్టడంతో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. ఇంకొందరు.. కొండలపై పాకలు వేసుకుంటున్నారు. ఈ ప్రభావం వేలేరుపాడు, కొయిదా సహా దాదాపు అన్ని ముంపు ప్రాంతాల్లోనూ కనిపిస్తోంది.

పోలవరం ప్రాజెక్టు సమీప ప్రాంతాల్లో చుట్టుముట్టిన ప్రవాహం
ప్రాజెక్టు సమీప ప్రాంతాలైన పోలవరం, దేవీపట్నం మండలాల్లో.. ఇప్పటికే 44 గ్రామాలను ప్రవాహం చుట్టుముట్టింది. మంటూరు, మడిపల్లి, రమణయ్యపేట, పూడిపల్లి, పోశమ్మగండి, ఏ.వీరవరం, తొయ్యేరు ఇలా.. అనేక గ్రామాల ప్రజలు ఇళ్లు ఖాళీ చేసి ఇతర ప్రాంతాలకు వెళ్లారు. కొన్ని గ్రామాల్లో మాత్రం పునరావాసం, పరిహారం ఇచ్చేవరకూ ఇల్లు కదిలేది లేదని నిర్వాసితులు అంటున్నారు. ప్రాజెక్టులో 41.5 మీటర్ల ఎత్తున నీరు నిల్వ ఉంది. ముంపు మండలాల ప్రజలకు తొలివిడతలో పునరావాస కాలనీలు ఏర్పాటు చేయాలని.. గతంలో ప్రభుత్వం నిర్ణయించింది.

ఐదు మండలాల్లోని 20 వేల 870 కుటుంబాలను తరలించాలని అంచనా వేశారు. తొలిదశ ముంపు మండలాలకు.. 73 చోట్ల పునరావాస కాలనీల నిర్మాణం చేపట్టినా.. ఏ ఒక్కటీ పూర్తి కాకపోవడం వల్ల.. పూర్తిగా తరలించలేని దుస్థితి నెలకొంది. ప్రవాహం ముంచెత్తుతుందన్న భయంతో కొందరు తట్టాబుట్టా సర్దుకుని.. అసంపూర్తిగా ఉన్న నిర్వాసిత కాలనీలకు చేరారు. నిర్మాణం పూర్తికాకపోయినా.. కొందరు వాటిలోనే ఉంటున్నారు.

నివాసాలు నీటిలోనే..

గతంలో వరదలు, వర్షాల సమయంలో.. 3, 4 రోజుల్లోనే నీటిమట్టం తగ్గి ప్రజలంతా ఇళ్లకు వెళ్లే అవకాశం ఉండేది. ఈసారి ఎగువ కాఫర్ డ్యామ్ కారణంగా నీరు ఎగదన్నటం వల్ల.. కనీసం మూణ్నెళ్ల పాటు వారి నివాసాలు నీటిలోనే మునిగి ఉండే అవకాశం ఉంది. కొన్నిచోట్ల అద్దె ఇళ్లు దొరకడం లేదు. ఒకవేళ దొరికినా భారీగా అడ్వాన్స్ చెల్లించాల్సి వస్తోంది. గోదావరికి వరదలు సహజమేనన్న అధికారుల తీరుతో.. అసంపూర్తిగా ఉన్న ఇళ్లలోనే మగ్గుతున్నారు.

ఇదీ చదవండి:

cm tour: సీఎం జగన్‌ పోలవరం పర్యటన వాయిదా.. కారణం?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.